ప్రజాస్వామ్యానికి సంజీవని లాంటి తీర్పు!
posted on Mar 4, 2023 @ 4:06PM
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మన ప్రజాస్వామ్యం వర్దిల్లుతోందన్న విమర్శలు విపక్షాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఏకంగా విదేశీ గడ్డ మీద నుంచే భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని విమర్శించారు. మోడీ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలు కేంద్రం చెప్పుచేతల్లో కీలుబొమ్మలుగా మారిపోయాయన్నారు. పెగాసన్ స్పై వేర్ తో తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. ఒక్క రాహుల్ గాంధీయే అని కాదు... బీజేపీయేతర పార్టీలన్నీ దాదాపుగా ఇవే ఆరోపణలు చేస్తున్నాయి.
కేంద్ర ద్యర్యాప్తు సంస్థల తీరు కూడా వారి ఆరోణలకు అనుగుణంగానే ఉన్నాయి. ఇక ప్రజాస్వామ్య వవస్థకు మూల స్తంభం లాంటి కేంద్ర ఎన్నికల సంఘంపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉండే వారినే ఈ రాజ్యంగ బద్ధ సంస్థకు కమిషనర్లుగా నియమించి ఎన్నికలలో లబ్ధి పొందేలా వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం విషయంలో ఒక పద్ధతి ప్రకారం జరగాలని విస్పష్టంగా చెప్పడం కచ్చితంగా ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవాలి. సుప్రీం చెప్పిన విధంగా అత్యున్నత స్థాయి త్రిసభ్య కమిటీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్లను నియమిస్తే.. ఇక ఆ రాజ్యాంగ సంస్థపై ఆరోపణలు వచ్చేందుకు ఆస్కారం ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను సందేహించే పరిస్థితి ఉండదు. ప్రధాని, విపక్ష నేత, సుప్రీం ప్రధాన న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య ప్యానల్ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల పేర్లను సిఫారసు చేస్తుందనీ, అలా ఆ ప్యానల్ సిఫారసు చేసిన వారినే నియమించాలని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది.
ఇప్పటి వరకూ కేంద్ర కేబినెట్ సిఫారసల మేరకే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకాలు జరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ పద్ధతికి సుప్రీం తీర్పుతో చెక్ పడినట్లే. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకానికి సంబంధించి స్పష్టమైన మార్గ దర్శకాలతో కొత్త చట్టం తీసుకు వచ్చే వరకూ ముగ్గురు సభ్యుల ప్యానల్ ద్వారానే ఈ నియమకాలు జరగాలని కూడా కేంద్రం ఆదేశించింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంలో ప్రధానితో పాటు విపక్ష నేతకు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికీ కూడా భాగస్వామ్యం కల్పించడం వల్ల కేంద్ర ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరించడానికి అవకాశం కలుగుతుందనడంలో సందేహానికి తావుండదు.
2024లో లోక్‌సభకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన నియామకాలకు సరైన చట్టమంటూ ఉండాలని రాజకీయ పార్టీలు పట్టుబట్టకుండా ఉండడంపై కూడా సుప్రీంకోర్టు విమర్శించింది. అడుగులకు మడుగులెత్తే ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని చిరకాలం, కలకాలం పదవుల్లో, అధికారంలో కొనసాగాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి అని కూడా సుప్రీం ధర్యాసనం పేర్కొంది. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం తప్పనిసరిగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలను శిరసావహించాల్సి ఉంటుంది.
రాజ్యాంగ సూత్రాలకు తగ్గట్టుగా ఎన్నికల కమిషన్ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్నట్లుగా ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం మారకపోతే ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల దేశ ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందనడంలో సందేహం లేదు. . ఎన్నికల కమిషన్ ఎంత స్వేచ్ఛగా ఉంటే, ఎంత స్వతంత్రంగా వ్యవహరిస్తే అంత ఉన్నతంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.