జగన్ లేఖ బహిర్గతంపై 16న విచారణ.. కోర్టు ధిక్కరణ ప్రక్రియపై ఏజీకి మరో లేఖ
posted on Nov 7, 2020 9:20AM
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన లేఖకు కొనసాగుతున్న వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడంతో పాటు సీజేఐ కు ఏపీ సీఎం రాసిన లేఖ బహిర్గతం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలపైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈనెల 16న విచారణ చేపట్టనుంది. ఈ మేరకు విచారణ జాబితాలో ఈ పిటిషన్లను చేర్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం. జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ రవీంద్రభట్ నేతృత్వంలోని ధర్మాసనం వీటిపై విచారణ చేపట్టనుంది. ఈ మేరకు విచారణ జాబితాలో ఈ పిటిషన్లను చేర్చింది. జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ రవీంద్రభట్ నేతృత్వంలోని ధర్మాసనం వీటిపై విచారణ చేపట్టనుంది.
న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్‌కుమార్ సింగ్, సునీల్‌కుమార్ సింగ్‌తో పాటు యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్లు దాఖలు చేశాయి. కోర్టులపై ఇలాంటి ప్రకటనలు చేయకుండా ప్రతివాదిపై చర్యలు తీసుకోవాలని సునీల్‌కుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశంలో చర్యలెందుకు తీసుకోకూడదో చెప్పేందుకు సీఎం జగన్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై నిరాధార ఆరోపణలు చేయడంపై జీఎస్ మణి, ప్రదీప్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిరాధార ఆరోపణలు చేసినందుకు సీఎంగా జగన్‌ను తొలగించాలని కోరారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై నిరాధారమైన ఆరోపణలు చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తమ పిటిషన్లలో కోరారు లాయర్లు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తిపై ఆరోపణలు చేయడంతో పాటు, వాటిని బహిర్గతం చేయడం ద్వారా జగన్ న్యాయస్థానాలపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేశారని ఆరోపించారు. జగన్ చర్యల ద్వారా రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించారని, దేశపు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ద్వారా అస్థిరపరచాలని చూస్తున్నారని పిటిషన్ దారులు చెప్పారు. గతంతో పోలిస్తే, న్యాయస్థానాలపై ఆరోపణలు వస్తే, అవి ప్రజల్లోకి వేగంగా వెళుతున్నాయని, ఇది సమాజానికి చెడు సంకేతాలను పంపుతోందని పిటిషన్ లో పేర్కొన్నారు లాయర్లు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జగన్ చర్యలున్నాయన్నారు.
ఏపీ సీఎం జగన్ లేఖకు సంబంధించి పిటిషనర్లు కీలక అంశాలను తమ పిటిషన్లలో ప్రస్తావించారు. జగన్ ఆరోపణలు చేసిన సమయం అనుమానించ తగినదేనని చెప్పారు. మాజీలు, ప్రస్తుత ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను సాధ్యమైనంత త్వరగా విచారించాలన్న కేసును ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తున్న వేళ, ఈ ఆరోపణలు వచ్చాయని, అది కూడా ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి చేశారని గుర్తు చేస్తూ, ఆయనపైనా చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని తన పిటిషన్ లో పేర్కొన్నారు సునీల్ కుమార్ సింగ్.
మరోవైపు ఈ వ్యవహారంలో సీఎం జగన్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు అజేయకల్లంపై కోర్టు ధిక్కరణ ప్రక్రియ మొదలుపెట్టేందుకు తనకు అనుమతివ్వాలంటూ సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీకుమార్ ఇప్పటికే అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కి లేఖ రాశారు. అయితే ఆ విషయం ప్రస్తుతం సీజేఐ పరిధిలో ఉన్నందున కోర్టు ధిక్కరణ ప్రక్రియకు అనుమతివ్వలేనంటూ అశ్వినీకుమార్‌కు ఏజీ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో అశ్వినీకుమార్ గురువారం ఏజీకి మరో లేఖ రాశారు. ప్రస్తుతం సీజేఐ పరిధిలో ఉన్నది జగన్ రాసిన లేఖే తప్ప.. అది కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తుందంటూ తాను చేసిన ఫిర్యాదు కాదని, అందువల్ల కోర్టు ధిక్కరణ ప్రక్రియకు అనుమతివ్వాలని ఆయన కోరారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జగన్ రాసిన లేఖ రాయడం, దాని మీడియాకు బహిర్గతం చేయడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. జగన్ లేఖలపై వివిధ బార్ అసోసియేషన్లు, అఖిల భారత న్యాయవాదుల సంఘం, దేశంలో పలు కోర్టుల న్యాయవాదుల సంఘాలతో పాటు పలువురు సీనియర్ అడ్వకేట్లు తీవ్రంగా స్పందించారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కించపరిచేలా లేఖ రాసిన ఏపీ ముఖ్యమంత్రిపై జగన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో సీజేఐకి కి జగన్ రాసిన లేఖ బహిర్గతం సుప్రీంకోర్టులో జరగనున్న విచారణ దేశ వ్యాప్తంగా ఆసక్తిగా మారింది.