వెంకయ్యకి సారీ చెప్పిన ఎయిరిండియా..
posted on Jun 29, 2016 @ 6:00PM
కేంద్ర పట్టణాభివృద్ది శాఖా మంత్రి వెంకయ్య నాయుడికి ఎయిరిండియా సారీ చెప్పింది. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఆయన ఇందిరాగాంధీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే పైలట్ ఆలస్యంగా రావడంతో ఫ్లైట్ లేటయ్యింది. ఇక చేసేది లేక ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. మీ వల్ల తాను అత్యవసర కార్యక్రమాల్లో పాల్గొనలేక పోయానని ట్వీట్టర్ ద్వారా ఎయిరిండియాకు చురకలు వేశారు. దీనిపై స్పందించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు విమానం ఆలస్యమైన ఘటనపై విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన ఎయిరిండియా ఉన్నతాధికారులు పైలట్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో సమయానికి ఎయిర్‌పోర్ట్‌కు రాలేకపోయాడని తెలిపింది. గుర్గావ్‌లో నివసించే పైలట్ కోసం ఉదయాన్నే కారు పంపామని అయితే తాను ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో వేరే కారు చూసుకోవాలని పైలట్‌కు కారు డ్రైవర్ ఫోన్ చేశాడు. పైలట్ మరో కారులో ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరాడు. అయితే అతడు కూడా ఢిల్లీ-గుర్గావ్ మార్గంలో ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాడు. జరిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని..ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదని ఎయిరిండియా వెంకయ్యకు తెలిపింది.