కాంగ్రెస్ తో కలిసి కదం తొక్కిన తెలుగుదేశం.. బీఆర్ఎస్ పనైపోయినట్లేనా?
posted on Nov 13, 2023 @ 1:32PM
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు మద్దతు పలుకుతున్నది. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్కకు ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం శ్రేణులు మద్దతు పలకడం ఈ విషయాన్ని రూఢీ చేస్తున్నది. బోనకల్ మండలం మోటమర్రిలో మల్లు భట్టి విక్రమార్కకు తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. దీంతో మోటమర్రి గ్రామం అంతటా కాంగ్రెస్, తెలుగుదేశం శ్రేణుల సమష్టి ప్రచారంతో దద్దరిల్లిపోయింది. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, తెలుగుదేశం శ్రేణులు భుజం భుజం కలిపి పని చేయడం తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మధిర నుంచి మల్లు భట్టి విక్రమార్క మరో సారి విజయం సాధించాల్సిందేనని తెలుగుదేశం, కాంగ్రెస్ శ్రేణులు పట్టుదలతో పని చేస్తున్నాయనడానికి మోటమర్రి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని అంటున్నారు.
అసలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయని పరిశీలకులు గత రెండు నెలలుగా విశ్లేషిస్తున్న సంగతి విదితమే. అధికారికంగా తెలుగుదేశం కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించకపోయినా.. రాష్ట్రంలో ఇప్పటి వరకూ బీఆర్ఎస్ కు అండగా నిలిచిన తెలుగుతమ్ముళ్లు, బాబు అరెస్టు తరువాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనీసం స్పందించకపోవడం, స్పందించిన కేటీఆర్ చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ తెలంగాణలో నిరసన ప్రదర్శనలేంటంటూ రుసరుసలాడటంతో తెలంగాణలో తెలుగుతమ్ముళ్లు ఒక్కసారిగా బీఆర్ఎస్ కు రివర్స్ అయిపోయారు. ఒకింత ఆలస్యంగా తన వ్యాఖ్యల వల్ల కలిగిన నష్టాన్ని గుర్తించిన కేటీఆర్ ఆ తరువాత నష్ట నివారణ కోసం ఎంతగా తాపత్రేయపడినా ఫలితం దక్కలేదని తాజాగా మోటమర్రిలో తెలుగుదేశం శ్రేణులు కాంగ్రెస్ తో కలిసి భట్టివిక్రమార్కకు మద్దతుగా కదం తొక్కడంతో నిర్ద్వంద్వంగా రూఢీ అయిపోయింది.
పరిశీలకులు ఈ పరిస్థితిఒక్క మధిర నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదనీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉందని విశ్లేషిస్తున్నారు. అసలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పోటీకి దూరంగా ఉండటం వెనుక సెటిలర్ల ఒత్తిడీ, తెలుగుతమ్ముళ్ల అభీష్టం కలిసే ఉన్నాయని అంటున్నారు. ఈ సారికి తెలంగాణలో పోటీకి దూరంగా ఉంటే బీఆర్ఎస్ కు గట్టి గుణపాఠం చెప్పే అవకాశం ఉంటుందన్న సెటిలర్ల భావనే తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయానికి కారణమైందని అంటున్నారు. మొత్తం మీద మోటమర్రిలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా భట్టి కోసం ప్రచారం చేయడంతో తెలంగాణలో తెలుగుదేశం ఎటువైపు అన్న అనుమానానికి తెరపడినట్లునని చెబుతున్నారు.