కడప ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య: షర్మిల
posted on Oct 22, 2022 6:52AM
ఏపీ సీఎం జగన్ అరాచకాలను రాష్ట్ర ప్రజలే కాదు.. సోంత కుటుంబీకులు కూడా భరించ లేకపోతున్నారు. ఇప్పటికే సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అన్న సీఎంగా ఉన్న రాష్ట్రంలో తన తండి హత్య కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగదంటూ వేరే రాష్ట్రానికి మార్చాలని సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇక సొంత చెల్లి, తల్లి కూడా జగన్ పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకుని ఆయనకు దూరంగా పొరుగు రాష్ట్రం తెలంగాణలో గడుపుతున్న సంగతి విదితమే. అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని దూరంగా ఉంటున్న షర్మిల తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబంలో జరిగిన దారుణ ఘటన బాబాయ్ వివేకా హత్యేనని చెప్పారు. ఆయనను హత్య చేసిన వారెవరో తెలియాలనీ, వారికి శిక్ష పడాలనీ అన్నారు. కాళేశ్వరం అవినీతిపై కాగ్ కు ఫిర్యాదు చేసేందుకు హస్తిన వెళ్లిన షర్మిల అక్కడ విలేకరులతో మాట్లాడారు. కడప ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య జరిగిందని, అది వాస్తవమని ఆమె కుండబద్దలు కొట్టారు. వివేకా హత్య కేసులో నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అడుగడుగునా దర్యాప్తును అడ్డుకుంటున్నారనీ అన్న షర్మిల తన సోదరి సునీతకు న్యాయం జరగాలని పేర్కొన్నారు. వివేకానంద రెడ్డిని హత్య కేసులో నిందితులకు శిక్షపడేలా ఆయన కుమార్తె షర్మిల న్యాయపోరాటం చేస్తున్న సంగతి విదితమే. ఈ హత్య కేసు దర్యాప్తు ఏపీలో అయితే నిష్పాక్షికంగా జరగదన్న ఆమె అభిప్రాయంతో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా ఏకీభవించడం.. సుప్రీం కోర్టుకు కూడా అదే నివేదించడం తెలిసిందే. ఏపీలో వివేకా హత్య కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదని సుప్రీం కోర్టు సైతం వ్యాఖ్యానించిన నేపథ్యంలో షర్మిల కడప ఎంపీ సీటు కోసమే తన బాబాయ్ హత్య జరిగిందని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా సంచలనం సృష్టించాయి. ఇప్పటికే సీబీఐ కడప ఎంపీగా తనకు టికెట్ ఇవ్వకపోతే... షర్మిలకు లేదా విజయలక్ష్మికి మాత్రమే ఇవ్వాలని వైఎస్ జగన్‌ను వివేకా కోరారని... ఈ నేపథ్యంలోనే వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ హత్య చేయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంది. వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ ప్రమేయంపై అనుమానాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు షర్మిల సూటిగా సమాధానం ఇచ్చారు. కడప ఎంపీ టికెట్ కోసమే తన బాబాయ్ హత్య జరిగిందన్నది వాస్తవమని కుండ బద్దలు కొట్టారు. తమ కుటుంబంలో జరిగిన ఘోరం తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్య అన్న షర్మిల సునీతకు న్యాయం జరగాలి. మా చిన్నాన్నను ఘోరంగా హత్య చేశారో వారి పేర్లు బయటికి రావాలి. శిక్ష పడాలి. దీన్ని ఎవరూ అడ్డుకోడానికి వీల్లేదని చెప్పారు. 2019 ఎన్నికల ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఆయన సొంత నివాసంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తొలుత ఆయనది సహజమరణమని, గుండెపోటుతో మరణించారనీ పేర్కొన్న జగన్.. ఆ తరువాత ఆయన హత్య వెనుక అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఉన్నారని ఆరోపణలు గుప్పించిన సంగతి విదితమే. విపక్ష నేతగా వివేకా హత్య కేసు సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసిన జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్నారు. అయితే వివేకా కుమార్తె సునీత మాత్రం తన తండ్రిని దారుణంగా హత్య చేసిన వారికి శిక్ష పడాల్సిందే నంటూ సీబీఐ దర్యాప్తును కోరారు. ఇప్పుడు ఏపీలో హత్య కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదనీ, వేరే రాష్ట్రానికి మార్చాలంటూ సుప్రీంను ఆశ్రయించారు. సునీత వాదనతో కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా ఏకీభవించింది. కేసు విచారణ వేరే రాష్ట్రానికి మార్చాలని కోరింది. సుప్రీం కూడా అంగీకరించింది.