తగలబెడుతుంటే చూస్తూ ఊరుకోం- సుప్రీం ఆగ్రహం
posted on Feb 24, 2016 @ 4:51PM
మన దేశంలో ఏ వర్గంవారికి ఏ విషయంలో కోపం వచ్చినా, తక్షణం తమ ఆగ్రహాన్ని ప్రభుత్వ ఆస్తుల మీద చూపిస్తుంటారు. మొన్నటికి మొన్న తునిలో తగలబడిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ అయినా, ఈ వారంలో హర్యానాలో తగలబడుతున్న ప్రభుత్వ భవనాలైనా దీనికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఈ తతంగం అంతా చూసిన సుప్రీంకోర్టుకి ఒళ్లు మండినట్లుంది. ‘ఇక మీదట అలాంటి చర్యలకు పాల్పడేవారి మీద తగిన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. దీని కొసం కొన్ని నిబంధనలను రూపొందించాలి’ అంటూ ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
గుజరాత్‌లో పటేల్ వర్గానికి రిజర్వేషన్లను కల్పించాలంటూ గత ఏడాది హార్ధిక్ పటేల్ అనే నాయకుడి ఆధ్వర్యంలో అక్కడి ప్రభుత్వ ఆస్తులను విచ్చలవిడిగా ధ్వంసం చేశారు. ఆ కేసుని ఇవాళ విచారించే సందర్భంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను చేసింది. ‘ప్రభుత్వానికి లేదా పౌరులకు సంబంధించిన ఆస్తులను మీరు ఇలా ధ్వంసం చేస్తూ పోలేరు. ఆందోళనలు చెలరేగినప్పుడు ఇలాంటి విధ్వంసానికి పాల్పడేవారిని మనం తప్పకుండా వారి చర్యలకు బాధ్యులను చేయవలసి ఉంటుంది’ అంటూ సుప్రీం పేర్కొంది. సుప్రీం అన్న మాటలు బాగానే ఉన్నాయి. కానీ తమ మీద కేసులు ఎత్తేయాలంటూ నేతలు మళ్లీ నిరాహారదీక్షకు దిగితే ప్రభుత్వాలు ఏం చేసేది!