ఎంఐఎం కంచుకోటకి బీటలు.. నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ లీడ్!
posted on Dec 3, 2023 @ 9:43AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తే చాలు.. 119 సీట్లకు గాను అందులో ఎంఐఎం 7 సీట్లు గెలవడం ఖాయమని, మిగతా సీట్ల కోసం ఇతర పార్టీలు పోటీపడాలి అన్నట్టుగా పరిస్థితి ఉండేది. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ముఖ్యంగా ఆ పార్టీ కంచుకోటలో ఒకటైన నాంపల్లిలో ఓటమి ఎదురయ్యేలా ఉంది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ చేతిలో ఎంఐఎం ఓడిపోయే అవకాశముందని విశ్లేషకులు ముందే అభిప్రాయపడ్డారు. ఓట్ల లెక్కింపు మొదలయ్యాక ట్రెండ్ ని గమనిస్తే అది నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ హుస్సేన్ పై కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఆధిక్యంలో ఉన్నారు.
నాంపల్లిలో ఎంఐఎంని ఓడించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఫిరోజ్ ఖాన్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. 2009 లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన ఆయన ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014 లో తెలుగుదేశం తరపున పోటీ చేసి మరోసారి ఓటమిని చూశారు. 2018లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మూడోసారి కూడా ఓటమి తప్పలేదు. అయితే ఈ 2023 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ జయకేతనం ఎగుర వేసేలా ఉన్నారు.