గ్యాస్ ట్రబుల్ నుండి ప్రజలకు విముక్తి
posted on Mar 1, 2014 @ 10:55AM
ఎన్నికలలో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ప్రజలకు ఎన్ని హామీలయినా ఇస్తాయి. ఏదోవిధంగా ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నిస్తాయి. అధికారంలో ఉన్నపార్టీకయితే ఆ అవకాశం మరికొంచెం ఎక్కువ ఉంటుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వమయితే ఇక మరి చెప్పనే అక్కరలేదు. కనబడిన, కనబడని ప్రతీ అవకాశాన్ని విచ్చలవిడిగా వాడేసుకొంటుంది.
అటువంటి సవాలక్ష ఐడియాలలో నగదు బదిలీ పధకం, ఆధార్ కార్డ్, సబ్సీడీ గ్యాస్ వంటివి కూడా ఉన్నాయి. నగదు బదిలీ పధకంతో ఏదో అద్భుతం జరిగిపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చు చేసి ప్రచారం చేసింది. కానీ, కొన్ని రాష్ట్రాలలో అమలు చేసిన పైలట్ ప్రాజెక్టులే బెడిసికొట్టాయి. అయినా వెనక్కితగ్గల్లేదు. నగదు బదిలీతో ప్రజల ఓట్లన్నీ తన ఖాతాలోకే బదిలీ అయిపోతాయనే దురాశతో సబ్సీడీ గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వం ఇస్తున్న రాయితీని ఆధార్ కార్డుల ద్వారా నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలోనే జమా చేయామని హుకుం జారీ చేసింది. అయితే ప్రజలకు నగదు బదిలీ చేసే సదుద్దేశ్యంతో గాక, పెట్రోలియం కంపెనీలు క్రమంగా గ్యాస్ ధరలను పెంచుకొంటూ, వారి చేతిలో చిక్కిన సబ్సీడీ మొత్తాన్ని తమ ఇష్టానుసారంగా సులువుగా కత్తిరించుకొనేందుకే ఈ పన్నాగం పన్నింది. లోపభూయిష్టమయిన ఈ విధానంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తడంతో, అదే అదునుగా ప్రత్యర్ధ రాజకీయ పార్టీలు దానిని తమకు ఎక్కడ నుకూలంగా మలచుకొంటారో అనే భయంతోనే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లపై సబ్సీడీని నగదు బదిలీ పధకం ద్వారా నేరుగా ఖాతాదారుల బ్యాంకు ఖాతాలలో జామా చేసే పద్దతిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గ్యాస్ డీలర్లకు పెట్రోలేయం కంపెనీల నుండి లేఖలు కూడా జారీ అయియ్యాయి. గనుక, ప్రజలు గ్యాస్ సిలిండర్-ఆధార్ కార్డ్-నగదు బదిలీ పధకం నుండి బంద విముక్తులు అయినట్లే! అయితే ఇందుకు సంతోషించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటువేసి గెలిపించుకొంటారా లేదా అనేది వారే నిర్ణయించుకోవలసి ఉంటుంది.