STOP TORTURING YOURSELF!



Today I’ll tell you a secret about life. Its not the people around you that make you unhappy. Its you! It can be hard to believe, but its true. Its time you stop torturing yourself in various ways. Lets make a list of things you need to stop doing.

The first thing you need to stop is clinging to the wrong people. Learn to identify your true well wishers from the millions of people you meet everyday. The worst thing you could be doing to yourself, is spending the most valuable days of your life with the wrong people.

Have a problem? Face it! Running away from it wont help you in any way. Remember that you have to solve your own problems. No one is going to do it for you. The sooner you make an attempt to solve them, the easier it is to solve them. Just know that you cant give up. Not even for a second!

Someone said honesty is an expensive gift. You may not be able to give it to everyone at all times but at least give it to yourself. This will give you an understanding of the reality and the courage to face it. Dont fool yourself.

Make yourself your priority. No, this wont make you selfish. It is good to love someone unconditionally but not at your own cost. Besides, you can give only when you have enough. If you forget to love yourself, you wont have any to give others either.

As the old saying goes, life is the best teacher. So learn from it and dont regret the mistakes you make in the process. After all what is the fun in learning without making mistakes. Cherish the mistake and learn your lesson for similar circumstances in the future.

The most common mistake we all make in trying to impress the world is pretending! Pretending to be someone else or pretending like something we dont like. This will only kill your happiness. So stop pretending. Be yourself and love it! Make these simple changes in your life and see how it takes a happy turn.


-Kruti Beesam

ఈ రూల్స్ ఫాలో అయితే న్యూ ఇయర్ లో పిల్లల సక్సెస్ పక్కా..!

కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ. ఇప్పుడైతే తొందరలోనే కొత్త ఏడాది రాబోతోంది.  క్యాలెండర్ తో పాటు తమ జీవితం కూడా మారాలని కొండంత ఆశ పెట్టుకుని ఉంటారు అందరూ. మరీ ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రి తమ కంటే ఎక్కువగా తమ పిల్లల జీవితం గురించే ఆలోచిస్తారు.  తమ పిల్లలు సంతోషంగా ఉండాలని,  చదువులో, కెరీర్ లో విజయం సాధించాలని కోరుకుంటారు. చదువుకునే పిల్లల తల్లిదండ్రులు ఈ కొత్త ఏడాదిలో తమ పిల్లలు సక్సెస్ గా ముందుకు సాగాలని కోరుకుంటారు.  అయితే పిల్లలు కొత్త ఏడాదిలో సక్సెస్ కావాలన్నా, వారి భవిష్యత్తు మరెంతో గొప్పగా  ఉండాలన్నా  కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి.  అవేంటో తెలుసుకుంటే.. రీడింగ్.. చదవడం వల్ల పిల్లల ఊహ, భాష,  ఆలోచన అన్నీ బలపడతాయి. రోజూ చదివే పిల్లలకు మంచి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత  పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. కొత్త సంవత్సరం నుండి రోజుకు కనీసం 30 నిమిషాలు రీడింగ్ అలవాటు చేసుకోవాలని పిల్లలకు చెప్పాలి.  ఇందుకోసం ఏదైనా చదవవచ్చు.  కథ, కామిక్ లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్  అందించే పుస్తకం.. ఇలా ఏవైనా ఎంచుకోవచ్చు. స్క్రీన్ సమయం.. కొత్త సంవత్సరంలో పిల్లలు  ఫోన్‌కు దూరంగా ఉండటం అలవాటు చేయాలి. పగటిపూట  నిర్ణీత  సమయం కంటే ఎక్కువసేపు స్క్రీన్‌లను చూడటం వల్ల నిద్ర,  కంటి చూపు దెబ్బతింటుంది. పడుకునే గంట ముందు  మొబైల్ ఫోన్‌ను దూరంగా ఉండటం  కూడా చాలా ముఖ్యం. నిద్ర..  ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా ఫాలో కావల్సిన మంచి అలవాటు ఏంటంటే..  సరైన సమయానికి  పడుకుని, సరైన సమయానికి మేల్కోవడం. పిల్లల మానసిక అభివృద్ధికి చదువు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. కాబట్టి రాత్రి సరైన సమయానికి పడుకుని, ఉదయాన్నే నిద్రలేచే అలవాటు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. నేర్చుకోవడం.. నేర్చుకునే అలవాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఇది పిల్లలను పోటీ ప్రపంచానికి సిద్ధం చేస్తుంది. పిల్లలు కొత్త పదజాలం, చిత్రలేఖనం, సంగీతం లేదా క్రీడలు ఏదైనా కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి. ఇందుకోసం తల్లిదండ్రులు పిల్లలకు చాలా సహకారం అందించాలి. నడవడిక.. ఎవరికైనా సరే ధాంక్స్  చెప్పడం, పెద్దలను గౌరవించడం,  సహాయం చేయడం వంటివి వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసే  అలవాట్లు. ఇతరులను గౌరవించడం, మంచి మర్యాదలను అలవర్చుకోవడం చేయాలి. ఆహారం.. పిల్లల ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త తీసుకోవడం తప్పనిసిరి.  జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.   జంక్ ఫుడ్ కు బదులుగా పండ్లు, కూరగాయలు,  ఇంట్లో వండిన ఆహారాన్నితీసుకోవాలి. పిల్లల రోగనిరోధక శక్తి,  పెరుగుదలకు మంచి ఆహారపు అలవాట్లు చాలా అవసరం. వ్యాయామం.. ఆటలు..  పిల్లలను ఆరోగ్యంగా ఉంచడంలో వ్యాయామం, ఆటలు చాలా బాగా సహాయపడతాయి. పిల్లలను బయటకు వెళ్లి ఆడుకోవడం ప్రోత్సహించాలి.  ఇది  పిల్లలను సామాజికంగా కలిసిపోయేలా చేస్తుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పిల్లలకు ప్రతిరోజూ కనీసం 60 నిమిషాల శారీరక శ్రమ అవసరం. అందువల్ల పిల్లలు తమ శారీరక వ్యాయామాన్ని,  బయటకు వెళ్లి తోటి పిల్లలతో ఆడుకోవడాన్ని ప్రోత్సహించాలి.  దీనికి తల్లిదండ్రులు కూడా సహకరించాలి.                                    *రూపశ్రీ.

క్రిస్మస్ ను డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారు?

క్రిస్మస్ అనేది  క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగ. దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఏటా డిసెంబర్ 25న   జరుపుకుంటారు. ఈ పండుగ ప్రేమ, కరుణ, శాంతి,  మానవత్వం యొక్క సందేశాన్ని ప్రపంచమంతా తెలియజేస్తుంది.  క్రిస్మస్ పండుగ రోజున ప్రతి  ఇల్లు దీపాలతో,  నక్షత్ర ఆకారపు విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు.  అంతే కాదు.. క్రిస్మస్ మతం తో సంబందం లేకుండా అన్ని మతాల వారినీ కేక్ కటింగ్ కు పిలుస్తారు.  ఇలా అందరూ క్రిస్మస్ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటారు.  అయితే డిసెంబర్ 25వ తేదీనే క్రిస్మస్ పండుగ జరుపుకోవడం వెనుక కారణం ఏమిటి? క్రిస్మస్ పండుగ రోజు స్నేహితులకు ఎలాంటి బహుమతులు ఇవ్వడం మంచిది? తెలుసుకుంటే.. డిసెంబర్ 25నే క్రిస్మస్ ఎందుకంటే మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ,  త్యాగం యొక్క మార్గాన్ని చూపిం చాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు. క్రిస్మస్ సంప్రదాయాలు క్రిస్మస్ రోజున ప్రజలు చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రభువైన యేసు జీవితాన్ని, ఆయన  బోధనలను గుర్తుచేసుకుంటారు.  క్రైస్తవుల ప్రతి ఇంట్లో  క్రిస్మస్ చెట్లను అలంకరిస్తారు, కరోల్స్ పాడతారు,  కేకులు కట్ చేస్తారు. పిల్లలలో శాంతా క్లాజ్ ఆనందంగా గడుపుతారు.  క్రిస్మస్ ముఖ్యంగా  బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి  పెద్ద పీట వేస్తుంది. ముఖ్యంగా  ఈ పండుగ పేదలకు సహాయం చేయడానికి,  దాతృత్వానికి దానం చేయడానికి కూడా ప్రేరణనిస్తుంది. క్రిస్మస్ రోజున స్నేహితులకు, పరిచయస్తులకు గిఫ్ట్ లు ఇస్తుంటారు.   స్నేహితులకు, పరిచయస్తులకు ఎలాంటి గిఫ్ట్ లు ఇవ్వాలి చాక్లెట్లు, ప్లం కేకులు,  కుకీలను క్రిస్మస్ కోసం సాంప్రదాయంగానూ,  గొప్ప  బహుమతులుగానూ భావిస్తారు. ముఖ్యంగా ఇంట్లో తయారుచేసిన కేకులు,  కుకీలు స్నేహాలకు తీపిని జోడిస్తాయి,  సాన్నిహిత్యాన్ని బలపరుస్తాయి. గ్రీటింగ్ కార్డ్, ఫోటో ఫ్రేమ్ లేదా  ఏదైనా చాలా సొంతంగా తయారు చేసిన బహుమతులు  చాలా ప్రత్యేకమైనవి. అలాంటి బహుమతులు సమయాన్ని,  ఓపికను,  కష్టాన్ని స్నేహితుల కోసం వినియోగిస్తే చాలా మంచి ఎమోషనల్ అటాచ్మెంట్ ను పెంచుతాయి. పుస్తకాలను చాలా గొప్ప  బహుమతిగా పరిగణిస్తారు. స్నేహితుడి ఆసక్తికి సంబంధించిన ప్రేరణాత్మక, ఆధ్యాత్మిక పుస్తకాలు ఇవ్వవచ్చు.    పుస్తకం జ్ఞానాన్ని పెంచడమే కాకుండా చాలా కాలం పాటు గుర్తుండిపోతాయి. సువాసనగల కొవ్వొత్తులు,  అలంకరణ వస్తువులు, షోపీస్‌లు,  క్రిస్మస్ నేపథ్య అలంకరణ వస్తువులు ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి. ఈ బహుమతులు పండుగకు గల ఉద్దేశ్యాన్ని  మరింత ప్రత్యేకంగా చేస్తాయి. పర్సనల్ గా ఇచ్చి పుచ్చుకునే బహుమతులు కూడా క్రిస్మస్ లో ప్రాధాన్యత కలిగి ఉంటాయి.  మగ్గులు, కుషన్లు, డైరీలు, పేరు లేదా ఫోటోతో కూడిన కీ చైన్‌లు వంటి పర్సనల్  బహుమతులు  బాగుంటాయి. పైన పేర్కొన్న బహుమతులు అవతలి వ్యక్తికి ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. పిల్లల కోసం ప్రత్యేక బహుమతులు ఇవ్వాలంటే  వారికి బొమ్మలు, కథల పుస్తకాలు, డ్రాయింగ్ లేదా పెయింటింగ్ కిట్‌లను బహుమతిగా ఇవ్వడం చాలా మంచి సెలెక్షన్ అవుతుంది. ఇది పిల్లల ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. -రూపశ్రీ

ఐస్లాండ్ దేశంలో ఆశ్చర్యపోయే నిజం.. ఇక్కడ శాంతా క్లాజ్‌ల గురించి తెలుసా?

  ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి.  వారి వారి సాంప్రదాయాల పరంగా మార్పులు ఉంటాయి.  అదేవిధంగా ఐస్లాండ్ దేశంలో కూడా  క్రిస్మస్ లో కూడా ఒక ప్రత్యేకత, వింత ఉంది.  అదే శాంతా క్లాజ్.. ప్రతి దేశంలోనూ క్రిస్మస్ వేడుక వచ్చిందంటే పిల్లలు అందరూ శాంతా క్లాజ్ కోసం ఎదురు చూస్తారు.  శాంతా క్లాజ్ పిల్లలకు బోలెడు బహుమతులు తెస్తాడని నమ్ముతారు.  అయితే ఐస్లాండ్ లో మాత్రం శాంతా క్లాజ్ విషయంలో చాలా ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలలో శాంతా క్లాజ్ ఒక్కడే.. కానీ ఐస్లాండ్ లో మాత్రం 13మంది శాంతా క్లాజ్ లు ఉంటారట. జానపద కథ ఏం చెప్తుందంటే.. ప్రతి దేశంలో జానపద కథలు ఉన్నట్టే ఐస్లాండ్ లోనూ జానపద కథలు ఉన్నాయి. అక్కడి జానపద కథల ప్రకారం అక్కడి శాంతా క్లాజ్ లను యూల్ లాడ్స్ అని పిలవడానికి ఇష్టపడతారు. ఈ 13మంది గురించి మొదటగా 1862లో ప్రస్తావించబడిందట. రచయిత జాన్ అర్నాసన్ ప్రసిద్ధ గ్రిమ్స్ నుండి ప్రేరణ పొంది జానపద కథలను సేకరించడం మొదలు  పెట్టాడు. 1932లో ఐస్లాండిక్ కవి జోహన్నెస్ ఉర్ కోట్లమ్  యూల్ లాడ్స్ అనే కవితను క్రిస్మస్ ఈజ్ కమింగ్ అనే పుస్తకంలో ప్రచురించాడు.  ఇది వారి పేర్లు, వ్యక్తిత్వాలతో పాటు వారి గురించి ఒక నమ్మకాన్ని సెట్ చేసింది. యూల్ లాడ్స్ ప్రకారం 13మంది అన్నదమ్ములు గ్రైలా అనే ట్రోల్ కు జన్మించారట. కానీ కాలక్రమేణా వారి పిల్లలు, వారసులు అందరూ ఉదారంగా బహుమతులు ఇచ్చుకుంటూ వెళ్లారచ.  దీని వల్ల వారికి ఆర్థిక సమస్యలు వచ్చాయి. చివరకు వారికి ఏమీ మిగలకుండా పోయిందట.  క్రిస్మస్ కు ముందు ప్రతి రాత్రి ఈ 13మంది యూల్ లాడ్స్ పిల్లలను అందరినీ సందర్శిస్తారట. ఐస్లాండ్ జానపద కథల ప్రకారం,  ఏడాది పొడవునా మంచి ప్రవర్తన కలిగిన ప్రతి చిన్న పిల్లవాడు యూల్ లాడ్స్ నుండి  ఒక చిన్న బహుమతి పొందుతాడట.  అంతేకాదు.. అల్లరి పిల్లలకు పచ్చిగా ఉన్న  లేదా కుళ్లిన బంగాళాదుంపను ఇస్తారట.  అక్కడి పిల్లలు క్రిస్మస్ బహుమతి స్వీకరించడానికి కిటికి గుమ్మం మీద ఒక  షూ ను ఉంచుతారట.  ఇదీ ఐస్లాండ్ లో క్రిస్మస్ విశేషం.                                         *రూపశ్రీ.

తెలివైన వాళ్లమని మిడిసిపడుతున్నారా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు వెంటే షాకవుతారు..!

తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం వచ్చిన ప్రతి సారి తమ తెలివితేటలు, సామర్థ్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు.. ఎవరైతే తెలివి లేని వెధవ అని అన్నారో.. వారికి తమ విజయం తెలిసేవరకు మనసు ప్రశాంతంగా మారదు.  తాము తెలివైన వాళ్ళం అని నిరూపించేంత వరకు వారి అహం కూడా అస్సలు తగ్గదు. అయితే ఇదంతా కూడా చాలా పిచ్చి చేష్ట అని  అంటున్నాడు ఆచార్య చాణక్యుడు. ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్తగా, రాజనీతి శాస్త్రజ్ఞునిగా,  ఆర్థిక నియమాలు అద్బుతంగా వెల్లడించిన వ్యక్తిగా అందరికీ పరిచయమే.  ఆయన రెండువేల సంవత్సరాల కిందట చెప్పిన విషయాలు నేటికీ  ఆచరణీయంగా, అనుసరణీయంగా ఉన్నాయి. దీన్ని బట్టి ఆయన మనుషులను,  సమాజాన్ని, పరిస్థితులను, రాజకీయాన్ని ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేశారో అర్థం చేసుకోవచ్చు. అంతటి గొప్ప వ్యక్తి తెలివైన వారికి ఒక నమ్మలేని  వాస్తవాన్ని చెప్పారు. ఈ విషయం చదివితే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. అదేంటో తెలుసుకుంటే.. చాణక్యుడు చెప్పిన నమ్మలేని రహస్యం.. చాణక్యుడు ప్రజలను తెలివైన వారిగా ఉండమని చెబుతాడు. అయితే బయటకు మాత్రం మూర్ఖులుగా నటించమని చెబుతాడు. అంతేకాదు.. అవసరమైనప్పుడు స్వార్థంగా కూడా ఉండాలని చెబుతాడు. ఈ విషయంగానే ఇదొక తప్పు మార్గం అని అందరూ అనుకుంటారు. కానీ ఆయన చెప్పిన విషయాలకు తగిన వివరణ కూడా ఇచ్చాడు. ప్రతి వ్యక్తి తాను చేసే పనిని, తన ప్రణాళికను గొప్పగా అందరికీ తెలిసేలా చెప్పడం తెలివైన పని కాదని చాణక్యుడు అంటాడు.  ప్రస్తుత  ప్రపంచంలో ప్రజలు,  చుట్టుపక్కల ఉండేవారు, సన్నిహితులు,  ఆత్మీయులు అందరూ  స్నేహపూర్వకంగా కనిపిస్తుంటారు.  కానీ వారి ఉద్దేశాలు ఎల్లప్పుడూ స్వచ్ఛమైనవిగా ఉండవని చాణక్యుడు చెబుతాడు.  అందరినీ గుడ్డిగా నమ్మితే ఏదో ఒకరోజు అవతలి వారు బలహీనతనలు క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది.   అందుకే నిజంగా తెలివైన వ్యక్తి ఎప్పుడూ తన తెలివితేటలను అవసరం లేకుండా బయటపెట్టడు.  అందరికీ ప్రదర్శన ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తన తెలివిని బయటపెట్టడు. మూర్ఖుడిలా నటించాలి ఎందుకుంటే.. ఒక వ్యక్తి తనను తాను తెలివైన వాడిని అని నిరూపించుకోవడానికి ట్రై చేస్తుంటే అలాంటి వ్యక్తి నుండి అందరూ క్రమంగా దూరం అవుతారని చాణక్యుడు అంటున్నాడు. లేకపోతే ఇతరుల వల్ల హాని కలగడం లేదా ఇతరుల కుట్రలకు బలి కావడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే తెలివైన వాడిని అని అందరికీ తెలిసేలా చేయడం కంటే మూర్ఖుడిగా నటించడం ఉత్తమం. దీని వల్ల ఇతరుల ప్రణాళిక, వారి ఉద్దేశ్యాలు గుర్తించడం సులువు అవుతుంది. అంతేకాదు.. ఎవరి ముందు అయినా సరే.. తక్కువగా మాట్లాడి, ఎదుటివారికి ఎక్కువ మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఇలా చేసినప్పుడు ఎదుటివారి ఉద్దేశ్యాలు చాలా బాగా అర్థం చేసుకోవచ్చు.  స్వార్థంగా ఎందుకు ఉండాలి? ఎప్పుడు ఉండాలి? మనుషులు స్వార్థపూరితంగా ఉండాలని చాణక్యుడు ఎప్పుడూ సమర్థించడు. పరిస్థితులు  మారిపోయినప్పుడు, ఒక వ్యక్తిని ఇతరులు స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నప్పుడు,  స్వంత ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలని చాణక్యుడు చెబుతాడు.  మొదట తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, తమ పనులను తాము సమర్థవంతంగా చేసుకుంటూ తమకంటూ ఒక గౌరవ స్థానం ఏర్పరుచుకున్నప్పుడు ప్రపంచం కూడా గుర్తిస్తుంది, గౌరవిస్తుంది.  ఎప్పుడూ  ఇతరుల కోసం మాత్రమే బ్రతికేవారిని ప్రజలు  దోపిడీ చేస్తారు. స్వార్థపూరితంగా ఉండటం అంటే ఇతరులకు హాని చేయడం కాదు, ప్రతి వ్యక్తి తన  హక్కులను కాపాడుకోవడం. తెలివి, చాకచక్యం.. తెలివిగా ఉండటం,  చాకచక్యంగా ఉండటం రెండూ ఒకటే అనుకుంటారు చాలామంది. కానీ ఈ రెండింటి  మధ్య చాలా తేడా ఉంది. తెలివి అంటే పరిస్థితులను తెలివిగా నిర్వహించడం,   మాటలు  నిర్ణయాలలో సమతుల్యతను కాపాడుకోవడం. ప్రతి పరిస్థితిలోనూ ప్రశాంతంగా ఆలోచించి, సరైన సమయంలో తమ జ్ఞానాన్ని ఉపయోగించే వారు మాత్రమే జీవితంలో నిజమైన విజయాన్ని సాధిస్తారని చాణక్య నీతి బోధిస్తుంది. చాకచక్యం ఏదైనా పనిని సులువుగా,  ఎలాంటి సమస్య లేకుండా చేయడం.  కాబట్టి చాకచక్యంగా ఉండటం ముఖ్యమే కానీ తెలివైన వారు కూడా మూర్ఖుడిలా నటిస్తూ సరైన జీవితాన్ని గడపడం చాలా ముఖ్యం.                               *రూపశ్రీ.

గణితంతో గమ్మత్తులు చేసిన శ్రీనివాస రామానుజన్ జయంతి నేడు..!

గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం.  చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది.  కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి,  శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు.   ఈ సందర్బంగానే  ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. జాతీయ గణిత దినోత్సవాన్ని  భారత ప్రభుత్వం డిసెంబర్ 2011లో అధికారికంగా ప్రారంభించింది.  రామానుజన్ గణిత  విభాగానికి చేసిన అసాధారణ కృషికి గుర్తింపుగా డిసెంబర్ 22ని జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది . మరుసటి సంవత్సరం 2012 దేశవ్యాప్తంగా జాతీయ గణిత సంవత్సరంగా జరుపుకున్నారు, గణిత అభ్యాసం,  పరిశోధనలకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చే దిశగా జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రణాళికలు వేసుకోవడం,  ప్రోత్సాహం అందించడం, కృషి చేయడం.. అలాగే గణిత శాస్త్రానికి చేస్తున్న సేవలను గుర్తించి, ఆయా వ్యక్తులను గౌరవించడం వంటివి జరుగుతాయి. డిసెంబర్ 22.. డిసెంబర్ 22న శ్రీనివాస రామానుజన్ జన్మదినం. ఆయన కృషి వందేళ్లు గడిచిన  తర్వాత కూడా నేటి మోడరన్  గణితాన్ని ప్రభావితం చేస్తోంది. గణితంలో ఆయన చేసిన పరిష్కారాలు,  సమస్యలు,  ప్రపంచం మీద ఆయన ప్రభావం మొదలైనవి గుర్తించడానికి డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఇది ఆయనకు  నివాళిగా మాత్రమే కాకుండా, విద్యార్థులు,  పరిశోధకులు గణితాన్ని ఆవిష్కరించడం,  సాంకేతికత,  శాస్త్రీయ విచారణకు కేంద్రంగా గణితాన్ని  ప్రోత్సహించడానికి ఒక మంచి వేదిక అవుతుంది. సుధీర్ఘ ప్రయాణం.. భారతదేశానికి, గణిత శాస్త్రానికి  అనుబంధం ఆధునిక చరిత్రది కాదు..  అనేక శతాబ్దాల ముందే ఈ అనుబంధం ఉంది. భారతదేశం గణిత శాస్త్రానికి చేసిన కృషిని క్రీస్తుపూర్వం 1200 నుండి క్రీస్తుపూర్వం 1800 వరకు గుర్తించవచ్చు. అంకగణితం, బీజగణితం,  త్రికోణమితిలో గణనీయమైన పరిణామాలతో పాటు.. దశాంశ సంఖ్యా వ్యవస్థ, సున్నా,  ప్రతికూల సంఖ్యలను  వాడటం వంటి ప్రాథమిక భావనలు భారతదేశంలో పుట్టాయి.   దాదాపు నాల్గవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు విస్తరించి ఉన్న భారతీయ గణిత శాస్త్రంలోని క్లాసికల్,  స్వర్ణ యుగాలలో ఆర్యభట్ట, వరాహమిహిర, బ్రహ్మగుప్త,  భాస్కర II వంటి పండితుల నుండి ముఖ్యమైన ఆవిష్కరణలు జరిగాయి. ఇంత సుధీర్ఘమైన బారత గణిత చరిత్రలో  శ్రీనివాస రామానుజ్ కూడా ప్రముఖుడు అని చెప్పడానికి ఆయన జయంతి రోజున గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. రామానుజ్ వారసత్వం.. గణిత విశ్లేషణ, సంఖ్యా సిద్ధాంతం, అనంత శ్రేణి,   భిన్నాలలో రామానుజన్ తన మార్గదర్శకులకు ఎప్పుడూ  గుర్తుండిపోతారు. నాటి కాలంలో ఆయనకు అధికారం, శిక్షణ అన్నీ చాలా తక్కువగా ఉన్నప్పటికీ   స్వతంత్రంగా దాదాపు 3,900 ఫలితాలను సంకలనం చేశాడు. వాటిలో చాలా వరకు  తరువాత కాలంలో  అసలైనవని,  చాలా  లోతైనవిగా నిరూపించబడ్డాయి.  ఆయన విధానం, పద్దతులు ఇరవయ్యవ శతాబ్దపు గణిత శాస్త్రంలోని కీలక రంగాలను పునర్నిర్మించాయి.  ఇరవై ఒకటవ శతాబ్దంలో పరిశోధనలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.                                   *రూపశ్రీ.  

మీకు తెలుసా? రిలేషన్ నిలబడటానికి ఈ అబద్దాలు చెప్పినా అస్సలు తప్పు లేదట..!

ప్రతి విషయంలోనూ నిజం మాట్లాడితేనే రిలేషన్ బాగుంటుందని కొందరు అనుకుంటారు. నిజాయితీ ఉన్నప్పుడు, నిజం మాట్లాడినప్పుడే ఆ వ్యక్తి జెన్యూన్ అని చెబుతూ ఉంటారు కూడా. అయితే ఎప్పుడూ నిజం మాట్లాడటం వల్ల రిలేషన్స్ లో  గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. భార్యాభర్తలలో ఎవరైనా ఏదైనా నిజం చెప్పినప్పుడు.. అది గొడవకు దారితీస్తే  వెంటనే వినిపించే మాట.. నీకు నిజం చెప్పాను చూడు.. నాది బుద్ధి తక్కువ అని. దీన్ని బట్టి అన్నిసార్లు నిజం చెప్పడం అంటే గొడవలను కోరి తెచ్చుకోవడమే అని అర్థం.  కొన్ని సందర్భాల్లో అబద్దాలు చెప్పడం వల్ల రిలేషన్ లో గొడవలు రావడానికి బదులు ఆ బంధం బలపడే అవకాశం,  ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా ఉండే అవకాశం ఉంటుందని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మూడు రకాల అబద్దాలు చెప్పడం వల్ల రిలేషన్ పాడవకుండా దృఢంగా మారుతుందని అంటున్నారు. ఇంతకీ ఆ అబద్దాలేంటో ఎందుకు మేలు చేస్తాయో తెలుసుకుంటే.. పొగడ్తలు.. మెచ్చుకోలు..  లైఫ్ పార్ట్నర్  లేదా స్నేహితుడు కొత్త హెయిర్ కట్, కొత్త పెయింటింగ్ లేదా కొత్త డ్రెస్ లేదా ఏదైనా సరే.. ఏదైనా  కొత్తగా చేసినప్పుడు ఒకవేళ అది నచ్చకపోతే..  మొహం మీద బాలేదని చెప్పడం కంటే బాగుందని మెచ్చుకుంటే మేలు. నిజం చెప్పి వారిని బాధపెట్టే బదులు,  వారికి ఒక చిన్న ప్రశంస ఇవ్వవచ్చు. "వావ్" లేదా "సూపర్" లాంటి పదాలతో పొగడ్త ఇవ్వడం వల్ల ఎదుటివారు సంతోషపడతారు. దీనివల్ల ఇద్దరి మధ్య బందం బలపడుతుంది. ఎప్పుడైనా తను చేసింది బాలేదని అర్థమైనా.. ఆ రోజు నన్ను బాధపెట్టడం ఇష్టం లేక ఇలా అన్నారు కదా.. అనే ఒక ఆలోచన ఎదుటివారి దృష్టిలో మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడుతుంది. మద్దతు.. తప్పులు అందరూ చేస్తారు. అయితే ఏదో ఒక సందర్భంలో.. ఒకరు ముందు ఒకరు వెనుక చేయవచ్చు. ఆ మాత్రం దానికి మనిషిని నిందించకూడదు. మరీ ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం వ్యక్తిని ఎప్పుడూ నిందించకూడదు. ఒకవేళ నలుగురిలో ఏదైనా తప్పు జరిగినా, అందరి ముందు దోషిలా నిలబడే పరిస్థితి వచ్చినా మనిషిని వెనకేసుకురావాలి.  సపోర్ట్ గా నిలబడాలి. అలా సపోర్ట్ గా ఉండటానికి నలుగురిలో అబద్దం చెప్పినా తప్పు లేదు. భరోసా.. మనకు బాగా కావలసిన వాళ్లు, మన స్నేహితులు, మనతో చనువుగా ఉండేవారు ఎప్పుడైనా జీవితం గురించి ఇబ్బందిగా, బాధగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వెంటే మనకు కూడా బాగా బాధ కలుగుతుంది.  భవిష్యత్తు గురించి వాళ్ల మనసులో భయం కనిపించినప్పుడో లేదా దేని గురించైనా ఏమవుతుందో అని బాధపడుతున్నప్పుడో  వారికి ఊరట కలిగే విధంగా మాటలు చెప్పడం చాలా ముఖ్యం.  అలాంటప్పుడు ధైర్యం చెప్పడం,  భవిష్యత్తు గురించి భరోసా ఇవ్వడం,  భవిష్యత్తు గురించి ఆశ కలిగేలా మాట్లాడటం చాలా ముఖ్యం. వారిలో ఆశాభావం పెరిగి వారు ఆత్మవిశ్వాసం కలుగుతుంది అంటే అలాంటి సందర్భాలలో అబద్దం చెప్పినా తప్పేం లేదు. చివరగా చెప్పేది ఏంటంటే.. అబద్దం అనేది ఎవరినీ మోసం చేయాలని,  బాధపెట్టాలని కాదు.. ఇతరులు సంతోషిస్తారని, బాధ నుండి బయటకు రాగలుగుతారని అనిపిస్తే అబద్దం చెప్పడంలో తప్పేం లేదనేది పెద్దలు కూడా చెప్పే మాట. కానీ మనిషి జీవితాన్ని ఇబ్బందులలోకి తోసేలా.. నమ్మించి మోసం చేసేలా అబద్దాలు ఎప్పటికీ ఆడకూడదు.                                *రూపశ్రీ.

భార్యాభర్తల బంధంలో ప్రేమ తగ్గకూడదంటే.. ఇలా చేయండి..!

ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది. అంతే కాదు.. ప్రేమ లేని బంధాలు ఎక్కువ కాలం నిలబడవు కూడా. ఇద్దరు వ్యక్తులను అన్ని పరిస్థితులలో నిలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  అయితే బార్యాభర్తల బందంలో చాలా మంది ప్రేమ లేదని అంటూ ఉంటారు.  కొందరేమో ప్రేమ లేకపోయినా కేవలం బందం కోసం ఒక యంత్రంలా బ్రతికేస్తుంటారు. అలా ఉన్న బంధాలలో జీవం ఉండదు. భార్యాభర్తల బందంలో ప్రేమ ఉన్నప్పుడు అది చాలా కాలం ఎంతో అన్యోన్యంగా ఉండేలా చేస్తుంది. అయితే భార్యాభర్తల బందాన్ని బలంగా ఉంచే చిట్కాలు కొన్ని ఉన్నాయి.  ఇవి ఇద్దరి మధ్య ప్రేమను పెంచి ఇద్దరిని మరింత దగ్గర చేస్తాయి.  ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..  నిజాయితీగా ఉండాలి.. నిజాయితీ అనేది సంబంధానికి బలమైన పునాది. చిన్న విషయాలకు కూడా అబద్ధం చెప్పడం వల్ల సంబంధం దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పుడూ నిజం చెప్పాలి.   లైప్ పార్ట్నర్ ఫీలింగ్స్ ను కూడా గౌరవించాలి.  నిజాయితీ నమ్మకాన్ని పెంచుతుంది,  ప్రేమను మరింత పెంచుతుంది. ప్రేమ.. మాటల్లో కాదు చేతల్లో.. చాలామంది మాటల్లో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి అదే నిజమైన ప్రేమ అనుకుంటారు. కానీ నిజమైన ప్రేమ అనేది చేతల్లో చూపించాలి. ఒకరికొకరు సమయం కేటాయించడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం,  చిన్న చిన్న విషయాలలో కూడా కేరింగ్ గా ఉండటం వంటివి ఇద్దరి మధ్య ప్రేమను బలపరుస్తుంది. చిన్న సంతోషాలు.. ప్రేమను, సంతోషాన్ని పంచుకోవడానికి పెద్ద పెద్ద విజయాలు, పెద్ద సమయాలు,  పెద్ద ప్లానింగ్ లు అవసరం లేదు.  చిన్న చిన్న సందర్భాలను కూడా ఇద్దరూ కలిసి సంతోషంగా ఎంజాయ్ చేయవచ్చు. అభిరుచులను షేర్ చేసుకోవడం,  చిన్న సర్‌ప్రైజ్ లు, చిన్న బహుమతులు లాంటివి ఇద్దరి మధ్య బంధాన్ని బలంగా మారుస్తాయి. కమ్యూనికేషన్.. నేటి కాలంలో సంబంధాలలో కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే చాలా పెద్ద గొడవలకు కారణం అవుతోంది.   ఆనందాలు, బాధలు, సమస్యలు,  సంతోషకరమైన విషయాలను  ఒకరితో ఒకరు పంచుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏ విషయాన్ని అయినా ఆరో్గ్యకరంగా డిస్కస్ చేసుకున్నప్పుడు ఇద్దరి మధ్య మంచి బంధం ఉంటుంది. ఇగో.. బందాలను దెబ్బ తీసే అతిపెద్ద శత్రువు ఇగో..  చిన్న కోపతాపాలు లేదా కోపంలో మాట్లాడే మాటలు కూడా సంబంధాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి క్షమించడం నేర్చుకోవాలి. భార్యాభర్తలు ఏ గొడవలు జరిగినా ఇద్దరూ ఒకరినొకరు క్షమించడం నేర్చుకున్నప్పుడే బంధం నిలబడుతుంది.  ఇగోను పక్కన పెట్టినప్పుడే ఇద్దరూ సంతోషంగా ఉండగలుగుతారు.                                                 *రూపశ్రీ.

ఈ తప్పులు చేస్తే ధనవంతుడు పేదవాడు అవుతాడు.!

మన జీవితంలో మనకు తెలియకుండానే చాలా తప్పులు చేస్తాం. కానీ ఆ తప్పుల వల్ల మనం డబ్బు పోగొట్టుకుంటాం. చాణక్యుడి ప్రకారం, కొన్ని తప్పులు ధనవంతులను కూడా పేదలుగా మారుస్తాయి. ఆ తప్పులేంటో చూద్దాం. ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేయడంలో అతని పాత్ర గొప్పది. చాణక్యుడి ఈ తత్వశాస్త్రం మన జీవితంలో చాలా ముఖ్యమైనది.ఆచార్య చాణక్యుడు రచించిన నీతిశాస్త్రంలో జీవితం, డబ్బు, సమాజం, సంబంధాలు, వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆలోచనలు ఇచ్చారు. ఆయన సూత్రాలను పాటిస్తూ జీవనం సాగిస్తే విజయం వరిస్తుంది.అలాగే, చాణక్యుడు ప్రకారం, జీవితంలో మనం చేసే తప్పులు డబ్బు నష్టానికి,  బాధకు దారితీస్తాయి. అదేవిధంగా మన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతాయి. ప్రధానంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బును కుటుంబ పోషణ,  ఇతరుల సంక్షేమం కోసం ఉపయోగించాలి.  మిగిలిన డబ్బును పెట్టుబడి పెట్టాలి.మీరు సంపాదించిన డబ్బును జూదం, బెట్టింగ్ మొదలైన వాటిపై ఎప్పుడూ వృధా చేయకండి. ఆనందం కోసం డబ్బును దుర్వినియోగం చేయడం సమీప భవిష్యత్తులో మిమ్మల్ని మరింత సమస్యగా మార్చే అవకాశం ఉంది.డబ్బు ఎప్పుడూ ఇతరుల మంచికే ఉపయోగించాలి. ఇతరులకు హాని కలిగించడానికి ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇది లక్ష్మీ దేవికి కోపం తెప్పిస్తుంది. తద్వారా మనం డబ్బును కోల్పోవచ్చు.మరీ ముఖ్యంగా డబ్బు ఆదా చేసే అలవాటు ఉండాలి. ఎంత డబ్బు వచ్చినా ఖర్చు పెట్టకూడదు. మనం వీలైనంత తక్కువ డబ్బు ఖర్చు చేయాలి. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.

పెళ్లైన ప్రతి జంట తప్పకుండా ఈ కారణాల వల్ల  గొడవలు పడతారట..!

  పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట మధ్య కొన్ని గొడవలు కామన్ గా జరుగుతాయని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు.పెళ్లయ్యాక ప్రతి జంట మధ్య జరిగే కామన్ గొడవలు ఏంటో తెలుసుకుంటే.. ఇవి అందరి మధ్యన జరుగుతాయి కాబట్టి వీటిని సీరియస్ గా తీసుకుని బంధాన్ని విచ్చిన్నం చేసుకోకూడదు అని ప్రతి జంట అర్థం చేసుకోగలుగుతుంది.  ఇంతకీ అందరు భార్యాభర్తల మధ్య కామన్ గా జరిగే గొడవలు ఏంటో తెలుసుకుంటే.. తల్లిదండ్రుల శైలి.. భార్యాభర్తల ఇద్దరి తల్లిదండ్రులు ఒకరి కుటుంబ విధానాన్ని మరొకరు విమర్శించుకోవడం చాలా కుటుంబాలలో కనిపిస్తుంది. ఒకరేమో చాలా నిర్లక్ష్యంగా పెంచారు అనే నిందలు వేస్తుంటారు, మరొకరు ఏమో ఏమీ చేత కాకుండా పెంచారని అంటారు, కొన్నిసార్లు చాలా స్ట్రిక్ట్ గా పెంచి పిరికివాళ్లుగా మార్చారని అంటారు.  ఇలా రెండు కుటుంబాలలో విబిన్న విధాలుగా పెంపకం ఉంటుంది.  పెళ్లైన తర్వాత వారికి చిన్నతనం నుండి అలవాటైన విధానం ఇప్పుడు కూడా కొనసాగాలని కోరుకుంటారు.   అంతేకాదు.. తమ చిన్నతనం ఎలా గడిచిందో అదే విధంగా తమ పిల్లలను కూడా పెంచాలని చూస్తారు. ఇది ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో సాగే గొడవ.  దీన్ని వీలైనంత చాకచక్యంగా పరిష్కరించుకోవాలి. డబ్బు.. డబ్బు చాలా ముఖ్యమైన అంశం.  కొన్ని కుటుంబాలు డబ్బుల విషయంలో చాలా ఆంక్షలు విధిస్తూ పెంచుతారు. మరికొన్ని కుటుంబాలు డబ్బు అనేది పిల్లల కోసమే కదా అనే ఆలోచనతో పిల్లలకు డబ్బు అలవాటు చేస్తారు, డబ్బు వల్ల వచ్చే సమస్యలు కొన్నిసార్లు చాలా తీవ్రమైన గొడవలకు కారణం అవుతాయి. భార్యాభర్తల అభిరుచులు డబ్బు విషయంలో ఒకటిగా ఉంటే పర్లేదు. కానీ ఒకరు పొదుపరి,  మరొకరు బాగా ఖర్చు పెట్టేవారు అయితే చాలా గొడవలు వస్తుంటాయి.  ముఖ్యంగా ఎప్పడైనా డబ్బు కారణంగా ఇంట్లో  ఆర్థిక సమస్యలు వస్తే జరిగే గొడవలు చాలా పెద్దగా ఉంటాయి. సాన్నిహిత్యం.. భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే వారి మధ్య సాన్నిహిత్యం కూడా చాలా బాగుండాలి. ఒకరు తమ ప్రేమను ఎక్స్పెస్ చేయగలిగితే మరొకరు అలా ప్రేమను ఎక్ప్రెస్ చేయకుండా తమలోనే దాచుకుంటారు.  దీని వల్ల ఒకరి మీద ఒకరికి విబిన్న అభిప్రాయాలు ఏర్పడతాయి.  ప్రేమించడం తెలియదు, ప్రేమ లేదు,  ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్నారు వంటి అపార్థాలు వస్తాయి.  ఎప్పుడు ప్రేమ గురించి తప్ప బాధ్యతగా ఉంటున్నానని ఆలోచించట్లేదు అని మరొకరు అనుకుంటారు. ఇలా చాలా విధాలుగా అపార్థాలు వస్తుంటాయి. భవిష్యత్తు.. పెళ్లైన ప్రతి జంటకు భవిష్యత్తు గురించి కొన్ని కలలు ఉంటాయి. పిల్లల కోసం ఒకరు కష్టపడతారు, మరొకరు కెరీర్ ను కూడా వదిలేసుకుంటారు.  జీవితంలో లక్ష్యాల కోసం ఒకరు ఆరాటపడతారు,  నేను ఎన్ని త్యాగాలు చేసినా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఒకరు అనుకుంటారు.  ఇలా చాలా విధాలుగా ఇద్దరూ తమలో తాము సంఘర్షణ పడుతుంటారు.  వీటి వల్ల కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. పైన పేర్కొన్న  ప్రతి గొడవ పెళ్లైన ప్రతి జంట మధ్య తప్పనిసరిగా జరుగుతుంది.  కేవలం తమ మద్య మాత్రమే గొడవ జరుగుతుందనే ఆలోచన చేస్తూ గొడవ జరిగినప్పుడు దానికి గల కారణాన్ని సమస్యగా చూసి దాన్ని పరిష్కరించుకోవాలి. అంతే కానీ భాగస్వామినే సమస్యగా చూస్తే ఆ బందం పెళుసుగా మారుతుంది.  అంతేకాదు.. భార్యాభర్తల మద్య గొడవలు జరిగినప్పుడు,  సమస్య వచ్చినప్పుడు రాజీ పడటం ప్రధానం.  ఎవరో ఒకరు రాజీ పడితే తప్ప బందం నిలవదు.  రాజీ పడటం అంటే తాము ఓడిపోవడం,  చిన్నతనం కావడం కాదు.. బంధాన్ని నిలబెట్టుకోవడం.                           *రూపశ్రీ. 

జాగ్రత్త అమ్మాయిలను ఎప్పుడూ ఈ 7 ప్రశ్నలు అడగకండి..!

నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది.  కొన్ని ప్రశ్నలు అమ్మాయిలను చాలా అసౌకర్యానికి గురి చేస్తుంటాయి. అమ్మాయిలను ఎప్పుడు అడగకూడని ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. వీటిని అడగకుండా ఉండటం వల్ల అమ్మాయిల గౌరవాన్ని కాపాడటమే కాకుండా వారి మానసిక స్థితిని కూడా కాపాడిన వాళ్లమవుతాము.  ఇంతకీ అమ్మాయిలను ఎప్పుడూ అడగకూడదని ప్రశ్నలేంటి? ఆ ప్రశ్నలను ఎందుకు అడగకూడదు? తెలుసుకుంటే.. శరీరం గురించి.. అమ్మాయిలు లావుగా  ఉండటం లేదా చాలా సన్నగా ఉండటం చాలామందిలో ఉంటుంది.  ఇది పైకి కనిపించే విషయమే.  ఎప్పుడైనా సరే అమ్మాయిలను కామెడీ కోసం లేదా సీరియస్ గా అయినా శరీర ఆకృతి గురించి,  బరువు గురించి అస్సలు అడగకూడదు.  ఇంత లావుగా ఉన్నావేంటి.. లేదా ఇంత సన్నగా ఉన్నావేంటి? వంటి ప్రశ్నలు ఎప్పుడూ వేయకూడదు. ఇది బాడీ  షేమింగ్ చేయడం కిందకు వస్తుంది.  ఇలా చేయడం వల్ల అమ్మాయిల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. శరీరం లావుగా లేదా సన్నగా ఉండటానికి చాలామంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నా హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్ల అలా ఉంటారు. దీనికి కామెంట్ చేస్తూ ప్రశ్నించడం తప్పు. పిల్లలు.. పెళ్లైన ప్రతి స్త్రీ కి ఎదురయ్యే ప్రశ్న పిల్లల గురించి.  కొత్తగా పెళ్లైన దగ్గర నుండి  పిల్లలు కలగడం ఆలస్యమయ్యే వారి వరకు ఎప్పుడూ పిల్లలను ఎప్పుడు కంటావ్ అని అడుగుతారు.  పిల్లలను కనాలనే నిర్ణయం కేవలం అమ్మాయిలది మాత్రమే కాదు.. వారి కుంటుంబానిది, మరీ ముఖ్యంగా భర్త కూడా దీనికి కీలకం.  అందుకే పిల్లల గురించి మహిళలను పదే పదే ప్రశ్నలు వేయకూడదు. ఇది వారిని మానసిక  ఒత్తిడికి గురి చేస్తుంది. వివాహం.. వయసు పెరుగుతున్నా వివాహం ఆలస్యం అవుతున్న అమ్మాయిలు కూడా ఉంటారు. లేదంటే భర్త చనిపోయిన తరువాత వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయిన మహిళలు కూడా ఉంటారు. ఇలాంటి వారితో ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ప్రశ్నలు వేయకూడదు. వివాహం  అనేది  మహిళల వ్యక్తిగతం. అలాగే అది కుటుంబ సమస్య కూడా.  దీని గురించి ప్రశ్నించడం వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. వృత్తి.. మగవారికి వారి జీవితకాలం వృత్తి పరమైన కెరీర్ ఉంటుంది. కానీ చాలామందికి  మహిళలు తమ కెరీర్ మధ్యలో వదిలేస్తారు అనే ఆలోచన ఉంటుంది.  పెళ్లి అయిన తరువాత  పిల్లలు పుడితే ఇక మహిళలు తమ కెరీర్ ను కొనసాగించలేరేమో అనే అభిప్రాయంతో ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. మహిళల కెరీర్ వారి ఇష్టం.  వారు తమ కుటుంబాన్ని చూసుకుంటూ వారి కెరీర్ కొనసాగించుకుంటే వచ్చే నష్టం ఏమీ లేదు.  అనవసరంగా వారి కెరీర్ ఇంకెన్నాళ్లు ఉంటుంది అని ప్రశ్నించకూడదు. సమయం.. చాలామంది మహిళలు బయటకు ఎక్కడికి వెళ్లినా ఎప్పుడైనా ఆలస్యం అయితే అందరూ అడిగే ప్రశ్న ఇంత ఆలస్యం ఎందుకైంది అని. అదే తొందరగా వారు ఎక్కడికైనా హాజరైతే ఇంత త్వరగా ఇంటి నుండి వచ్చావేంటని.  ఇవి మహిళలను అసౌకర్యానికి గురిచేస్తాయి.  మహిళలు కుటుంబాన్ని,  తమ పనులను చేసుకోవడంలో ప్రాధాన్యతలు, టైం మేనేజ్మెంట్ దగ్గర చాలా ఇబ్బందులు పడుతుంటారు. వారి ఆలస్యం గురించి కానీ,  వారి తొందర గురించి కానీ అలా  అడగకూడదు. ఇది విమర్శ చేసినట్టు అనిపిస్తుంది. సోషల్ మీడియా.. సోషల్ మీడియా ఇప్పట్లోచాలా సహజం. అయితే సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న మహిళలు  అనేకం.  చాలామంది అలాంటి మహిళల పట్ల ఎందుకు సోషల్ మీడియాలో  అంత యాక్టీవ్ ఉంటావు అని ప్రశ్నిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో గడపడం మహిళల వ్యక్తిగతం,  అది వారి అభిరుచి, ఆసక్తి ఆధారంగా ఉంటుంది.  దాని గురించి అందరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. డ్రస్సింగ్.. ప్రతి మహిళ తమ సౌకర్యం గురించి ఆలోచిస్తుంది.  కొందరు ప్యాషన్ ట్రెండ్ ను ఫాలో అవుతుంటారు.  ఏది ఏమైనా మహిళల డ్రెస్సింగ్ గురించి వారు ధరించే దుస్తుల గురించి ప్రశ్నించడం,  కామెంట్ చేయడం అస్సలు మంచిది కాదు. పైన పేర్కొన్న 7 విషయాలు మహిళల వ్యక్తిగతం,  కుటుంబానికి సంబంధించినవి.   వాటిని ప్రశ్నించడం వల్ల మహిళల వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్నట్టే. అంతేకాదు.. పై ప్రశ్నలు అడగడం వల్ల మహిళలు చాలా అసౌకర్యానికి ఫీలవుతారు. అలాగే వారి ఆత్మ విశ్వాసం కూడా దెబ్బతింటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు అంటున్నారు.                                     *రూపశ్రీ.