ప్రత్యేక హోదా వన్స్ మోర్.. అదే ప్రశ్న ..అదే జవాబు
posted on Dec 14, 2022 8:03AM
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఎలా జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పడు ఆ లోతుల్లోకి పోవలసిన అవసరం లేదు. అయితే, రాష్ట్ర విభజన న్యాయంగా జరిగిందో అన్యాయంగా జరిగిందో ఇప్పుడు చర్చించి ప్రయోజనం లేదు. అయితే, కనీసం రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల కోసం అయినా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆంద్ర ప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు పార్లమెంట్ లోపల వెలుపల ఎందుకు గళం విప్పలేక పోతున్నారు.
ముఖ్యంగా అధికార వైసేపీ సభ్యులు పార్లమెంట్ ఉభయ సభల్లో హోదా, పోలవరం ప్రస్తవన వచ్చిన ప్రతి సంధర్భలో ఎందుకు మౌనంగా ఉండి పోతున్నారు. ఎందుకు వారు గళం ఎత్తుతారని ఆశించడం కూడా అత్యాశగా అనిపిస్తోంది? అంటే, వైసేపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ ఎంపీలు కేంద్రానికి అంతగా దాసోహం అంటున్నారు కాబట్టే అనే సమాధానమే వస్తోంది. ఆ మాటలు అంటోంది ఎవరో కాదు, అధికార పార్టీ నాయకులూ, క్యాడర్ నోటి నుంచే ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర విభజన చట్టంలో అవశేష ఆంధ్ర ప్రదేశ్ కు ప్రామిస్ చేసిన ప్రత్యేక హోదాకు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడేసింది. అదొక ముగిసిన అధ్యాయం అంటూ పక్కన పెట్టేసింది. ఎన్ని సార్లు అడిగినా అదే సమాధానం. అవే మోసపు మాటలు. తాజాగా మంగళవారం (డిసెంబర్ 13) రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతిపాదన వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. అటు లోక్ సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా విభజన అంశాలపై ప్రశ్నించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం మళ్ళీ అదే పాత పాటనే మరోమారు వినిపించింది. 14, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు నిధులు అందిస్తున్నామని వెల్లడించింది. 14వ ఆర్థిక సంఘం కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీలో ఎలాంటి వ్యత్యాసం చూపడంలేదని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నామని పేర్కొంది. తద్వారా ప్రత్యేక హోదా అంశం తమ దృష్టిలో లేదని స్పష్టం చేసింది. అలాగే 14వ ఆర్థిక సిఫారసులను పరిగణనలోకి తీసుకుని కేంద్రం రాష్ట్రాలకు పన్నుల వాటాను కేంద్రం 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కి రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది. నిజమే అయితే, మన బంగారం మంచిదైతే కదా, వేరొకరిని వేలెత్తి చూపేందుకు.. నిజానికి 2019 ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ లోక్ సభ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాక ముందే చేతులు ఎత్తేశారు. కేంద్రలో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది కాబట్టి ఇక, ప్రత్యేక హోదా మోడీ దయ మన ప్రాప్తం అంటూ జగన్ రెడ్డి చేతులు ఎత్తేశారు.
నిజమే కావచ్చును కానీ, రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పడు సంఖ్యాబలంతో పని లేకుండా పార్లమెంట్ లోపల, వెలుపల, న్యాయస్థానాల ద్వారా.. కేంద్రం మెడలు వంచేందుకు ఉన్న ఇతర మార్గాలను ఎందుకు ఉపయోగించు కోలేదు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా ఎన్ని సార్లు ప్రధానిని కలిసినా ఎంత సేపు కాళ్ళకేసి చూడడమే తప్ప గొంతెత్తి అడిగిందేదని అధికార పార్టీ క్యాడర్, ముఖ్యంగా ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూసిన యువత జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. పార్లమెంట్ లో తెలుగు దేశం సభ్యులు పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు వైసీపీ సభ్యులు మౌనంగా ఉండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్న ఎవరు అడిగారన్నది కాదు... రాష్ర ప్రయోజనాల విషయంలో అయినా వైసేపీ రాజకీయాలకు అతీతంగా ఎందుకు కేంద్రాన్ని నిలదీయ లేక పోతోంది, అనేదే అసలు ప్రశ్న అంటున్నారు.