సుప్రీంకోర్టు సంచలన తీర్పు
posted on Sep 27, 2013 @ 12:28PM
ఇటీవల సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ప్రచ్చన్నయుద్ధం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కొద్ది వారాల క్రితం సుప్రీంకోర్టు “నేరాభియోగాలు ఎదుర్కొంటూ జైలుపాలయిన ప్రజాప్రతినిధులు ఎన్నికలలో పోటీకి అనర్హులని” తీర్పు ప్రకటించగానే, ప్రభుత్వం హుటాహుటిగా కోర్టు ఆదేశాలను కొట్టి వేస్తూ ఒక చట్ట సవరణ చేసింది. ఆ తరువాత గ్యాస్ వినియోగదారులకు ఆధార్ కార్డుతో అనుసంధానం తప్పని సరిచేస్తూ ప్రభుత్వం ప్రకటించగానే, ఒక్క గ్యాస్ మాత్రమే కాక, దేనికి కూడా ఆధార్ తో అనుసంధానం చేయవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు చెప్పింది.
ఇక లోక్ పాల్ బిల్లు కోసం, ప్రస్తుత ఎన్నికల విధానంలో సవరణల కోసం పోరాడిన అన్నాహజారే, ప్రభుత్వ వైఖరిని ఇక మార్చలేమని తన పోరాటం విరమించుకొన్న తరువాత, ఆయన ప్రధాన డిమాండ్లలో ఒకటయిన ‘ఓటర్లకు అభ్యర్థులను తిరస్కరించే హక్కును’ కల్పిస్తూ సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఓటర్లకు పోటీ చేస్తున్నఅభ్యర్ధులలో ఎవరూ నచ్చకపోతే అటువంటి వారిని తిరస్కరించేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలోతప్పనిసరిగా ‘రిజక్ట్’ బటన్ కూడా ఏర్పాటు చేయవలసిందేనని కోర్టు ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల రాజకీయ పార్టీలు సరయిన అభ్యర్ధులను మాత్రమే పోటీలో నిలబెట్టగలవని కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది.
మరో రెండు నెలలలో మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న ఈ తరుణంలో సుప్రీంకోర్టు ఇటువంటి ఆదేశాలు జారీ చేయడం అన్ని రాజకీయ పార్టీలకు కూడా జీర్ణించుకోవడం కష్టమే. గనుక మళ్ళీ అన్ని రాజకీయపార్టీలు చేతులు కలిపి కోర్టు తీర్పుని రద్దు చేస్తూ త్వరలోనే మరో మారు చట్ట సవరణ చేస్తారేమో!