డికె శివకుమార్ తో షర్మిల భేటీ
posted on Apr 10, 2024 @ 3:45PM
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో ఏపీసీసీ చీఫ్ షర్మిల భేటీ అయ్యారు. బెంగళూరులోని శివకుమార్ నివాసంలో వీరి సమావేశం జరిగింది. ఎన్నికలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. ఎన్నికల ప్రచారానికి రావాలని శివకుమార్ ను ఈ సందర్భంగా షర్మిల కోరారు. తాను తప్పకుండా వస్తానని షర్మిలకు శివకుమార్ హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ద్వారా ఏపీలో ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కమ్యూనిస్టులతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తోంది. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఆమె ఎదుర్కొంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య పోటీ కావడంతో కడప లోక్ సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో సన్నిహిత సంబంధాలున్న డికె శివకుమార్ వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి డికె ముఖ్య భూమిక వహించిన సంగతి తెలిసిందే . డికె సేవలను గుర్తించే కాంగ్రెస్ హై కమాండ్ అతనికి డిప్యూటి సీఎం పదవి కట్టబెట్టింది. కర్ణాటక స్పూర్తితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురాగలిగారు. డికె మంతనాలు జరపడం వల్లే వైఎస్ తెలంగాణలో కాంగ్రెస్ కు బాసటగా నిలిచింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత షర్మిల ఎపికి షిప్ట్ అయి కాంగ్రెస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ మాదిరిగా ఎపిలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తీసుకురావాలని షర్మిల డికెను కోరారు.