ఎడమవైపు పడుకుంటే ఎన్ని లాభాలో!

 

మనం తల ఎటువైపు పెట్టి పడుకుంటే మంచిదో ఆలోచిస్తాం. కానీ ఎటువైపు తిరిగి పడుకోవాలో పట్టించుకోము. కుడివైపు అయినా, ఎడమవైపు అయినా పెద్దగా తేడా ఉండదన్నది మన నమ్మకం. నిజానికి ఎడమవైపు తిరిగి పడుకుంటే చాలా లాభాలే ఉన్నాయంటున్నారు వైద్యులు.

Digestion బాగుంటుంది:-

మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసుకునే పాంక్రియాస్‌ ఎడమచేతి వైపే ఉంటాయి. కాబట్టి అటువైపు తిరిగి పడుకోవడం వల్ల, ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణం కాని ఆహారం పెద్ద పేగుల్లోకి త్వరగా చేరిపోతుంది. దాని వల్ల ఎసిడిటీ, కాన్‌స్టిపేషన్‌లాంటి సమస్యలు రావు. అందుకే ఎప్పుడన్నా భుక్తాయాసంగా ఉన్నప్పుడు, ఎడమవైపు తిరిగి కాసేపు పడుకోమని పెద్దలు చెబుతూ ఉంటారు.

గర్భవతులకి మంచిది:-

గర్భవతులు, ముఖ్యంగా నెలలు నిండినవారు ఎడమవైపు తిరిగి పడుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. దీని వల్ల వెన్నెముక మీద భారం తగ్గుతుంది. పైగా కడుపులోని బిడ్డకు రక్తప్రసారం కూడా మెరుగవుతుంది. కడుపులో ఉన్న బిడ్డ లివర్‌కు నొక్కుకుపోవడం వల్ల, లివర్‌ పనితీరు దెబ్బతినవచ్చు. ఎడమవైపు పడుకోవడం వల్ల ఈ సమస్య కూడా దరిచేరదు.

గుండె బాగుంటుంది:-

ఎడమవైపు అనగానే మనకి గుర్తుకి వచ్చే భాగం గుండెకాయే! ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గుండె తన సహజమైన స్థితిలో పనిచేసే అవకాశం ఉంటుంది. అలా పడుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి, అందులో ఆక్సిజన్ నిల్వలు కూడా పెరుగుతాయట.

అంతేకాదు...

* వెన్ను సమస్యలు ఉన్నవారిలో కుడివైపు కంటే ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్లే ఎక్కువ ఉపశమనం ఉంటుందని తేలింది.

* కడుపులో ఉన్న యాసిడ్స్ గొంతులోకి రావడం వల్ల రాత్రిళ్లు గుండె మంట వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల, కడుపులో రసాయనాలు పైకి వచ్చే అవకాశమే ఉండదంటున్నారు.

* మన శరీరంలోని పనికిమాలిన పదార్థాలను బయటకు పంపేందుకు లింఫ్‌ గ్రంధులు చాలా ఉపయోగపడతాయి. ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు ఈ లింఫ్‌ గ్రంధులు మరింత ప్రభావంగా పనిచేస్తాయట.

* ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య గురక. మనం పడుకున్నప్పుడు, గొంతులో ఉండే కొండనాలుక వైబ్రేట్‌ అవ్వడం వల్ల గురక ఏర్పడుతుంది. అయితే ఎడమవైపు తిరిగి పడుకుంటే కొండనాలుక సరైన పొజీషన్‌లోనే ఉండి, గురక రాదని చెబుతున్నారు.

చూశారుగా! ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి, నిద్రపోయేటప్పుడు కాస్త ఎడమవైపుకి తిరిగి పడుకుని చూడండి...

- నిర్జర.