నిరాశపరచిన ఇస్రో ప్రయోగం
posted on Aug 7, 2022 @ 6:31PM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆదివారం ప్రయోగించిన రెండు ఉపగ్రహాలు తప్పుడు కక్ష్యలోకి వెళ్ళాయి. ఇస్రో నూతన రాకెట్ మొదటిసారి ఈ ఉపగ్రహాలను ప్రయోగించింది. అయితే ఇవి వృత్తాకార కక్ష్యలోకి వెళ్ళవలసి ఉండగా, దీర్ఘవృత్తా కార కక్ష్యలోకి వెళ్ళాయి. దీంతో ఇవి ఇక పనికిరావు. ఈ ప్రయోగం లక్ష్యాలు నెరవేరలేదు.
ఇస్రో ఆదివారం ఇచ్చిన ట్వీట్లలో తెలిపిన వివరాల ప్రకారం, ఇస్రో కొత్తగా అభివృద్ధిపరచిన చిన్న ఉపగ్రహ వాహక నౌక (ఎస్ ఎస్ ఎల్ వి) తొలి ప్రయాణం తుది దశలో డేటా నష్టాలకు గురైంది. 145 కేజీల బరువున్న ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓ ఎస్-02)ను, ఎనిమిది కేజీల బరువున్న ఆజాదీశాట్‌ను ఎస్ఎస్ఎల్‌వీ మోసుకెళ్ళింది. చిన్నచిన్న ఉపగ్రహాలతో అంతరిక్షం లోకి దూసుకెళ్లేలా ఎస్ఎస్ఎల్‌వీ డి-1ను ఇస్రో చాలా ప్రత్యేకంగా రూపొందించింది. 34 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్.. ద్వారా రెండు ఉపగ్రహాలను రోదసీలోకి తీసుకెళ్తుంది. ఇందులో దేశ అవసరాలకు సంబంధించిన 135 కేజీల మైక్రోశాట్–2ఎ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌తో పాటు.. దేశంలోని 75 జిల్లా పరిషత్ హైస్కూల్స్‌కు చెందిన 750 మంది గ్రామీణ విద్యా ర్థినులు తయారు చేసిన ఆజాదీ శాట్‌ను కూడా ఇందులో ప్రయోగించారు.
శ్రీహరి కోట నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు ఈ రెండు ఉపగ్రహాల ప్రయోగం జరిగింది. అనంతరం 738 సెకండ్లకు, 788 సెకండ్లకు ఇవి ఎస్ఎస్ఎల్‌వీ నుంచి వేరుపడటంతో మిషన్ కంట్రోల్ రూమ్‌లో నిశ్శబ్దం ఆవరించింది. శాస్త్రవేత్తలు సమస్య ను గుర్తించారు. ఓ సెన్సర్ వైఫల్యాన్ని గుర్తించడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత చేపట్టిన పరిష్కార చర్య పక్కదారి పట్టింది. ఓ కమిటీ దీనిని విశ్లేషించి, తగిన సిఫారసులు చేస్తుంది. ఈ రెండు ఉపగ్రహాలు ఇక ఉపయోగకరం కాదని వెల్లడైంది.