ఇవి చేతిలో ఉంటే ఒత్తిడి తగ్గిపోతుంది!
posted on Sep 4, 2017 @ 1:23PM
‘అ... ఆ’ సినిమా గుర్తుందా! అందులో సమంత చేతిలో ఎప్పుడూ ఓ రబ్బరు బంతి ఉంటుంది. ఇంట్లో దొంగలు పడితే ఏ వస్తువైనా వదులుకుంటుంది కానీ, ఆ ‘స్ట్రెస్ బాల్’ని మాత్రం వదులుకోదు. ఇదొక్కటే కాదు.... మనసులో ఉన్న ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఈమధ్య కాలంలో చాలా వస్తువులే అందుబాటులో ఉన్నాయి. వాటిలో స్ట్రెస్ బాల్ ఒకటి మాత్రమే. మన కండరాలలో పేరుకున్న ఒత్తిడిని స్ట్రెస బాల్ మీద చూపడం వల్ల ఇది ప్రభావం చూపుతుంది. మరి మిగతా వస్తువులు ఏమిటో, అవి ఎలా పని చేస్తాయో…
Fidget Spinner :-
ఈమధ్యకాలంలో పిల్లవాడి దగ్గర నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరి చేతిలోనూ ఇది కనిపిస్తోంది. చిన్న ఫ్యాన్‌లాగా ఉండి, మధ్యలో బేరింగ్స్ ఉండే ఈ స్పిన్సర్ ఇప్పుడో ట్రెండ్. చాలామంది చేతులలో ఏదో ఒకటి కదిలించడం వల్ల రిలాక్స్ అవుతూ ఉంటారు. వేలికి ఉన్న ఉంగరం తిప్పుడూ ఉండటం, పెన్నుని వేళ్ల మధ్య ఆడించడం చేస్తూ ఉంటారు. దీన్నే ఫిడ్గెటింగ్ అంటారు. అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే ‘కెలకడం’ అనవచ్చు. Fidget Spinner సరిగ్గా ఇదే పని చేసి పెట్టి ఒత్తిడిని మాయం చేస్తుంది.
Fidget cube :-
ఫిడ్గెట్ స్పిన్నర్ అంత కాకపోయినా, ఫిడ్గెట్ క్యూబ్ కూడా ఈమధ్యకాలంలో బాగానే ప్రచారంలోకి వచ్చింది. ఒక క్యూబ్‌కి ఆరు వైపులా ఉండే రకరకాల వస్తువులను నొక్కడం వల్ల ఒత్తిడి తగ్గించేసుకోవచ్చునంటున్నారు. స్విచ్‌లు, బటన్లు, జాయ్‌స్టిక్... ఇలా ఎలక్ట్రానిక్ పరికరాల మీద ఉండే రకరకాల మీటలన్నీ ఈ క్యూబ్ మీద ఉంటాయి. దీంతో ఒత్తిడి తగ్గడంతో పాటు ఏకాగ్రత కూడా మెరుగుపడుతుందన్న వాదనలూ ఉన్నాయి.
Worry beads :-
మనసు ఎప్పుడూ పరిపరివిధాలా పోతూ ఉంటుంది. అందుకే దేవుడి మీద దృష్టి పెట్టాలంటే, ఇతరత్రా ఆలోచనలని అదుపు చేసేందుకు చేతిలో జపమాల ఉంచుకోవాలని చెబుతారు పెద్దలు. పెద్దల మాటల్ని కొట్టివేసే కుర్రకారు ఇప్పుడు ఇలాంటి మాలలనే చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు. అవే వర్రీ బీడ్స్! చేతిలో అటూ ఇటూ ఆడిస్తూనో, వాటిని లెక్కపెట్టుకుంటూనో, పూసలు శబ్దం చేసేలా ఒకదానికి ఒకటి తాటిస్తూనో సమయం గడిపేస్తారు.
Worry stones :-
చాలామంది మనసులో ఒత్తిడిన ఎదుర్కొనేందుకు గోళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇక పెదాలు కొరుక్కోవడం, జుట్టు పీక్కోవడం లాంటి అలవాట్లూ కనిపిస్తుంటాయి. వర్రీ స్టోన్స్ ఇలాంటి అలవాట్ల నుంచి ధ్యాస మళ్లిస్తుంది. అరచేతిలో ఒక రాయిని ఆడిస్తూ ఉండటం వల్ల, ఒత్తిడి తగ్గే అవకాశం ఇస్తుంది.
ఇంతే కాదు! ఫోమ్‌తో చేసిన ఆటవస్తువులని బిగిసి పట్టుకోవడం, ప్యాకింగ్ కోసం వాడే బబుల్ రాప్స్‌ని చిదపడం... లాంటి బోలెడు చిట్కాలతో ఒత్తిడిని ఇట్టే తగ్గించేసుకోవచ్చు. మీరూ ఇందులో ఏదో ఒకదాన్ని ప్రయత్నించి చూడండి.
- నిర్జర.