గంటల తరబడి కుర్చీలో కూర్చుని పనిచేస్తుంటారా? ఈ నిజాలు తెలుసా?
posted on Oct 4, 2024 @ 9:30AM
సిట్టింగ్ వర్క్ ఈ కాలంలో చాలా సాధారణం. ప్రతి ఒక్క చోట ప్రతి పనికి కంప్యూటర్లు ఉపయోగిస్తున్న కారణంగా అధిక శాతం మంది సిట్టింగ్ వర్క్ మోడ్ లోనే ఉంటారు. కేవలం కార్పోరేట్ ఆఫీసులు, సంస్థలలోనే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, ఆఫీసులలో కూడా ఇదే విధానమే ఎక్కువగా ఉంటోంది. అయితే ఇలా సిట్టింగ్ పొజిషన్లో గంటల తరబడి పనిచేయడం వల్ల ఏం జరుగుతుందో ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువ సేపు కుర్చీలో కూర్చుని పని చేయడం అంటే అనారోగ్యాలకు వెల్కమ్ చెబుతున్నట్టేనట. ఇది శరీరం పై ఏ విధమైన ప్రభావం చూపిస్తుందో తెలుసుకుంటే..
మెడ నొప్పి..
ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వల్ల వెన్ను నొప్పి, మెడ నొప్పి వస్తుంది. ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తే వెన్ను పాముపై ఒత్తిడి పడుతుంది. ఇది కాస్తా వెన్నునొప్పికి, మెడ నొప్పికి దారితీస్తుంది.
భుజాలు..
చాలామంది భుజాలు బిగుసుకుపోయినట్టు ఉన్నాయని ఫిర్యాదు చేస్తుంటారు. సిట్టింగ్ వర్క్ ఎక్కువ చేసే వారి నుండే ఈ ఫిర్యాదు ఎక్కువ ఉండటం కూడా గమనించవచ్చు. మొదట్లో భుజాలు బిగుసుకుపోవడం అనేది కాస్త ఇబ్బందిగా అనిపించినా సిట్టింగ్ వర్క్ బాగా అలవాటు అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని అనుకుంటారు. కానీ ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇది శాశ్వత సమస్యగా మారుతుంది.
ఊబకాయం..
ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వల్ల మనిషి శరీరంలో కేలరీలు పేరుకుపోతాయి. ముఖ్యంగా ఆఫీసు సమయాలలో ఆహారం తీసుకున్న తరువాత వెంటనే కూర్చుని పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారిలో కేలరీలు ఎక్కువగా పేరుకుపోయి బరువు పెరగడానికి దారి తీస్తుంది. ఇది కాస్తా కాలక్రమంలో ఊబకాయానికి కారణమవుతుంది.
టెన్షన్..
ఎక్కువసేపు సిట్టింగ్ వర్క్ చేసేవారిలో మానసిక ఒత్తిడి సమస్య వస్తుంది. ఇది క్రమంగా టెన్షన్ కు దారితీస్తుంది. ఈ కారణం వల్లనే సిట్టింగ్ వర్క్ చేసే చాలామందిలో టెన్షన్ ఎక్కువగా ఉండటం గమనిస్తుంటాం.
పరిష్కారాలు..
సిట్టింగ్ వర్క్ ఎక్కువగా చేసేవారు తమ ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉండకూడదు అంటే పని చేస్తున్నప్పుడు విరామాలు తీసుకోవాలి. చిన్న చిన్న విరామాలు తీసుకోవడం వల్ల పని నుండి రిలాక్స్ అవ్వడమే కాకుండా శరీర కదలికలకు కూడా అవకాశం ఉంటుంది. చిన్న విరామం సమయంలో ఆఫీసు లేదా ఇంట్లో అయినా కనీసం ఒక వంద అడుగులు అయినా నడుస్తుండాలి. బాత్రూమ్ కు వెళ్లి రావడం, మంచి నీరు తెచ్చుకుని తాగడం, ఏదైనా సందేహం కారణంతో దూరంగా ఉన్న కొలీగ్ దగ్గరకు వెళ్ళి రావడం వంటివి చేయవచ్చు.
సిట్టింగ్ పొజిషన్లో ఎక్కువ సేపు వర్క్ చేసేవారు తాము కుర్చునే కుర్చీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సుమారు 7 నుండి 8 గంటల సేపు కూర్చుని వర్క్ చేస్తుంటారు కాబట్టి మంచి కుర్చీని ఎంపిక చేసుకోవాలి. నడుము, వీపు, భుజాలు, మెడ మొదలైన వాటికి సపోర్ట్ ఉండేలా ఉన్న కుర్చీ ఎంచుకుంటే చాలా వరకు శరీర సమస్యలను అధిగమించవచ్చు.
*రూపశ్రీ.