కర్నాటక కాంగ్రెస్ లో కుమ్ములాటలు
posted on Dec 16, 2022 @ 5:03PM
కర్నాటక కాంగ్రెస్ లో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఈ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లాగే కర్నాటకలో కూడా ఏ పార్టీ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నది నడుస్తున్న చరిత్ర. ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఐదేళ్ల కోసారి ఇక్కడ సర్కార్ ను మార్చేస్తారు. ఆ ప్రకారం ప్రస్తుతం కర్నాటకలో అధికారంలో ఉన్నది బీజేపీ కనుక వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో అధికారం తమదేనన్న విశ్వాసం కాంగ్రెస్ లో మెండుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో పదవీ రగడ రాజుకుంది.
రాబోయే అధికారాన్ని ఊహించుకుంటూ ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఇప్పటి నుంచే హస్తం పార్టీలో కుమ్ములాటలు ఆరంభమయ్యాయి. ఇప్పటికే పార్టీలో డీకే శివకుమార్, సిద్దరామయ్య మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వీరి విభేదాలు చేరుకున్నాయి. పార్టీలో రగడ సంగతి పక్కన పెడితే వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ కోసం కూడా రాష్ట్ర నాయకులలో పోటీ తీవ్రంగా పెరిగింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ దేనన్న నమ్మకంతో పార్టీ టికెట్ల కోసం పోటీ తార స్థాయికి చేరింది. ఇలా టికెట్ల కోసం పోటీ పడుతూ పైరవీలు చేసుకుంటున్న వారిలో సీనియర్ నాయకులు, జూనియర్లు అన్న తేడా లేకుండా పోయింది. తమకే టికెట్ కావాలంటూ వారు పైరవీలతో పార్టీ హైకమాండ్ కు తల నొప్పులు తెచ్చి పెడుుతున్నారు.
దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ ఆశావహులంతా ఇప్పటికే హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లి కార్జున్ ఖర్గే చుట్టూ తిరుగుతున్న వారు కొందరైతే.. నేరుగా పార్టీ అధికార కేంద్రం అని అంతా భావించే సోనియా గాంధీ, ప్రియాంకల దయా దాక్షిణ్య కటాక్ష వీక్షణాల కోసం మరి కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది మే లోగా ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు మే నాటికి పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అప్పుడు రాజకీయ సందడి ప్రారంభమైనా.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ సందడి, హంగామా ఓ రేంజ్ కి చేరిపోయింది. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అసమ్మతిని వ్యక్తం చేయడంలోనూ తన వ్యతిరేకులలో అసహనాన్ని నింపి టెన్షన్ పెట్టడంలోనూ నిజంగానే సిద్దహస్తుడు.
ఆయన ఇప్పటికే రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వంలో కాబోయే సీఎంను తానేనని చెప్పుకుంటూ తనదైన స్టైల్ లో పార్టీ అభ్యర్థులను సైతం ప్రకటించేస్తున్నారు. ఇది ఆయన వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగు అనడంలో సందేహానికి తావు లేదు కానీ, ఆయన స్టైల్ , ఆయన తీరు పార్టీ హైకమాండ్ కు కొత్త తలనొప్పులు తీసుకు వస్తోంది. అదే సమయంలో రాష్ట్ర పార్టీలో ఆయన ప్రత్యర్థి సీఎం ఆశావహ అభ్యర్థి డీకే శివకుమార్ కు అరికాళ్ల కింద భూమిని కదిలిపోతున్న భావన కలిగిస్తోంది. అభ్యర్థుల ఎంపిక లో పార్టీ అనుసరించే సంప్రదాయాలకు సిద్దరామయ్య పూర్తిగా తిలోదకాలిచ్చేసి.. అటు హైకమాండ్ తో కానీ, ఇటు రాష్్ట పార్టీతో ఏమాత్రం సంప్రదింపులు జరపకుండానే వరుసగా అభ్యర్థులను ప్రకటించేస్తూ తన వర్గంలో జోష్ నింపుతూ, పార్టీలోని ప్రత్యర్థి వర్గాన్ని టెన్షన్ పెడుతున్నారు.
ఆ జోష్ లోనే తాజాగా బాగల్కోట నియోజకవర్గానికి విజయానంద్ అభ్యర్థిత్వాన్ని సిద్ధు కన్ఫర్మ్ చేసేసి ప్రకటించేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే విజయానంద్ నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. తన బయోగ్రఫీని బయోపిక్ గా ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసి ప్రచారంలో దూసుకుపోయేలా సన్నాహాలు చేసుకుంటున్నారు.
మరో వైపు సిద్దరామయ్య స్పీడ్ ను ఆపడమెలాగో తెలియక డీకే సతమతమౌతున్నారు. పైగా కర్నాటక రాష్ట్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వంత రాష్ట్రం. అయినా కూడా అక్కడ పార్టీలో విభేదాలను పరిష్కరించడంలో ఆయన కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. పరిస్థితి చూస్తుంటే వచ్చే ఎన్నికలలో విజయానికి అన్ని అవకాశాలూ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అంతర్గత కలహాలు, కుమ్ములాటలతో చేజేతులా ఆ అవకాశాన్ని చేజార్చుకుంటుందా అన్న ఆందోళన కలుగుతోందని రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు.