ఈ రోజు నుండి షర్మిల మరో ప్రజా ప్రస్థానం

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల గత డిశంబర్ నెలలో మోకాలి గాయం కారణంగా రద్దు చేసుకొన్నతన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రను ఈ రోజు తెలంగాణా ప్రాంతములో ఉన్నతుర్కయంజల్ పల్లె నుండి మళ్ళీ ప్రారంబించనున్నారు.

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అంశంపై స్పష్టమయిన వైఖరి ప్రకటించకుండా పాదయాత్ర మొదలుపెడితే తాము అడ్డుకొంటామని ప్రకటించిన తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరికకు జవాబునిస్తూ, ఆ పార్టీకి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్ ఆమె బెదిరింపులకి బయపడేదిలేదని, తమ నాయకురాలి పాదయాత్రను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. తెలంగాణా నేతలు అడిగినప్పుడల్లా, తెలంగాణాపై తమ వైఖరిని పదేపదే ప్రకటించవలసిన అవసరం లేదని, తాము ఈ విషయంలో చాల స్పష్టమయిన వైఖరిని తెలియజేశామని ఆయన అన్నారు.

 

కానీ, నిన్నవరంగల్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్ది భరద్వాజ్ తెలంగాణా కోసం ఆత్మహత్య చేసుకొన్ననేపద్యంలో తెలంగాణా అంతటా తీవ్రఉద్రిక్త వాతావరణం నెలకొన్నపరిస్థితుల్లో షర్మిల పాదయాత్ర మొదలుపెట్టడం ఆమెకు కొంచెం ఇబ్బందికరంగానే మారవచ్చును. “ఒకవైపు మా తెలంగాణా బిడ్డల పాడెలు సాగుతుంటే, మరో వైపు అధికారంలో రావడం కోసం ఈ విధంగా పాదయాత్రలు చేయడం అంటే తెలంగాణా ప్రజలను అవమానించినట్లే” అని కవిత విమర్శించిన తరువాత అటు భరద్వాజ్ ఆత్మహత్య చేసుకోవడం, ఇటు షర్మిల పాదయాత్ర మొదలుకావడం ఉద్రిక్త పరిస్థితులను సృష్టించే అవకాశం ఉంది.

 

షర్మిల తన పాదయాత్రలో భాగంగా ఈ రోజు సాయంత్రం ఇబ్రహీం పట్నంలో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తారు.