కేసీఆర్ పాలనలో వీధుల్లో కుక్కులు.. వీధి రౌడీల్లా బీఆర్ఎస్ నేతలు.. బండి
posted on Feb 23, 2023 @ 1:32PM
తెలంగాణ ముఖ్యమంత్రిపైనా, తెలంగాణ ప్రభుత్వంపైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు, విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీజేపీ నాయకుడు మురళీకృష్ణ గౌడ్ ఇంటిపై, ఆయన కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన బండి సంజయ్ రాష్ట్రంలో వీధికుక్కల బెడద ఎలాగో బీఆర్ఎస్ గూండాల భయం కూడా అలాగే ఉందన్నారు.
దాడికి గురైన మురళీ గౌడ్ కుటుంబ సభ్యులను బుధవారం (ఫిబ్రవరి 23)న పరామర్శించారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ గూండాల తీరును గమనిస్తుంటే.. వారు డ్రగ్స్ మంత్తులో దాడులకు పాల్పడుతున్నారా అన్న అనుమానం కలుగుతోందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అధికార పార్టీ తప్పిదాలు, వైపల్యాలను విమర్శిస్తే.. ప్రతి విమర్శలుమాని భౌతిక దాడులకు పాల్పడుతోందని కేసీఆర్ సర్కార్ అని విమర్శించారు.
మురళీకృష్ణ గౌడ్ నివాసంపై దాడులకు పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బండి డిమాండ్ చేశారు. మురళీకృష్ణ గౌడ్ నివాసంపై దాడిని నిరోధించడంలో విఫలమైన, దాడులకు పాల్పడుతున్న వారిని ప్రోత్సహిస్తున్న పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. ప్రత్యర్థులను, తన విధానాలను వ్యతిరేకించే వారినీ భౌతికంగా నిర్మూలించడం అన్న తీరులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని బండి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వీధికుక్కలు రోడ్లపై పిల్లలపై దాడులు చేస్తుంటే.. బీఆర్ఎస్ గూండాలు వీధిరౌడీల్లా మారి ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారని బండి ఆరోపించారు