ఆదాయం కోసం ప్రభుత్వ భూముల తెగనమ్మకం.. కేసీఆర్ సర్కార్ యోచన
posted on Feb 28, 2023 @ 12:00PM
తెలంగాణ ప్రభుత్వం ఆదాయం కోసం వెతకని మార్గం లేదు. చేయని ప్రయత్నం లేదు. కేంద్రం నుంచి గ్రాంట్లపై కేసీఆర్ సర్కార్ నమ్మకం కోల్పోయింది. కేంద్రం నుంచి ఎటువంటి సహకారమూ అందదని నిశ్చితాభిప్రాయానికి వచ్చేసింది.
దాంతో ప్రభుత్వ ఆదాయ మార్గాలు దాదాపు మూసుకుపోయాయనే చెప్పవచ్చు. దీంతో తెలంగాణ సర్కార్ ఆదాయం కోసం మరో సారి భూముల అమ్మకంపైనే దృష్టి పెట్టింది. ఇందు కోసం ఏకంగా వనరుల సమీకరణ కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘం పనేమిటయ్యా అంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో గుర్తించడం. అలా గుర్తించిన భూములను తెగనమ్మి నిధులు సమకూర్చుకోవడమె ప్రభుత్వం ఇప్పుడు ఎంచుకున్న మార్గం. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఏయే జిల్లాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి అన్నది గుర్తించడంలో ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగమంతా నిమగ్నమై ఉంది.
వక్ఫ్ భూములు వినా.. అసైన్డ్ ల్యాండ్స్ సహా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములన్నీ తెగనమ్మేయడానికి కేసీఆర్ సర్కార్ సూత్ర ప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఇందుకు కారణం ఆర్థికంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎటువంటి సహకారమూ అందకపోవడమే కారణంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రమే సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడం తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. పన్నులు, చార్జీలు పెంచి ఆదాయాన్ని పెంచుకుందామనుకుంటే.. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో బీఆర్ఎస్ సర్కార్ అందుకు సాహసంచలేని పరిస్థితి. ముఖ్యంగా ఆదాయం పెంపునకు ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపు మాత్రమే. అయితే అందుకు ప్రభుత్వం ఇసుమంతైనా సుముఖంగా లేదు.
దీంతో ప్రభుత్వం భూములను తెగనమ్మడం, పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించింది. హెచ్ఎండీఏ, ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగు రోడ్డు,ఇలా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయన్న ఆరా తీస్తోంది. అలాగే గతంలో సెజ్ లకు ఇచ్చిన భూములు నిరుపయోగంగా ఉంటే వాటినీ తిరిగి స్వాధీనం చేసుకుని విక్రయానికి పెట్టాలని యోచిస్తోంది. భూముల గుర్తింపు, విలువ మదింపు వంటి ప్రక్రియలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి భూముల తెగనమ్మకం చేపట్టాలన్న తొందరను బీఆర్ఎస్ సర్కార్ కనబరుస్తోంది. వచ్చే ఆరు నెలల్లో ఈ భూముల విక్రయ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.