Read more!

పెద్దలంటే భారం కాదు బాధ్యతని చాటి చెప్పే సీనియర్ సిటిజన్స్ డే!

వృద్ధాప్యం.. ప్రతి మనిషికి తప్పని దశ.  మనిషికి అంతిమ దశ కూడా ఇదే.. ఇక జీవితం ముగింపుకు వచ్చిందని, వృద్దులు కాటికి కాళ్ళు చాపుకున్నవారని చాలామంది అర్థం చేసుకుంటూ ఉంటారు.  బాల్యం, కౌమరం, యవ్వనం, నడివయసు ఎలాంటివో వృద్ధాప్యం కూడా అలాంటిదే. కానీ వృద్ధులను చాలామంది చిన్న చూపు చూస్తుంటారు, శక్తి కోల్పోయి, బిడ్డల మీద ఆధారపడే  నిస్సహాయులుగా ఎంతోమంది వృద్దులు ఈ సమాజంలో బ్రతుకు  వెళ్లదీస్తున్నారు. తమ జీవితాన్ని త్యాగం చేసి బిడ్డలకు జీవితాన్నిచ్చిన వృద్ధుల గురించి ఈ సమాజం, ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి  పెద్దవారి కోసం, వారి బాగోగుల గురించి చర్చించేందుకు ఒక ప్రత్యేక రోజు ఉండటం నిజంగా సంతోషించాల్సిన విషయం. 

  ప్రపంచ వ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్ డే ప్రతి సంవత్సరం ఆగస్టు 21వ తేదీన జరుపుకుంటారు. ఈ సీనియర్ సిటిజన్స్ డే ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక చరిత్ర ఏంటి  తెలుసుకుంటే..

వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే ని మొదటి సారి 1988లో జరుపుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ఆగస్టు  21ని  సీనియర్ సిటిజన్స్ డే గా అధికారికంగా ప్రకటించారు.  జీవితాంతం తన వారి కోసం జీవించి, చివరి దశలో కూడా తమ అనుభవాలు,  జ్ఞానంతో మంచి భవిష్యత్తును ముందు తరాలకు  అందించే వృద్ధులు సురక్షితంగా, గౌరవంగా బ్రతకడానికి కావలసిన పరిస్థితులు ఉండాలని రోనాల్డ్ రీగన్ కోరుకున్నారు. 

కానీ జీవితంలో పసిబిడ్డగా మొదలుపెట్టి కౌమారం, యవ్వనం, నడివయసు నుండి పండిపోయిన వయసులో నిండైన అనుభవాలు, జ్ఞానం సంపాదించిన ప్రతి మనిషి తన జీవితంలో ఉద్యోగ బాధ్యతల నుండి రిటైర్మెంట్ అయితే తీసుకోగలుగుతున్నాడు.  కానీ  ఆ అవసాన దశలో ఆ వ్యక్తి జీవితం నిజంగానే విశ్రాంతిగా ఉంటోందా? ఈ ప్రశ్న వేసుకుంటే చుట్టూ ఎంతో మంది వృద్ధుల జీవితాలు సమాధానాలుగా కనిపిస్తాయి. ఇప్పటికీ చాలా మంది పెద్దవారు రిటైర్మెంట్ తర్వాత  మనవళ్ళను , మనవరాళ్ళను చూసుకోవడంలోనూ, లేదా ఉద్యోగస్థులైన పిల్లల బాగోగులు చూసుకుంటూ గడిపేస్తున్నారు. ఇక ఆడవారైతే ఉద్యోగం నుండి విశ్రాంతి లభించినా ఇంటి పనులతో క్షణం విశ్రాంతి లేకుండా జీవిస్తున్నారు. మరికొందరు పిల్లల ప్రేమాభిమానాలు దొరకక ఓల్డ్ ఏజ్ హోముల్లో ఉండాల్సి వస్తుంది. ఇంకొందరు పెద్దవారు తమ పిల్లలు పట్టించుకోక వదిలేస్తే, పొట్టకూటి కోసం  శక్తికి మించిన పనులు చేసుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్నారు. దగ్గరగా ఉన్నప్పుడు చాలామందికి పెద్దల విలువ తెలియదు. వారు చేజారిపొక ముందే పిల్లలు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

పెద్దవాళ్ళు, తమ పిల్లల కోసం చేసే పనుల్ని భారంగా కాక బాధ్యతలా పంచుకుంటారు. మరి పిల్లలు వారికి అవసరమైన సమయంలో నిజంగానే  చేతిని అందిస్తున్నారా?. అని ప్రశ్నించుకోవలసిన సమయమిది. వృద్ధాప్యం తెచ్చిన నిస్సహాయత వాళ్ళని మన దృష్టిలో నిరుపయోగంగా మార్చేస్తుంది. వారి పనులు కష్టంగా మారిపోతుంటాయి. కానీ వృద్ధులు, పిల్లలు ఒకలాంటి వారేనని అంటారు.  చిన్నతనంలో  అమ్మానాన్న పిల్లలకు చేసే పనుల్లో ఎక్కడా విసుగు ఉండదు. పైగా ఆ పనులు చేయడంలో సంతృప్తిని అనుభవిస్తారు. అదేవిధంగా పెద్దలకోసం ఏదైనా పని చేస్తే అది పిల్లల బాధ్యత అనే విషయం గుర్తించాలి.  

చాలమంది పెద్దలు పిల్లల దగ్గర   సహాయం తీసుకోవడానికి మొహమాటపడుతుంటారు. ఇక పెళ్ళి చేసి అత్తారింటికి పంపిన కూతురు నుండి తమ కష్టం చెప్పడానికి కూడా ధైర్యం చేయరు. కానీ కూతుళ్ళు అయినా, కొడుకులు అయినా తల్లిదండ్రుల గురించి, అలాగే అత్తమామల గురించి కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ  "మేమున్నాం. మీకేం కాదు" అనే భరోసా ఇవ్వగలగాలి.

 కనీసం ఒక్కరోజు లేదా కనీసం ఒక్క గంట వాళ్ళతో మనసారా నవ్వుతూ మాట్లాడాలి. అది  తల్లితండ్రులు కావచ్చు. లేదా దగ్గర వ్యక్తులు అయిన తాతా, బామ్మలు కావచ్చు. ఖాళీ సమయంలో నెలకి ఒక్కసారయినా వాళ్ళతో మనసు పంచుకోవడం అలవాటు చేసుకోవాలి.  వాళ్ళు కుటుంబ బాధ్యతల్లో పడి చేయలేకపోయిన పనులు చేయడానికి  సహాయం చెయ్యచ్చు. హాబీగా చేయాలనుకుని, నేర్చుకోవాలని కుదరక ఆగిపోయిన పనులు ఈ వృద్దాప్యంలో నేర్చుకోవడానికి సపోర్ట్ చెయ్యడం  వారి వృద్ధాప్య కాలం సజావుగా గడిచిపోవడానికి సహకరిస్తుంది. 

అసలు ఈ సీనియర్ సిటిజన్స్ డే ఉద్దేశం  వృద్దులకు  ఉన్న హక్కుల గురించి అవగాహన కలిగించడం. వారు తమ చివరి రోజుల్లో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి  ప్రభుత్వం ఇస్తున్న వనరులు గురించి తెలిసేలా చేయడం. పిల్లల కోసం జీవితంలో ఎన్నో వదులుకుని పిల్లల్ని పెద్ద చేసిన  తల్లితండ్రులు వృద్దాప్యంలో అదే పిల్లల కారణంగా బాధపడకుండా ఉండేలా చేయడం. ఈ విషయాలను వృద్దులకు తెలియజేయడమే కాదు, ప్రతి ఇంట్లో వృద్ధుల గురించి ఆ కుటుంబం వారు ఆలోచించి, వారిని సంతోషంగా ఉంచాలి. ఒకప్పుడు వారి సమయాన్ని లాక్కున్న పిల్లలు, తిరిగి వారికోసం సమయాన్ని కేటాయించాలి. అప్పుడే వృద్ధుల జీవితం భారంగా కాకుండా అనుభవాల ఫలాలను మోస్తున్న నిండు పండ్ల చెట్టులా అందరికీ ఫలాలను అందిస్తుంది. 

                                         *నిశ్శబ్ద.