Read more!

సెల్ఫ్ అటాక్ వ్యూహం బూమరాంగ్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో చేసిందేమిటన్నది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన సర్కార్ పట్ల ప్రజా వ్యతిరేకత పీక్స్ చేరింది. ఆయన మనమంతా సిద్ధం బస్సు యాత్రలలోనైతేనేమి, ఆయన పార్టీ అభ్యర్థుల ప్రచారం కోసం జనం వద్దకు వెళ్లిన సందర్భాలలో అయితేనేమి.. వస్తున్న ప్రజా స్పందన చూస్తే ఆ విషయం స్పష్టంగా అవగతమైపోతోంది. ప్రజలకు, పరిశీలకులకే కాదు.. స్వయంగా జగన్ కు ఆయన పార్టీ నేతలకూ కూడా విషయం విస్పష్టంగా బోధపడింది. దీంతో ఓటమి దెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. ప్రజలలో ఎమోషన్లు పెచ్చరిల్లేలా చేయడమొక్కటే మార్గమని నిర్ధారణకు వచ్చేశారు. గత ఎన్నికలలో జనంలో సెంటిమెంట్ ఎమోషన్ ను రగిల్చి విజయం సాధించిన అనుభవం ఎలాగూ ఉండనే ఉంది. మరో సారి దానిమీదే అధారపడి సెకండ్ చాన్స్ కొట్టేద్దామని వైసీపీ అధినేత పక్కా ప్రణాళిక రచించారు. 
దీంతో గత ఎన్నికల ముందు సక్సెస్ అయిన కోడి కత్తి డ్రామానే మళ్లీ నమ్ముకున్నారు. ఈ సారి కోడికత్తికి బదులు గులకరాయి దాడి డ్రామాకు తెరతీశారు. జగన్ పై గులకరాయి దాడి, ఆ వెంటనే వైసీపీ సామాజిక మాధ్యమం వింగ్, ఆ పార్టీ నేతలు, చివరాఖరికి మెయిన్ స్ట్రీమ్ లోని కొన్ని ఆయన అనుకూల మీడియా సంస్థలు.. గులకరాయి దాడిని హత్యయత్నంగా అభివర్ణిస్తూ విస్తృత ప్రచారం చేసేశారు. ఆ పార్టీ నేతలు మైకుల ముందుకు, మీడియా ముందుకు వచ్చి దాడిని ఖండఖండాలుగా చీల్చి చెండాడేశారు. ఈ సారి కావలసినంత మైలేజి వచ్చేస్తుంది, మరో సారి అధికారం ఖాయమన్న భావనకు వచ్చేశారు. అయితే ఈ సారి ఆయన దాడి డ్రామా బూమరాంగ్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. 

గతంలో  అంటే గత ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో తన మీద జరిగిందని జనగ్ చెప్పుకున్న దాడి సమయంలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీంతో చంద్రబాబు అధికారంలో ఉండి, ఓటమి భయంతో తనపై హత్యయత్నం చేశారు అంటే జనం నమ్మారు. కానీ ఇప్పుడు జరిగిన గులకరాయి హత్యయత్నం సమయంలో అధికారంలో ఉన్నది స్వయంగా జగన్. ఆయనే ముఖ్యమంత్రి. అటువంటి జగన్ తన పై చంద్రబాబు గులకరాయితో హత్యయత్నం చేయించారని ఆరోపణలు చేస్తుంటే జనం నవ్వుకుంటున్నారు. ఆయనకు భద్రతగా నిలవాల్సిన సెక్యూరిటీ సిబ్బంది సరిగ్గా దాడి సమయానికే కింద కూర్చుండి పోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో కరెంటు పోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. కరెంటు పోయింది సరే కనీసం ఫ్లడ్ లైట్లైనా ఎందుకు వేయలేదని నిలదీస్తున్నారు. అయినా చీకటి పడగానే బస్సులోకి వెళ్లిపోయే జగన్ దాడి జరిగిన రోజు మాత్రమే చీకటి పడినా, కరెంటు లేకపోయినా ఎందుకు బస్సుపైనే ఉండిపోయారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరిశీలకులు సైతం దాడి జరిగిన తీరును  చూస్తుంటే ఇది స్వయంగా జగన్ కోసం జగన్ చేత జగనే చేయించుకున్నారనిపిస్తోందని విశ్లేషణలు చేస్తున్నారు. మొత్తం మీద ఈ సారి గులకరాయి  హత్యాయత్నం ఆరోపణల డ్రామా బూమరాంగ్ అయ్యిందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈ దాడి జగన్ పై సానుభూతి కలగడానికి బదులు ఏవగింపు కలగడానికి దోహదపడేలా కనిపిస్తోందని విశ్లేషణలు చేస్తున్నారు.  

చిలకలూరి పేట కూటమి సభ సందర్భంగా ప్రధాని పాల్గొన్న సభలో సైతం బట్టబయలైన భద్రతాలోపాలు, ఆ తరువాత పింఛన్ల పంపిణీ విషయంలో జగన్ పార్టీ ప్రదర్శించిన అత్యుత్సాహం, వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలన్న ఎన్నికల సంఘం నిర్ణయానికి తెలుగుదేశం ఒత్తిడే కారణం అంటూ చేసిన ప్రచారం అన్నిటినీ కలిపి చూస్తున్న జనం.. గెలవడం కోసం జగన్ ఎంతకైనా తెగించేస్తారన్న అభిప్రాయానికి వచ్చేశారు. అందుకే జగన్ పై గులకరాయి హత్యాయత్నానికి వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్రంలో జరిగిన ఆందోళనల్లో జనం భాగస్వామ్యం ఇసుమంతైనా కనిపించలేదు. జగన్ పార్టీ ఆస్థాన ఉపన్యాసకులు తమదైన భాషలో ప్రతిపక్ష పార్టీలు, నేతలపై చేసిన విమర్శలు వినా మరెవ్వరూ నోరెత్తలేదు. 

 అదే సమయంలో గతంలో  చంద్రబాబుపై రాళ్ల దాడి సందర్భంగా  గుడివాడ నాని అదే కొడాలి నాని, ఆర్కే రోజా, జోగిరమేష్, అంబటి రాంబాబు వంటి  ప్రత్యేక భాషలో ఆరితేరిన వైసీపీ నేతలు ఆ దాడి సింపతీ కోసం చంద్రబాబు చేయించుకున్న దాడిగా అభివర్ణిస్తూ చేసిన ప్రసంగాల క్లిప్పింగులను నెటిజన్లు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ చేస్తూ వైసీపీ డ్రామాపై తెగ సెటైర్లు గుప్పిస్తున్నారు. 
అలాగే బందరు నాని అదే పేర్ని నాని కడపు మండితే ఇలాంటి దాడులే జరుగుతాయి. ప్రజలను మోసం చేస్తే వారు రాళ్లు విసరక ఏం చేస్తారు అని గతంలో బాబుపై దాడి సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేస్తూ జగన్ పై నిజంగా దాడి జరిగి ఉంటే అది ప్రజాగ్రహమే కదా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా జగన్ పై దాడి జరిగిందని జనం ఇసుమంతైనా నమ్మడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    తెలుగుదేశం నేతలు కోడికత్తి 2.0 వెర్షన్ అంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు. ప్రజలను ఒక సారి మోసం చేయగలరు కానీ ప్రతిసారీ కాదని అంటున్నారు. 

 చిలకలూరి పేటలో  ప్రధాని పాల్గొన్న  కూటమి సభలో  తీవ్ర భద్రతా వైఫల్యాలపైనే కేంద్ర హోం శాఖ సీరియస్ గా ఉంది.  రాష్ట్రంలో డిజిపితో సహా 22 మంది పోలీస్ ఉన్నతాధికారులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు  చేశారు. దానిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే దృష్టిపెట్టింది. ఇప్పుడు సీఎం జగన్ పై గులకరాయి దాడి జరిగింది. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్‌   రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వివరణ కోరింది. గులకరాయి దాడి ఘటనతొ  వైసీపీ తనంత తానే రోకటిలో తలపెట్టి వేటు కోసం ఎదురు చూసే పరిస్థితిలో పడిందని పరిశీలకులు అం టున్నారు. సానుభూతి ఓట్ల మాట అటుంచి ఎన్నికల సంఘం చర్యలకు రెడీ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ పై దాడి జరిగిందని అటు జనమూ నమ్మడం లేదు...ఇటు ఎన్నికల సంఘమూ చర్యలకు సమాయత్తమౌతుండటంతో జగన్ పార్టీకి రెండిందాలా నష్టమేజరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.