వెన్నుపోటుకు పాతికేళ్ళు.. త్వరలో బాబు పాలిటిక్స్ కు ముగింపు: సునీల్ దేవధర్
posted on Aug 26, 2020 @ 9:49AM
ఏపీలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చిన దగ్గరనుండి పార్టీ మంచి దూకుడుగా వ్యవహరిస్తోంది. అటు అధికార పక్షమైన వైసిపిని ఇటు ప్రతిపక్ష టీడీపీని టార్గెట్ చేస్తూ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
తాజాగా ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సరిగ్గా 25 ఏళ్ల కిందట టీడీపీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీ రామారావు తనను వెన్నుపోటు పొడిచినందుకు చంద్రబాబును పార్టీ నుండి బహిష్కరించారని, ఈ రోజును చంద్రబాబు ఇప్పటికి గుర్తుచేసుకుంటారనే తాము భావిస్తున్నామని అయన తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ మధ్య బీజేపీ పైనా, ప్రధాని మోదీ పైనా అపవాదులు వేశారని సునీల్ దేవధర్ ఈ సందర్భంగా ఆరోపించారు. అయితే ఇప్పుడు బాబు అధికారం కోల్పోయాడని, త్వరలోనే అయన రాజకీయ బరి నుండి కూడా పూర్తిగా నిష్క్రమిస్తారని అయన జోస్యం చెప్పారు. ద్రోహులు ఎవరి కర్మ వాళ్లు అనుభవించాల్సిందేనని అయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.
అంతేకాకుండా 1995 ఆగస్టు 25న ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు సహా మరో ఐదుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు తెలుపుతూ అప్పటి అసెంబ్లీ స్పీకర్ కు పంపిన లేఖను కూడా సునీల్ దేవధర్ ఈ సందర్భంగా ట్విట్టర్ లో పంచుకున్నారు.