Read more!

సస్పెన్షన్ వ్యూహం బూమరాంగ్ అయినట్లేనా?

క్రాస్ ఓటింగ్ చేశారని నలుగురు ఎమ్మెల్యేల్ని వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. వారిపై అనర్హతా వేటు వేస్తారన్న చర్చ కూడా ప్రారంభమయింది.  అసలు అనర్హత వేటు వేయకుండా కేవలం సస్పెండ్ చేసి ప్రయోజనమేముందన్న వాదనా వినవస్తోంది. అనర్హత వేటు వేయకుండా కేవలం సస్పెండ్ చేయడం వల్ల ఎమ్మెల్యేలకు వచ్చే ఇబ్బందేమీ ఉండదన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.

కేవలం సస్పెన్షన్ తోనే వదిలేస్తే.. పార్టీని ధిక్కరించి సస్పెన్షన్ వేటు వేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెడీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ, పార్టీని ధిక్కరించడానికి ఇసుమంతైనా వెనుకాడకుండా ముందుకు వచ్చేవారి సంఖ్య పెద్దగానే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సస్పెండైన నలుగురిపైనా అనర్హత వేటు వేయడానికి అవసరమైన ప్రక్రియపై హై కమాండ్ దృష్టి పెట్టిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  అయితే ఇక్కడే రాజ్యాంగ నిపుణులు పార్టీ నుంచి సస్పెండ్ అయితే చేయగలరు కానీ, క్రాస్ వోటింగ్ పేరు చెప్పి వారిపై అనర్హత వేటు వేసే అవకాశాలైతే లేవని అంటున్నారు. క్రాస్ వోటింగ్ పేరు చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా..  పార్టీలో అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉందన్న వార్తలు వినవస్తున్న నేపథ్యంలో వారిని కట్టడి చేయడానికి మాత్రమేనని అంటున్నారు.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఆ తరువాత తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి ఒకే సారి ఒకే పార్టీకి చెందిన, అందులోనూ అధికార పార్టీకి చెందిన  నలుగురు శాసనసభ్యులు పార్టీ నుండి సస్పెండ్‌ కావడం ఇదే తొలిసారి.   ఇక ఇప్పుడు వైసీపీ సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరు చాలా కాలం కిందటి నుంచే పార్టీ విధానాలను బహిరంగంగా వినిపిస్తూ వస్తున్నవారే. మరో ఇద్దరిని క్రాస్ ఓటింగ్ ఆరోపణలతో సస్పెండ్ చేస్తూ గతం నుంచీ పార్టీ లైన్ కు భిన్నంగా బహిరంగంగా మాట్లాడుతున్నవారిపై కూడా వైసీపీ వేటు వేసింది. ఇక సస్పెన్షన్ తరువాత  ఏమిటి? అనర్హత వేటు పడుతుందా? అంటే.. ఆ అవకాశాలు లేవనే చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేపై కానీ ఎంపీపై కానీ అనర్హత వేటు వేయాలంటే వారు వేరే పార్టీలో చేరడమే, లేదా పార్టీ విప్ ను ధిక్కరించడమో చేయాలి.  ఇక్కడ ఇప్పుడు వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన వారెవరూ వేరే పార్టీలో చేరలేదు.

ఇక రహస్య ఓటింగ్ లో విప్ ను ధిక్కరించారని తేల్చడానికి ఆధారాలు ఉండవు. అసెంబ్లీలో, లోక్ సభలో, రాజ్యసభలో బిల్లుల పైచర్చ సందర్భంగా జరిగే బహిరంగ ఓటింగ్ సందర్భంగా విప్ ధిక్కరించిన వారిని గుర్తించి అనర్హత వేటు వేయడానికి వీలు ఉంటుంది. అందుకే ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నలుగురూ డిస్ క్వాలిఫై అయ్యే అవకాశాలు లేవనే అంటున్నారు.  సో వైసీపీ నలుగురిని సస్పెండ్ చేసి  ఇంకా  అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతున్న పలువురిని పరోక్ష హెచ్చరిక జారీ చేసిందని భావించాల్సి ఉంటుంది. పార్టీ శ్రేణుల సమాచారం మేరకు  పాతిక మందికి పైగా అసంతృప్త ఎమ్మెల్యేల పేర్లతో ఐ ప్యాక్ ఒక జాబితాను జగన్ కు అందించిందని చెబుతున్నారు.  

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో మరో అభ్యర్థిని నిలబెట్టినా గెలిచి ఉండేవారమంటూ తెలుగుదేశం పేర్కొనడానికి కారణం కూడా అదేనని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే క్రాస్ ఓటింగ్ పేర నలుగురిని సస్పెండ్ చేసిన, డిస్ క్వాలిఫై చేస్తున్నామంటూ ప్రచారం చేయడం ద్వారా అసంతృప్తులకు గట్టి హెచ్చరిక పంపామని వైసీపీ భావిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఇలాంటి అనర్హతా వేటు ప్రచారంద ద్వారా కంట్రోల్ చేయాలనుకుంటున్నారనీ, అది సాధ్యమయ్యే పని కాదనీ అంటున్నారు.