అమరావతి శంకుస్థాపనకు ఏడేళ్లు.. నిలిచేది.. గెలిచేదీ అమరావతే!
posted on Oct 22, 2022 @ 11:51AM
నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరిగి నేటికి సరిగ్గా ఏడేళ్లు. ఏడేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున అంటే 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దండరాయునిపాలెంలో రాజధాని నగర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సరిగ్గా వారం తరువాత అంటే 2016 అక్టోబరు 28న పరిపాలనా భవన సముదాయానికి అప్పటి కేంద్ర పట్టణాభివృధ్ది మంత్రి ఎం. వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేసారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగి సరిగ్గా ఏడేళ్లయిన సందర్భంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన జరిగిందన్నారు. ఆనాడు తామంతా కనీసం వెయ్యేళ్ల పాటు తెలుగుజాతి గుండె చప్పుడుగా అమరావతి నిలుస్తుందని, నిలవాలనీ ఆకాంక్షించామని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ తుగ్లక్ విధానాల కారణంగా ఆ ఆకాంక్ష నెరవేరలేదనీ, చేసిన అభివృద్ధి అంతా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి అంటే వేల మంది రైతుల త్యాగం, కోట్లాది మంది ఆంధ్రుల సంకల్పంగా అభివర్ణించిన చంద్రబాబు.. ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు అందరూ అమరావతిని తమకు గర్వకారణంగా భావించారన్నారు. 2019 ఎన్నికలకు ముందు అమరావతిని స్వాగతించిన జగన్... అధికారంలోకి రాగానే మాట మార్చి, మడమ తిప్పి ఆంధ్రులను మోసం చేశారని విమర్శించారు. అమరావతి రైతుల మహా పాదయాత్రపై వైసీపీ కుతంత్రాలు సాగవని అన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతే అని... అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుందని చెప్పారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరి తీరుతుందన్నారు.అమరావతే నిలుస్తుందని, అమరావతే గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ అప్పట్లో పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టి, యమునా నది నుంచి నీరు తీసుకుని వచ్చారు. దేశంలోని పట్టణాలు, నగరాల అభివృద్ధికి అమరావతి దిక్సూచి కావాలని ఆయన ఆకాంక్షించారు. తాను నీరు, మట్టి తీసుకురావడాన్ని ఆషామాషీగా తీసుకోవద్దనీ, ఏకంగా దేశ రాజధానే ఏపీ రాజధాని అమరావతిలో కలవడానికి వచ్చిందనడానికి ఇది సంకేతమనీ ఏపీ చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కేంద్రం భుజం కలిపి నడుస్తుందనడానికి ఇది సూచన అనీ మోడీ అప్పట్లో చెప్పారు. కానీ వాస్తవంలో అందుకు భిన్నంగా జరిగింది. అమరావతి నిర్మాణానికి అరకొర నిధులు కేటాయిస్తూ వచ్చిన మోడీ సర్కార్.. ఏపీ అభివృద్ధి పట్ల చిన్న చూపు చూసింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఏపీ అభివృద్ధిని జగన్ గాలికొదిలేశారు. అంతే కాదు.. స్వయంగా ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతిని కాదని మూడు రాజధానులంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు మహోద్యమం చేపడితే ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి నానా విధాలుగా ప్రయత్నించారు. అన్నిటినీ ఎదుర్కొని రైతులు మొక్కవోని ధైర్యంతో, సడలని పట్టుదలతో అమరావతే ఏపీ ఏకైక రాజధాని అని నినదిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆ విషయాలన్నీ ప్రస్తావించిన చంద్రబాబు.. చివరకు అమరావతే నిలుస్తుంది... అమరావతే గెలుస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.