మేడిపండులా మారిన ఓరుగల్లు నగరం...
posted on Oct 16, 2019 @ 5:19PM
ఓరుగల్లు నగరాన్ని దేశానికే రోల్ మోడల్ గా చేస్తామన్న రాజకీయ నాయకుల హామీలు మాటలకే పరిమితమయ్యాయా, స్మార్ట్ సిటీ అని గొప్పలు చెప్పుకుంటున్న వరంగల్ నగర పరిస్థితి మేడిపండులా ఉందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఈ కాలనీలు చూస్తే స్మార్ట్ సిటీ ఎంత స్మార్ట్ గా ఉందో అర్ధమైపోతోంది. వరంగల్ నగరంలో ఇలాంటి కాలనీలు ఎన్నో ఉన్నాయి. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో మొత్తం నూట ఎనభై మూడు మురికివాడలు ఉన్నాయి. వీటిలో శివారు ప్రాంతాల్లో ఉన్న బస్తీల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. గుంతలమయమైన దారులు, రహదారికి రెండు వైపులా పారుతున్న మురుగు నీరు, మురికి కూపాలను తలపించే రోడ్లు, దోమలు ముసురుతూ, డంపింగ్ యార్డు లాంటి పరిసరాలు ఇది అక్కడి వారి దుస్థితి.
ఆ రోడ్డు వరకు వెళ్లాల్సిన అవసరం లేదు దూరం నుంచి చూసినా చాలు వెంటనే ముక్కును మూసుకుంటాం. ఇది వరంగల్ నగరానికి ఏ మారుమూలనో ఉంటే సరే, కాని నగరం నడిబొడ్డున ఉన్న కాలనీ ఇది. ఒకటో రెండో మురికివాడలు కాదు, వరంగల్ కార్పొరేషన్ పరిధిలో నూట ఎనభై మూడు మురికివాడల్లో ఇదే పరిస్థితి. కనీసం నెలకు ఒక్కసారైనా ఫాగింగ్ చేయడం లేదు. అందుకే దోమలు మురికివాడలను ఆవాసాలుగా చేసుకొని జనాలు రోగాల బారిన పడేలా చేస్తున్నాయి. అధికారులు పొరపాటును కూడా అటు కన్నెత్తి చూడటం లేదు. వరంగల్ నగరాన్ని దేశానికే రోల్ మోడల్ గా చేరడమేమోగానీ మొదట కనీస వసతులు కల్పించాలని స్థానికులు వేడుకుంటున్నారు. మరి అధికారుల్లో ఎప్పటికి చలనం వస్తుందో చూడాలి.