శ్రీలంకతో టీంతో కరుణానిధి, జయలలిత ఐపీయల్ మ్యాచ్
posted on Mar 19, 2013 @ 8:52PM
శ్రీలంక ప్రభుత్వం అక్కడి తమిళ ప్రజల మీద చేస్తున్న మారణ ఖాండకు వ్యతిరేఖంగా ఈనెల 21న జెనీవాలో జరుగనున్న మానవ హక్కుల సదస్సులో భారతదేశం తప్పనిసరిగా ఓటేస్తానని యుపీయే ప్రభుత్వం తనకు మాటివ్వనందుకు కరుణానిధి యుపీయే ప్రభుత్వంతో చెడుగుడు ఆడుకొంటుంటే, మరో వైపు అదే శ్రీలంక క్రికెట్ టీం కు చెందిన ఆరుగురు ప్లేయర్లు త్వరలో చెన్నైలో జరుగనున్న ఐపీయల్-6 మ్యాచులు ఆడేందుకు బయలుదేరుతున్నారు.
ఈ నేపద్యంలో అసలు వారిని మన తమిళ తంబిలు చెన్నైలో అడుగుపెట్టనిస్తారా అనే సందేహం కలగడం సహజమే. అయితే, కరుణానిధి ఎడ్డెం అంటే జయలలిత తెడ్డెం అంటుందనే సంగతి జగమెరిగిన రహస్యమే గనుక, తన ఆటగాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు తెలివిగా జయలలితకు ఒక లేఖ వ్రాసింది.
శత్రువు శత్రువు మిత్రుడన్నట్లు కరుణానిధికి శత్రువులు అందరూ జయలలితకు మిత్రుల కిందే లెక్క. వారు శ్రీలంక వారయినా సరే! గనుక వారిని కాపాడే బాధ్యత జయలలిత సంతోషంగా స్వీకరిస్తుందని శ్రీలంక క్రికెట్ బోర్డుకు తెలుసు గనుకనే తమ ఆటగాళ్ళు నిర్భయంగా వచ్చి చెన్నైలో ఆడుతారని ప్రకటించింది.
ఇదివరకు విశ్వరూపం సినిమా విడుదల సందర్భంలో కమల్ హాసన్ తో వీరిరువురూ ఏవిధంగా ఆడుకోన్నారో అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఐపీయల్ మ్యాచులలో వీరిరువురూ శ్రీలంక ఆటగాళ్ళతో ఏవిధంగా ఆడుకొంటారో వేచిచూడక తప్పదు.