కష్టాలంటే సోనియాకు రాహుల్ కు తెలుసా?
posted on Aug 8, 2015 @ 1:13PM
లలిత్ మోదీ వ్యవహారంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రాజేలు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుష్మా స్వరాజ్ తను కేవలం మానవత్వంతో లలిత్ మోదీ భార్య క్యాన్సర్ తో బాధ పడుతున్న నేపథ్యంలో ఆమెకు సహాయం చేశానని.. అంతే కాని వేరే ఉద్దేశం లేదని.. అది కూడా మోడీకి వీసా ఇవ్వగలిగితేనే ఇవ్వమని బ్రిటన్ ప్రభుత్వానికి సూచించానని సమాధానమిచ్చారు. అదే నా స్థానంలో సోనియాగాంధీ ఉన్నా అలా చేసేవారు కాదా? అని ప్రశ్నించారు. అయితే దీనికి సోనియాగాంధీ.. సుష్మా మాటల గారడిలో దిట్ట అని.. బాగా నటించారని.. అదే తన స్థానంలో ఉంటే డబ్బు సాయం చేసేదాన్ని అంతే కాని చట్ట విరుద్దమైన పనులు చేసే దాన్ని కాదని సమాధానమిచ్చారు.
మరోవైపు దీనిపై అమ్మకూచి రాహుల్ గాంధీ కూడా స్పందించి తన తల్లి ఎన్నడూ అటువంటి తప్పు చేయదని అన్నారు. ఇదిలాఉండగా సుష్మాస్వరాజ్ పై చేసిన వ్యాఖ్యలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తప్పుబట్టారు. సుష్మాస్వరాజ్ చాలా సాధారణమైన కుటుంబం నుండి ఎన్నో కష్టాలు పడి.. ఎండకు ఎండి వానకు తడిసి ఇప్పుడు ఇలాంటి ఉన్నతస్థానంలో ఉన్నారని.. అలాంటి సుష్మా పై ఇలాంటి వ్యాఖ్యలు తగవని అన్నారు. సోనియా గాంధీ కాని రాహుల్ గాంధీలు ఉన్నత కుటుంబాల నుండి వచ్చారు కాబట్టి వాళ్లకు కష్టాలంటే ఏంటో తెలియదని.. ఎండ అంటే ఎంటో వాళ్లకు తెలుసా అని మండిపడ్డారు. ఏదో రాజకీయ వారసత్వం వల్ల ఎలాంటి కష్టాలు పడకుండానే వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్న సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీకి సుష్మాపై ఆరోపణలు చేయడానికి తగరని ఆరోపించారు.