నాకు బీపీ, షుగర్.. ఓటేయండి ప్లీజ్..
posted on Mar 26, 2021 @ 11:41AM
రోడ్లు వేస్తాం.. బస్సులు వేస్తాం.. భవనాలు కడతాం.. అభివృద్ధి చేస్తాం నాకే మీ ఓటు.. ఎలక్షన్లు వస్తే ఇలాంటి డైలాగులు కామన్. కొంచెం అటూ ఇటూగా నేతలంతా ఇలాంటి హామీలు, రిక్వెస్టులే చేస్తుంటారు. కానీ.. ఓ మంత్రి మాత్రం సంథింగ్ డిఫరెంట్. గెలిస్తే తానేమి చేస్తాడో చెప్పకుండా.. తనకున్న సమస్యలేంటో చెప్పి.. ఓటేయమని అడుగుతున్నాడు. ఆ ప్రాబ్లమ్స్ కూడా అంత పెద్దవేమీ కాదు. తాను బీపీ, షుగర్‌తో బాధపడుతున్నా కాబట్టి తనను ఆదరించి, తనకే ఓటువేసి.. గెలిపించాలని ఓటర్లను ప్రార్థిస్తున్నాడు. అదేంటి, మంత్రికి బీపీ, షుగర్ ఉంటే మేము ఓటేయడమేంటంటూ జనాలు తెగ నవ్వుకుంటున్నారు. మంత్రి స్థాయిలో ఉన్న నేత.. ఇంత సిల్లీగా ఓట్లు అడగడమేంటని ఓటర్లు విసుక్కుంటున్నారు.
ఇది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జరిగిన వింత. తమిళనాడు మంత్రి విజయభాస్కర్.. తనకు బీపీ, షుగర్ ఉంది కాబట్టి మీ ఓటు వేసి తనను ఆదుకోమంటూ ఓటర్లను వేడుకున్నాడు. మంత్రి గారు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పుదుకోట్టై జిల్లా విరాళిమలై నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు విజయభాస్కర్. ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తాను చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోల్ చేస్తుండటంతో ఆయన స్పందించారు. తాను చేసిన కామెంట్లను సమర్థించుకున్నారు. సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి ఓట్ల కోసం పాకులాడటం లేదంటూ కవర్ చేసుకున్నారు. తాను శారీరకంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్‌ను ఓటర్లకు గుర్తు చేయడంలో తప్పేముందని తిరిగి ప్రశ్నించారు.
తాను ఇటీవల ఓ ప్రాంతంలో చేసిన ప్రసంగాన్ని కొందరు వక్రీకరిస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను విశ్రాంతి లేకుండా ప్రజలకు సేవ చేశానని చెప్పారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ.. తనకున్న బీపీ, షుగర్ గురించి కూడా మాట్లాడానని.. అందులో తప్పేమీ లేదని తనను తాను సమర్థించుకున్నారు మంత్రి విజయభాస్కర్.