సునీతకు షర్మిల అండ
posted on Apr 28, 2023 7:29AM
ఆడదానికి ఆడదే శత్రువు అంటారు... కానీ వైఎస్ వివేకా కుమార్తె సునీత విషయంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధ్యక్షురాలు షర్మిల వ్యవహరిస్తున్న తీరుతో అది తప్పుని తేలిపోయింది. వివేకా హత్య జరిగిన నాటి నుంచి సునీతకు.. వైఎస్ ఫ్యామిలీలో ఎవరైన అండ దండగా నిలిచారంటే.. అది ఒక్క షర్మిల మాత్రమే. తాజాగా మరోసారి సునీతకు మద్దతుగా నిలుస్తూ వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు.. పోలిటికల్ సర్కిల్లో కాక రేపుతోన్నాయి. ఇటీవల వైయస్ వివేకా ఇమేజ్ను డ్యామేజ్ చేస్తూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రిభాస్కరరెడ్డిలు చేసిన వ్యాఖ్యలపై వైయస్ షర్మిల తాజాగా హైదరాబాద్‌లో తనదైన శైలిలో స్పందించారు. వారి వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. అలాగే వివేకా హత్య వెనుక ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఉన్నారంటూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అర్థరహితమని ఆమె కొట్టిపారేశారు. వివేకా పేరిట ఎలాంటి ఆస్తుల్లేవని, అవన్నీ ఆయన కుమార్తె సునీత పేరు మీదే ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. అలాంటప్పుడు తమ సొంత చిన్నాన్న హత్య వెనుక సునీత, ఆమె భర్త ఉన్నారనే ఆరోపణలు చేయడం సరికాదని వైయస్ షర్మిల అభిప్రాయ పడ్డారు.
పోనీ.. ఓ వేళ సునీత భర్త ఆస్తి కోసం ఇదంతా చేశాడనుకుంటే... చంపాల్సింది వివేకానందరెడ్డిని కాదు.. సునీతను.. అంటు వైయస్ షర్మిల పక్కా క్లారిటీగా వివరించారు. అలాగే చిన్నాన్న వివేకా వ్యక్తిత్వంపై ఆరోపణలు చేయడం చాలా అన్యాయమన్నారు. ప్రజల కోసం పని చేసిన ఆయన వ్యక్తిగత జీవితంపై మాట్లాడే అర్హత ఎవరికీ లేదని చెప్పారు. ప్రజా నాయకుడైన ఆయన వ్యక్తిత్వం గురించి మాకంటే.. ఉమ్మడి కడప జిల్లా ప్రజలకు, అలాగే పులివెందుల ప్రజలకే ఎక్కువగా తెలుసునని షర్మిల స్పష్టం చేశారు. వివేకా హత్య కేసు విషయంలో షర్మిల ఇలా స్పందించడం ఇదే తొలిసారి కాదు.. గతంలో కూడా చాలా సార్లు ఇలాగే స్పందించారు. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. ఈ హత్య కేసులో ఢిల్లీ వెళ్లీ ఆమె స్వయంగా సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడమే కాదు... ఆ సీబీఐ కార్యాలయం వెలుపలే.. మీడియా ముందు మాట్లాడుతూ.. వివేకా హత్య కడప ఎంపీ సీటు విషయంలోనే జరిగిందంటూ ప్రకటించారని... ఆ తర్వాత.. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ తాబేలు స్పీడ్‌తో సాగుతోంటే.. లోటస్ పాండ్‌లోని తన పార్టీ కార్యాలయంలో.. ప్రెస్‌మీట్ పెట్టి.. ఏళ్లకు ఏళ్లు గడుస్తోన్నా.. తన సొంత చిన్నాన్న హత్య కేసులో ఇంత వరకు అతీగతీ లేదంటూ.. సదరు దర్యాప్తు సంస్థపై వైయస్ షర్మిల విమర్శలు సైతం గుప్పించారు. ఆ తర్వాతే ఈ హత్య కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసిందనే ఓ చర్చ సైతం రాజకీయ వర్గాలలో సాగుతోంది.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. వివేకా హత్య కేసును.. అటు దర్యాప్తు చేస్తున్న సీబీఐ మరిచిపోయినా.. ఇటు ప్రజలు మరిచిపోయినా.. షర్మిల మాత్రం రంగంలోకి దిగి.. ప్రెస్‌మీట్ పెట్టి.. ఆ అంశాన్ని తెరపైకి తీసుకు వస్తూ వచ్చారన్న అభిప్రాయం పోలిటికల్ సర్కిల్లో వ్యక్తమవుతోంది.
ఓ సోదరుడు జగన్ ముఖ్యమంత్రిగా... మరో సోదరుడు అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఉండి కూడా తనకు న్యాయం జరగడం లేదని గ్రహించి.. న్యాయం కోసం.. న్యాయస్థానం మెట్లెక్కిన సునీతకు అన్ని విధాల షర్మిల మద్దతుగా నిలిచారనడంలో సందేహం లేదు.
మరోవైపు సీమ పౌరుషానికి కడప పురిటిగడ్డ... ఫ్యాక్షనిజానికి కడప అడ్డా, మాట తప్పం.. మడం తిప్పమంటూ లాంటి డైలాగులు సినిమా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడానికో.. .. ఎన్నికల ప్రచారంలో ఓట్లు దండుకోవడానికో ఉపయోగపడతాయనే అభిప్రాయం సైతం సదరు సర్కిల్లో వినిపిస్తోంది.
ఇంటి ఆడపడుచు.. స్వయంగా గుమ్మంలోకి వచ్చి.. నాకు ఆస్తి కాదు.. అంతస్తు కాదు.. నాకు న్యాయం కావాలి... కన్న తండ్రి హత్య కేసులో దోషులు ఎవరో బయటకు రావాలి.. వారికి శిక్ష పడాలి... అలా అయితేనే.. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు మళ్లీ మళ్లీ జరగకుండా సమాజానికి ఓ స్పష్టమైన సందేశం ఇచ్చిన వారమవుతామంటూ ముఖ్యమంత్రి జగన్‌ని ప్రాధేయపడిన ఓ చెల్లికి.. ఆయన ఎంత న్యాయం చేశారో ఏమో కానీ.. ఓ సోదరిగా సునీతకు ఆమె చేస్తున్న న్యాయపోరాటంలో షర్మిల నూటికి నూరు శాతం మద్దతుగా నిలుస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తు ఇక్కడి దాకా వచ్చిందంటే.. అదంతా సునీత, షర్మిల వల్లే సాధ్యమైందనే ఓ చర్చ వైసీపీ శ్రేణుల్లోనే జరుగుతోంది.