పంచాయతీ ఏకగ్రీవానికి వైసీపీ ప్లాన్! చంద్రబాబు ఎంట్రీతో సీన్ రివర్స్
posted on Feb 12, 2021 @ 10:18AM
ఏపీలో పంచాయతీ ఎన్నికలను టీడీపీ సవాల్ గా తీసుకుంది. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ..సాధ్యమైనంత వరకు ఏకగ్రీవాలు కాకుండా చూసేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల వారీగా వివరాలు తెలుసుకుంటూ... అన్ని చోట్ల అభ్యర్థులు పోటీలో ఉండేలా చూస్తున్నారు. ఎక్కడైనా టీడీపీ తరపున ఎవరూ నామినేషన్ వేయలేదని గుర్తిస్తే.. వెంటనే స్థానిక నేతలను అప్రమత్తం చేస్తున్నారు చంద్రబాబు. చిత్తూరు జిల్లా తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఒక గ్రామంలో కేవలం వైసీపీ నుంచే నామినేషన్లు వేశారన్న విషయం తెలుసుకున్న చంద్రబాబు.. పార్టీ లోక్ సభ అధ్యక్షుడినే ఆ గ్రామానికి పంపించారు. చంద్రబాబు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యేతోపాటు లోక్ సభ టీడీపీ అధ్యక్షుడు.. హుటాహుటిన అర్దరాత్రే ఆ గ్రామానికి వెళ్లి టీడీపీ నేతలతో చర్చలు జరిపారు.
తిరుపతి సెగ్మెంట్ పరిధిలో శెట్టిపల్లె ఏకైక పంచాయతీగా ఉంది. ఈ గ్రామంలో మొత్తం 12 వార్డులు ఉండగా, తొమ్మిది వార్డులు తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లోకి, మిగిలిన మూడు వార్డులు చంద్రగిరి సెగ్మెంట్ పరిధిలోకి వెళ్తాయి. ఈ గ్రామం మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంది. గత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన బత్తుల స్వప్న శెట్టిపల్లిలో గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ గ్రామంలో టీడీపీకి ఆధిక్యం వచ్చింది. చాలా ఏళ్లుగా ఈ గ్రామంలో అపరిష్కృతంగా ఉన్న భూములకు ల్యాండ్ పూలింగ్ ద్వారా శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తామని తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. ఈ గ్రామాన్ని ఏకగ్రీవం చేయాలని ప్రయత్నాలు చేశారు. అయితే శెట్టిపల్లె గ్రామ సమస్యకు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే పరిష్కారం చూపుతూ జీవోను కూడా జారీ చేశామని, ఆ జీవో అమలు విషయంలో ఆలస్యం కారణంగానే సమస్య అలాగే మిగిలిపోయిందన్నది టీడీపీ నేతల వాదన. అయితే ఇక్కడ శుక్రవారం మాత్రమే నామినేషన్లకు ఆఖరు తేదీ. గురవారం వరకు కేవలం వైసీపీ సర్పంచ్, వార్డు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. టీడీపీ మద్దతుదారుల నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
ఈ విషయం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలిసింది. దీంతో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు, తిరుపతి లోక్ సభ టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ కు పోన్లు చేసి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. శెట్టిపల్లెలో నామినేషన్లు ఎవరూ వేయకపోవడం గురించి ఆరా తీశారు. దీంతో సుగుణమ్మ, నరసింహ యాదవ్ హుటాహుటిన గురువారం రాత్రి శెట్టిపల్లెకు వెళ్లారు. గ్రామంలోని టీడీపీ మద్దతుదారులతో మాట్లాడారు. పార్టీ రహితంగా ఏకగ్రీవం అయితే ఫరవాలేదనీ, అధికార పార్టీ తరపున ఏకగ్రీవం అని ప్రకటిస్తే మాత్రం పోటీ పెట్టాల్సి వస్తుందని వారు వ్యాఖ్యానించారు. తమ మద్దతుదారులను బెదిరించి పోటీలో లేకుండా చేస్తున్నారన్నారు.