విద్యార్థుల ఆత్మహత్యలన్నీ.. వ్యవస్థ చేస్తున్న హత్యలే!
posted on Mar 14, 2023 @ 11:36AM
చదువు పేరుతో కళాశాల యాజమాన్యం పెట్టే ఒత్తిడి భరించలేక, తక్కువ మార్కులు వస్తే తోటి విద్యార్థుల ముందు చేసే అవమానం భరించ లేక తరగతి గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడో ఇంటర్ విద్యార్థి. సరిగా చదవలేకపోతున్నానన్న బాధతో, మార్కులు తక్కువ వస్తాయన్న భయంతో, పరీక్ష తప్పుతానేమోనన్నఅనుమానంతో ఒక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అంతకంటే ముందు సీనియర్ల వేధింపులు భరించ లేక మోడికో ప్రీతి తనువు చాలించింది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు. ప్రతి రోజూ ఆత్మహత్యల వార్తలు మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. దేశంలో ఆత్మహత్యల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా విద్యార్థులు, అందులోనూ టీనేజీ పిల్లల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ బ్యూరో గణాంకాల ప్రకారం, దేశంలో చోటు చేసుకుంటున్న ప్రమాద మరణాలు, ఆత్మహత్యల్లో ఎనిమిది శాతానికిపైగా విద్యార్థులే కావడం విషాదం. అయితే విద్యార్థుల బలవన్మరణాలన్నీ వ్యవస్థ చేసిన హత్యలుగానే భావించాల్సి ఉంటుంది.
స్వేచ్ఛగా, స్వచ్ఛంగా జరగాల్సిన విద్యాబోధన.. మార్కులు, ర్యాంకుల వేటగా మార్చేసి..పిల్లలను వాటి వెంట పరుగులెత్తిస్తుండటమే వారిలో ఆత్మవిశ్వాసం లోపించడానికి కారణంగా చెప్పాలి. ఇష్టాయిష్టాలు, శక్తి సామర్ధ్యాలను పరిగణనలోకి తీసుకోకుండా ర్యాంకులు, మార్కులే జీవితం అంటూ అగమ్య పోటీతత్వాన్ని పెంచేసే విధానమే పిల్లలలో ఆత్మహత్యలు పెరగడానికి కారణమని మానసిక నిపుణులు చెబుతున్నారు. అసలు విద్యా సంస్థల్లో సంస్కరణల కోసం ప్రభుత్వాలు తీసుకువచ్చిన చట్టాలు ఏ మేరకు అమలవుతున్నాయి? అసలు అమలు అవుతున్నాయా? అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమౌతున్నాయి. ఈ పరిస్థితికి విద్యాసంస్థలు, అధ్యాపకులు, నిబంధనల రూపకర్తలు, సమాజం కూడా కారణమనే చెప్పాల్సి ఉంటుంది.
విద్యను, విద్యాబోధనను సంస్కరించాలి. ఈ సంస్కరణల్లో తల్లితండ్రులు, అధ్యాపకులు, అధికారులు భాగస్వాములు కావాలి. ప్రధానంగా విద్యా బోధనను, విద్యా సంస్థలను వాణిజ్యమయం కాపాడాలి. అలాగే విద్యార్థుల మధ్య కుల, మత, లింగ వివక్ష లేకుండా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ఇప్పటికీ ప్రభుత్వాలు ఒక నిర్దిష్ఠ కార్యాచరణను రూపొందించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోకుండా ముందు ముందు మరింత భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.