4,230 స్థానాల్లో టీడీపీ గెలుపు!
posted on Feb 22, 2021 @ 1:15PM
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసినా అధికార, విపక్షాల మధ్య పంచాయితీ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. నాలుగు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా గెలుచుకున్నామని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. అయితే టీడీపీ మాత్రం తాము 35 శాతం సీట్లు గెలిచామని చెబుతోంది. పారదర్శకంగా ఎన్నికలు జరిగితే అధికార పార్టీ అడ్రస్ గల్లంతయ్యేదని టీడీపీ నేతలు అంటున్నారు.
పంచాయతీ ఎన్నికలపై మాట్లాడిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు.ప్రజలను వేధించే ప్రభుత్వాన్ని ఇదివరకెప్పుడూ చూడలేదని అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ పతనం ప్రారంభమైనట్లు తెలుస్తోందని, దీనిని ఎవరూ కాపాడలేరని అన్నారు. వైసీపీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అరాచకాలు సృష్టించారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు టీడీపీ వీరోచితంగా పోరాడిందన్నారు చంద్రబాబు.
4వ విడతలో 41.7 శాతం సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నామని చెప్పారు చంద్రబాబు. మొత్తం నాలుగు విడతల్లో కలిపి 4,230 సర్పంచ్ స్థానాలను గెలిచామని తెలిపారు. సక్రమంగా జరిగి ఉంటే మరో 10 శాతం స్థానాల్లో విజయం సాధ్యమయ్యేదన్నారు.అధికార దుర్వినియోగం, ఫలితాల తారుమారుపై వైసీపీ ఆధారపడిందన్నారు టీడీపీ అధినేత. అధికారాన్ని సక్రమంగా వినియోగించుకోవడంలో ఎస్‌ఈసీ విఫలమైందన్నారు. సక్రమంగా నిర్వహించామని ఎన్నికల సంఘం ఎలా చెప్పగలదని చంద్రబాబు ప్రశ్నించారు.
డెమోక్రసీకి జగన్ మోనోక్రసీకి మధ్య జరిగిన ఎన్నికల్లో కొంత తేడాతో సంఖ్యా విజయం వైసీపీదైనా అసలు సిసలు గెలుపు టీడీపీదే అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ....‘‘అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన ఎన్నికలను వైఎస్ జగన్ తన రాజారెడ్డి రాజ్యాంగంతో అడ్డుకున్నారు. మనదేశానికి అర్ధరాత్రి స్వాతంత్ర్యం వస్తే, నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లో అర్థరాత్రి జగన్‌రెడ్డి ఫ్యాక్షన్ పాలిటిక్స్‌కి స్వాతంత్రం వచ్చింది. టీడీపీ మద్దతుతో పోటీచేసే అభ్యర్థుల్ని చంపేశారు, నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేశారు. బెదిరించారు, భయపెట్టారు. కట్టేసి కొట్టారు. అయినా వెనక్కితగ్గని టీడీపీ అభ్యర్థులు లెక్కింపులో ముందంజలో వుంటే.. కరెంట్ నిలిపేశారు. కౌంటింగ్ కేంద్రాలకు తాళాలేసారు. పోలీసులతో బెదిరించారు. దాడులు చేశారు. టీడీపీ మద్దతుదారులు గెలిచిన చోట్ల రీకౌంటింగ్ పేరుతో వైసీపీ గెలుపు ప్రకటించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఎన్నడూ లేని విధంగా జగన్‌రెడ్డి అరాచకాలకు పాల్పడినా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచి గెలిచిన టిడిపి కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.