Read more!

అంతులేని పొత్తుల కధ

 

రెండున్నర నెలల క్రితం మొదలయిన తెదేపా-బీజేపీల మధ్య సీట్ల సర్దుబాట్లు, పొత్తుల సస్పెన్స్ సీరియల్, రేపటితో నామినేషన్లు వేసేందుకు గడువు ముగుస్తున్నా కూడా ఇంకా గంటకో ట్విస్టుతో ఉత్కంఠభరితంగా సాగిపోతూనే ఉంది. నిన్నఅర్ధరాత్రి వరకు తెదేపా-బీజేపీ అగ్ర నేతల మధ్య జరిగిన చర్చల్లో సీట్ల సర్దుబాట్లపై ఉభయుల మధ్య ఎటువంటి అంగీకారం కుదరనట్లు సమాచారం. బీజేపీకి ఇచ్చాపురం, నరసారావుపేట, గుంతకల్లు, తాడేపల్లిగూడెం మరియు సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాలలో బలమయిన అభ్యర్ధులు లేరు గనుక వాటిని తమకు తిరిగి ఇమ్మని, అందుకు ప్రతిగా గోదావరి జిల్లాలో ఒక యంపీ సీటు ఇస్తామని తెదేపా చేసిన ప్రతిపాదనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకి౦చినట్లు తెలుస్తోంది. ఈవ్యవహారం ఎంతకూ ముగిసేలా కనబడకపోవడంతో, బీజేపీకి కేటాయించిన సీట్లలో తెదేపా తన అభ్యర్ధులను నిలబెట్టేందుకు సిద్దమవుతోంది. అదేవిధంగా బీజేపీ కూడా ఒకవైపు తెదేపాతో చర్చలు సాగిస్తూనే సీమాంధ్రలో మొత్తం అన్ని స్థానాలలో తన అభ్యర్ధులను పోటీలో నిలబెట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

 

ఇక సందట్లో సడేమియా అన్నట్లుగా పొట్లూరి వరప్రసాద్ ఇప్పుడు బీజేపీ చుట్టూ ప్రదక్షిణాలు ప్రారంభించినట్లు సమాచారం. బీజేపీ కూడా ఆయనను విజయవాడ నుండి పోటీకి దింపేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక రెండు పార్టీలు పొత్తులు రద్దు చేసుకొంటున్నట్లు అధికారికంగా ప్రకటించడమే మిగిలుంది. సీమాంద్రాలో పొత్తులు రద్దు చేసుకొని తెలంగాణాలో కొనసాగడం కష్టం గనుక బహుశః అక్కడ కూడా రద్దయిపోవచ్చును.