ఆరేళ్లుగా ఆఫీసుకి రాలేదు- అయినా ఎవరూ పట్టించుకోలేదు!
posted on Feb 15, 2016 @ 3:20PM
ఉద్యోగానికి రాకుండా నెలనెలా జీతం తీసుకునే వార్తలు మన దేశంలో కొత్తేమీ కాదు. కానీ ఇలాంటి సంఘటనలు మన దేశంలోనే జరుగుతాయని బాధపడే పౌరులకు ఒక సంతోషకరమైన వార్త ఇది. స్పెయిన్‌లోని కాడిజ్ అనే నగరపురపాలక విభాగంలో పనిచేసే జాక్విన్ ఆరు సంవత్సరాలుగా పనికే వెళ్లకుండా జీతం తీసుకున్నాడట. 2004లో ఉన్నతాధికారులు సదరు జాక్విన్‌ను నీటిని శుద్ధి చేసే ఒక ప్లాంట్‌కి వెళ్లి విధులను నిర్వర్తించమని చెప్పారట. అయితే అక్కడ తను చేయాల్సిన పనేమీ పెద్దగా లేదని జాక్విన్‌కి తోచడంతో నేరుగా ఇంటికి వెళ్లి గుర్రుపెట్టాడు. ఆ మర్నాడు నుంచి అసలు ప్లాంట్ మొహమే చూడలేదు! జాక్విన్ తిరిగి నగరపాలక విభాగంలోకి వెళ్లిపోయాడని ప్లాంట్ అధికారులూ.... ప్లాంట్‌లో బుద్ధిగా పనిచేసుకుంటున్నాడని నగరపాలక అధికారులూ ఏళ్లతరబడి భావించారు. చివరికి 2010లో జాక్విన్‌కు 60 ఏళ్లు నిండటంతో అతణ్ని ప్రభుత్వం తరఫున సుదీర్ఘకాలం పనిచేసినందుకు సన్మానం చేయాలనుకున్నారు. కానీ తీరా అందుకోసం పతకాన్ని తీసుకువచ్చి జాక్విన్ కోసం వెతికితే ఏముంది... విషయం కాస్తా బయటపడింది. జాక్విన్ చేసిన తప్పుకి మొన్న శుక్రవారం స్థానిక కోర్టు దాదాపు 30 వేల డాలర్ల జరిమానాని విధించింది. చిత్రమేమిటంటే ఇన్నాళ్లూ పనికి వెళ్లనందుకు జాక్విన్ చింతించలేదు సరికదా ‘అక్కడ నాకు పని లేనప్పుడు వెళ్లి మాత్రం ఏంటి ఉపయోగం?’ అంటూ ఎదురు తిరిగాడు. పైగా ‘పనికి నేను రోజూ వస్తున్నానో లేదో నాపై అధికారి గమనించుకోనవసరం లేదా!’ అని చిరాకుపడిపోయాడు.