పొలిట్ బ్యూరో స్థానం కోసం తలసాని అలక?

 

తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి తలసాని మరోసారి అలిగారా? అధినేత ఇచ్చిన హామీ నెరవేరక పోవడమే కారణమా? అందులో భాగంగానే నగర కమిటీ కొత్త కార్యవర్గాన్ని వాయిదా వేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ పార్టీవర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. మాజీమంత్రిగా కొన్ని నెలల క్రితం నగర రాజకీయాలపై అంటీ ముట్టనట్టుగా వ్యవహరించిన తలసాని శ్రీనివాస యాదవ్ ను బుజ్జగించిన అధినేత చంద్రబాబునాయుడు నగర అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. నగర అధ్యక్ష పదవితో పాటు చిరకాలంగా ఎదురు చూస్తున్న పొలిట్ బ్యూరో సభ్యత్వాన్ని కూడా ఇవ్వడానికి అంగీకరించినట్టు సమాచారం. పొలిట్ బ్యూరోలో స్థానం కల్పిస్తేనే నగర అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటానని కూడా తలసాని చంద్రబాబుకు చెప్పారు. దానికి బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే పార్టీ నగర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గత ఏడాది నవంబర్ లో నగర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తలసాని తన మార్క్ ను చూపించడానికి పెద్దయెత్తున హల్ చల్ చేశారు. డిసెంబర్ 8న నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో తెలుగుదేశం సమర భేరి నిర్వహించి హైదరాబాద్ నగరంలో టిడిపీ వైభవం చెక్కుచెదరలేదని నిరూపించారు.

 

సమర భేరి విజయవంతం కావడంతో చలసానికి చంద్రబాబు నుంచి ప్రశంసలు వచ్చాయి. కానీ పొలిట్ బ్యూరోలో సభ్యత్వాన్ని బాబు వాయిదా వేస్తుండడంతో తలసాని కొంత కాలంగా నగరంలో పార్టీ కార్యక్రమాలను దాదాపు నిలిపివేశారు. సమర భేరి విజయం తర్వాత ఆయన నగరంలోని కొన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. అప్పటికీ పొలిట్ బ్యూరోలో స్థానం లభించకపోవడంతో మరోసారి అలిగినట్టు తెలిసింది. కొత్త వారికి పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించడంతో తలసాని ఆవేదనకు గురైనట్టు సమాచారం. పార్టీ నగర కార్యాలయానికి కూడా ఆయన వెళ్ళడం లేదు. అసంతృప్తితో ఉన్నట్టు పార్టీవర్గాలు తెలిపాయి. ఈ విషయమై పాదయాత్రలో ఉన్న చంద్రబాబుకు సమాచారం అందినట్టు తెలిసింది. పాదయాత్ర తర్వాత తలసానికి పొలిట్ బ్యూరోలో స్థానం లభిస్తుందని అందరూ భావించారు. జనవరిలో ముగియాల్సిన పాదయాత్రను మార్చి వరకు పొడిగించారు. తన విషయమై అధినేత పట్టించుకోకపోవడంతో మరోసారి తలసాని అలక వహించినట్టు తెలిసింది.

 

రేపు బాబుతో తలసాని భేటీ 
 
పొలిట్ బ్యూరోలో స్థానం లభించడం లేదన్న కారణంగా అసంతృప్తితో ఉన్న తలసాని నగర కమిటీకి కొత్తగా ఏర్పాటుచేయనున్న కార్యవర్గాన్ని ప్రకటించడంపై ఆసక్తి చూపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. సంక్రాంతి తరువాత కమిటీని ప్రకటిస్తానని ప్రకటించలేదు. పొలిట్ బ్యూరోలో స్థానం విషయం తెలుసుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టు తెలిసింది. పార్టీ అధినేత చంద్రబాబును గురువారం తలసాని కలవనున్నారు. పొలిట్ బ్యూరోలో స్థానం విషయం తేలిన తరువాతే నగర కమిటీపై చర్చిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న తర్వాత కమిటీని ప్రకటించే అవకాశం ఉందని పార్టీవర్గాలు తెలిపాయి.