అమరావతికి ఇలా కూడా జగన్ ఎసరు!?
posted on Sep 3, 2022 @ 11:23AM
‘భార్య అంటే ఇష్టం లేని మొగుడు పడకగది అంతా పాడుచేశాడు’ అన్నట్టు ఉంది జగన్ అండ్ కో తీరు చూస్తుంటే.. మూడున్నరేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి సర్కార్ అమరావతిని రాజధానిగా కొనసాగించే ఇష్టం లేక మూడు రాజధానుల గోలను తెర మీదకు తెచ్చింది. దీంతో 33 వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం అంద జేసిన ఆ ప్రాంత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, కౌలు రైతులు, దళిత రైతులు, మహిళలు వివిధ రూపాలలో ఉద్యమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నారు.
చివరికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వైసీపీ సర్కార్ కు కోర్టు మొట్టికాయలు వేసింది. రాజధాని అమరావతి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని గడువు కూడా విధించింది. కోర్టు మొట్టికాయలతో విధిలేని పరిస్థితిలో మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్న జగన్ రెడ్డి.. ఆ చట్టాన్ని మరింత పకడ్బందీగా తీసుకొస్తామంటూ అసెంబ్లీలోనే తన వాచాలత ప్రదర్శించారు. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టే దిశగా కసరత్తు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మంత్రి అమర్నాథ్ రెడ్డి అయితే వచ్చే ఎన్నికలలోగానే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించేశారు. ఈ నేపథ్యంలోనే అమరావతిలో కోర్టు తీర్పును ప్రభుత్వం ఉల్లంఘిస్తోందంటూ వచ్చిన ఫిర్యాదుపై హైకోర్టు స్పందించింది. అమరావతి రైతులకు అభివృద్ధి చేసి ప్లాట్ల పంపిణీ విషయం ఎంతవరకు వచ్చిందని జగన్ ప్రభుత్వాన్ని హైకోర్టు తాజాగా నిలదీశింది. ఒక పక్కన అమరావతి రాజధాని రైతుల ఉద్యమం నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ.. మరో పక్కన కోర్టు కూడా ఆరా తీస్తున్నప్పటికీ విధ్వంస ప్రక్రియ యథేచ్ఛగా కొనసాగుతుండడం పట్ల ఆ ప్రాంత ప్రజలు, రైతుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రాజధాని శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన రహదారిని తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన రైతు గోవిందరెడ్డి గత నెల 31న తవ్వేశారు. శంకుస్థాపన ప్రాంతానికి ఆ రహదారి కోసం వేసిన కంకర చిప్స్ ను రెండున్నర అడుగుల లోతులో 30 మీటర్ల పొడవున గోవిందరెడ్డి తవ్వేసి, ట్రాక్టర్ల ద్వారా తరలించుకుపోవడం సంచలనంగా మారింది. రాజధాని ప్రాంత రహదారిని గోవిందరెడ్డి తవ్వేయడంపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇతర ప్రాంతాల నుంచి అనుసంధానించే రహదారుల్లో అది కూడా ఒకటి కావడం విశేషం. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంకు ఈ రోడ్డు పశ్చిమ వైపున ఉంది. దీని నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించింది.
గోవిందరెడ్డి తవ్వేసిన రహదారి ప్రాంతాన్ని రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ప్రశాంతి తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఆ తర్వాత రైతు గోవిందరెడ్డి నుంచి వివరణ తీసుకున్నారు. గోవిందరెడ్డి చెప్పిన సమాధానంతో ఆశ్చర్యపోవడం ఆర్ ఐ ప్రశాంతి వంతు అయింది. ఆ రహదారి ఉన్న పొలాన్ని తాను కొనుగోలు చేశానని, తన పొలాన్ని తాను చదును చేసుకోడానికే రహదారిని తవ్వేశానని గోవిందరెడ్డి చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. అంతే కాకుండా రహదారిని తవ్వేసి తరలించుకెళ్లిన కంకర చిప్స్ ను తమ గ్రామంలో ప్రజోపయోగానికి వాడినట్లు కూడా చెప్పడం విశేషం. గోవిందరెడ్డి ఇచ్చిన వివరణతో తయారు చేసిన నివేదికను తాసిల్దారుకు ఆర్ ఐ ప్రశాంతి అందజేయడం గమనార్హం. ఆ నివేదిక ఆధారంగా పోలీస్ స్టేషన్ లో గోవిందరెడ్డిపై తాసిల్దారు ఫిర్యాదు చేశారు.
రాజధాని రహదారిని తవ్వేసిన ప్రాంతంలో ఐకాస నేతలు నిరసనకు దిగారు. అమరావతిని నాశనం చేయాలనే దురుద్దేశంతోనే జగన్ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని వారు దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణం నిలిచిపోవడం వల్లే తరచు ఇలాంటి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటున్నారు. వైసీపీ నేతలే ఈ అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారంటూ రాజధాని ఐకాస నేతలు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి చేయడం చేతకాకపోతే ఊరుకోవాలి కానీ ఇలా రాజధాని కోసం వేసిన రోడ్లను తవ్వేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
అమరావతినే రాజధానిగా కొనసాగించడం సుతరామూ ఇష్టం లేని జగన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి దుశ్చర్యలను ప్రోత్సహిస్తున్నారని, అమరావతి నిర్మాణాన్ని ఎలాగైనా కొండెక్కించాలనే కుట్రతోనే ఇలాంటి చర్యలకు దింపుతున్నారనే ఆరోపణలు సర్వత్రా వస్తున్నాయి.