పెయిడ్ న్యూస్ పై ప్రత్యేక నిఘా
posted on Oct 13, 2023 @ 3:21PM
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచీ ఎన్నికల అధికారులు ఎన్నికలలో అక్రమాలు జరగకుండా తీసుకోవలసిన చర్యలపై దృష్టి పెట్టారు. నిబంధనల మేరకు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ, ప్రతి ఓటరూ నిర్భయంగా, స్వేచ్ఛగా తన ఓటు హక్కు వినియోగించుకునేందుకునేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఇందు కోసం ఇప్పటికే వివిధ రకాల కమిటీలను నియమించారు. అందులో భాగంగానే.. వార్త ప్రతికలు, టీవీ చానెళ్లలో ప్రసారమయ్యే వార్తలు, ప్రకటనలపై గట్టి నిఘా కోసం ఒక స్పెషల్ వింగ్‌ను కూడా ఏర్పాటు చేసింది. అడ్వర్‌టైజ్ మెంట్లు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, ఆడియో, వీడియో డిస్‌ప్లే, సినిమా థియేటర్లు. రేడియో ఛానల్‌లో బల్క్ ఎస్ఎంఎస్‌లు సెబ్‌సైట్‌లో ప్రసారమయ్యే ప్రతి వార్త, ప్రకటనను రికార్డ్ చేస్తారు. ఆడియో, వీడియో అడ్వర్‌టైజ్‌మెంట్లతో పాటు గోడమీద రాతలు, పోస్టర్లు, వాహనాల ద్వారా ప్రచారం సహా అన్నిటికీ ఎన్నికల సంఘం సంబంధిత అధికారి నుంచి అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే పెయిడ్ న్యూస్ గుర్తింపునకు ప్రత్యేకంగా మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)ని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీకి జిల్లా ఎన్నికల అధికారి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇన్‌ఫర్మేషన్ బ్యూరో, డిప్యూటి డైరెక్టర్, సీనియర్ జర్నలిస్టు, జీహెచ్ఎంసీ సీపీఆర్ఓతో పాటు హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఎన్నికల సందర్భంగా మీడియా అతిక్రమణలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు.
ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమయ్యే అన్నిరకాల రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పని సరి ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుంచి పెయిడ్ న్యూస్, ప్రకటనలకు సంబంధించి వ్యయాన్ని అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపనున్నట్టు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.