భూమా అఖిలప్రియ సోదరుడుకి షాకిచ్చిన కోర్టు
posted on Jan 30, 2021 @ 3:05PM
హైదరాబాద్ బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డికి సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. జగత్ విఖ్యాత్ రెడ్డి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఇంకొంత మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని.. ఈ నేపథ్యంలో జగత్ విఖ్యాత్ రెడ్డికి బెయిల్ ఇస్తే ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసుల తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదలను విన్న కోర్టు.. ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు కొట్టేసింది. సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అక్కడా నిరాశే ఎదురైంది. ప్రస్తుతం భార్గవ్ రామ్ పరారీలో ఉన్నాడు.
కాగా, హఫీజ్ పేటలో ఉన్న భూమికి సంబంధించి వివాదంలో ప్రవీణ్ రావును, ఆయన సోదరులను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అఖిలప్రియను ఏ1గా, సుబ్బారెడ్డిని ఏ2గా, భార్గవ్ రామ్ ను ఏ3గా పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్టైన అఖిలప్రియ ఇటీవలే షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు.