నరేష్, పవిత్ర అనుబంధం వెనుక కథేంటి?
posted on Jul 15, 2022 @ 4:16PM
హీరోగా కెరీర్ ప్రారంభించి, ఆ తరువాత క్యారెక్టర్ యాక్టర్ గా సెటిలైన నరేష్ ఆ మధ్యలో రాజకీయాలలో కూడా కొంత హడావుడి చేశారు. బీజేపీలో చేరి ఆ పార్టీ యువ నాయకుడి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయి వరకూ ఎదిగారు. 2009 ఎన్నికలలో హిందూపూర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తరువాత బిజెపికి రాజీనామా చేశారు. ఆ తరువాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో చురుకుగా వ్యవహరించారు.
అక్కడా వివాదాస్పదంగా మారారు. అయితే అప్పుడెప్పుడూ రానంత పాపులారిటీ నటుడు నరేష్ కు ఇటీవలి కాలంలో వచ్చింది. అందుకు ప్రధాన కారణం ఆయనకు, పవిత్రా లోకేష్ కు ఉన్న సంబంధం, అనుబంధమే. వారిరువురి సఖ్యతపై మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చాయి. ఆ కథనాలలోని ఔచిత్యాన్ని పక్కన పెడితే.. పవిత్రా లోకేష్ తో నరేష్ అనుబంధం మాత్రం కేవలం సినీ వర్గాలలోనే కాకుండా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ పవిత్రా లోకేష్ ఎవరు? నరేష్ తో ఆమె అనుబంధం ఏమిటన్న వివరాల్లోకి వెళితే. కర్ణాటకలోని మైసూర్‌లో జన్మించిన పవిత్ర లోకేశ్ తండ్రి కన్నడ నటుడు లోకేష్. ఆయన పవిత్ర లోకేష్ చిన్నతనంలోనే మరణించారు. దీంతో పవిత్ర లోకేష్ తండ్రి సినీవారసత్వాన్ని కొనసాగించారు.
ఒక వైపు నటిస్తూనే శ్రద్ధగా చదువుకుని డిగ్రీ పూర్తి చేశారు. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. ఆ తరువాత సీనిమాలనే కెరీర్ గా ఎంచుకున్నారు. కన్నడ నాట హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించినా పెద్దగా పాపులర్ కాలేదు. కన్నడలో హీరోయిన్ గా అయితేనేం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయితేనేం దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించారు. పలు అవార్డులు సైతం అందుకున్నారు.
ఆమె భర్త సుచీంద్ర ప్రసాద్ కూడా కన్నడ నటుడే. అయితే సుచీంద్ర ప్రసాద్ కంటే ముందు ఆమెకు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో వివాహం అయ్యింది. ఆ తరువాత ఆయనతో విడాకులు తీసుకుని కన్నడ నటుడు సుచీంద్ర ప్రసాద్ లో సహజీవనం చేశారు. 2018 లో ఆయన నుంచి విడిపోయారు. కాగా ఆ తరువాత ఆమె తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. తొలుత రవితేజ హీరోగా నటించిన దొంగోడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పవిత్రా లోకేష్ ఆ తరువాత తెలుగు సినిమాలలో తల్లి, అత్త వంటి క్యారెక్టర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు.
ఈ క్రమంలోనే నటుడు లోకేష్ కు దగ్గరయ్యారు. వీరిరువురూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.