Read more!

చిన్న చిరునవ్వు చాలు మనిషి జీవితాన్ని పాజిటివ్ గా మార్చడానికి..

‘ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు. ఒక చిన్న నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు’ అన్నాడు ఓ సినీగేయ రచయిత. ‘‘చిరునవ్వుతో శాంతి మొదలవుతుంది’’ అని చాలా గొప్ప మాట చెప్పారు మదర్ థెరిసా. నవ్వుకు ఉన్న శక్తి అలాంటిది మరి. చిన్న చిరునవ్వు స్నేహ బంధాలకు అంకురార్పణ చేస్తుంది. దూరమైనవారు దగ్గరవుతారు. నవ్వితే నవరత్నాలు అనే మాట ఏమో కానీ హాయిగా నవ్వితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మనసారా నవ్వడం మనిషికి నూతనోత్తేజాన్ని ఇవ్వడమే కాదు రోజంతా ఆహ్లాదకరంగా ఉండేందుకు బాటలు వేస్తుంది. చుట్టుపక్కల ఉన్నవారిలో కూడా పాజిటివ్ శక్తిని నింపే శక్తి నవ్వుకుంది. నవ్వడం మొదలెడితే ఆందోళనలు ఆమడ దూరం పారిపోతాయి. అంతెందుకు ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చే సులభమైన ఆయుధమే నవ్వు. అసలు నవ్వు గురించి ఇంతలా ఇప్పుడెందుకు చర్చించాల్సి వచ్చిందో  తెలుసా?  ఎందుకంటే నేడు (శుక్రవారం) ప్రపంచ నవ్వు దినోత్సవం ( World smile day). ప్రతి వ్యక్తి ఆనంద క్షణాల్లో తనతోపాటే ఉండే నవ్వు గురించి,  అక్టోబర్ 6నే ప్రపంచ నవ్వు దినోత్సవంగా ఎందుకు నిర్వహించుకుంటారు? అనే అంశాలను గురించి ఎంతమందికి తెలుసు??  ఆనందాన్ని, దయను వ్యాపింపజేసే సామర్థ్యమున్న నవ్వు గురించి, ప్రపంచమంతా జరుపుకునే నవ్వు దినోత్సవం గురించి  వివరాలు తెలుసుకుంటే..

అసలు ఎలా మొదలైందంటే..

నవ్వు దినోత్సవం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది.  మసాచుసెట్స్‌లోని వొర్సెస్టర్‌కు చెందిన హార్వే బాల్ అనే కమర్షియల్ ఆర్టిస్ట్ 1963లో స్మైలీ ఫేస్ సింబల్‌ని రూపొందించారు. నవ్వుతూనే దీనిని తయారు చేయడం విశేషం. ప్రజలు ఎల్లప్పుడూ నవ్వుతూ దయ, సంతోషాన్ని మరింత వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో 1999లో ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని నిర్వహించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అక్టోబర్ నెలలో మొదటి శుక్రవారాన్ని నవ్వు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.  వ్యక్తుల నేపథ్యంతో సంబంధం లేకుండా ఇతరులకు చిరునవ్వు పంచాలనే ఉద్దేశ్యంతో దీనిని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు చోట్ల వేర్వేరు విధాలుగా దీనిని నిర్వహిస్తారు.

ప్రాముఖ్యత ఇదే..

ప్రపంచ చిరునవ్వు  దినోత్సవం నిర్వహించుకోవడానికి ఆ నవ్వులో దాగివున్న శక్తే కారణం. చుట్టుపక్కలవారిని చూసి నవ్వడం, నవ్వించడం, దయాగుణంతో కూడిన  చర్యలు. స్నేహపూర్వక, సహకార,  సానుకూలతను ప్రోత్సహించవచ్చు. అంతేకాదు ఎవరి రోజునైనా నవ్వు ప్రకాశవంతం చేయడానికి తోడ్పడుతుందని గమనించాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరచడానికి సాధారణ చిరునవ్వు ఎంతోకొంత శక్తినిస్తుందని గమనించాలి. అందుకే ప్రపంచ చిరునవ్వు దినోత్సవాన మీకు తెలిసినవారిని నవ్వించండి. నవ్వమని చెప్పండి. ఎవరి మీద అయినా కోపాలు, అలకలు ఉంటే వారి ముందు మనస్పూర్తిగా నవ్వి చూడండి. నిజంగా మనుషుల మధ్య అపార్థాలు, అపోహలు, గొడవలు అన్ని మంత్రమేసినట్టు మాయమైపోతాయి. 

పసిపిల్లల నవ్వును కల్మషం లేనిది అంటారు. మనసులో ఏమీ పెట్టుకోకుండా నవ్వడం పిల్లలలో ఉన్న గొప్ప గుణం. ప్రతి మనిషి ఇలా నవ్వగలిగితే ఆ వ్యక్తి ఉన్నతవ్యక్తిత్వం కలిగిన వాడిగా రూపాంతరం చెందుతాడు.  స్నేహితులను, కుటుంబ సభ్యులను హాయిగా  నవ్వించే ప్రయత్నం కుటుంబాన్ని, బంధాలను దృఢంగా మారుస్తుంది. కేవలం కుటుంబంతో ఆగిపోకుండా సామాజిక మాధ్యమాల ద్వారా  నలుగురిని నవ్వించే ప్రయత్నం చేయవచ్చు. లాఫింగ్ క్లబ్బులు తరహాలో సన్నిహితులు, మిత్రులు అందరూ కలసి సరదాగా నవ్వు దినోత్సవానికి కితకితలు పెట్టొచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. నవ్వు ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉండాలి. ఇతరులను నొప్పించే పద్దతిలో నవ్వు సృష్టించడం వల్ల పెద్ద అనర్థాలే జరుగుతాయి. కాబట్టి ఆరోగ్యంగా నవ్వాలి, ఆరోగ్యంగా నవ్వించాలి. ఓ కవి  చెప్పినట్టు "నవ్వడం  భోగం, నవ్వించడం యోగం, నవ్వలేకపోవడం రోగం". గుర్తుపెట్టుకోండి మరీ..


                                              *నిశ్శబ్ద.