144 ఏళ్ల సికింద్రాబాద్ ప్రింటింగ్ ప్రెస్ ఇక గత చరిత్ర..!
posted on May 6, 2023 @ 9:49AM
సికింద్రాబాద్ ప్రింటింగ్ ప్రెస్ మూతపడింది. 144 ఏళ్ల పాటు రైల్వేలకుసేవలందించిన ఈ ప్రెస్ చరిత్ర గర్బంలో కలసిపోయింది. సికింద్రాబాద్ లో 144 ఏళ్ల క్రితం నిజాం హయాంలో ఏర్పాటైన ప్రింటింగ్ ప్రెస్ అండ్ ఫామ్స్ డిపార్టమెంట్ ఇక గత చరిత్రగా మిగిలిపోనుంది. రైల్వే రిజర్వుడు, అన్ రిజర్వుడు ప్రయాణ టికెట్లు, డైరీలు, క్యాలెండర్లు ముద్రించే ఈ ప్రెస్ ని మూసివేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.
బైకులా- ముంబయి (మధ్య రైల్వే), హావ్డ్ (తూర్పు రైల్వే), శకుర్ బస్తీ-దిల్లీ (ఉత్తర రైల్వే), రాయపురం-చెన్నై (దక్షిణ రైల్వే)ల్లోని ప్రింటింగ్ ప్రెస్ లనూ మూసివేయనుంది. రైల్వే బోర్డు డైరెక్టర్ గౌరవ్ కుమార్ ఆయా రైల్వేజోన్ల జనరల్ మేనేజర్లకు ఈ మేరకు ఉత్తర్వులు పంపించారు. రిలీవ్ చేసే ఉద్యోగులను ఇతర విభాగాల్లో నియమించాలని సూచించారు. రైలు టికెట్ల విధానం పూర్తిగా డిజిటలైజేషన్ అయ్యేంతవరకు రిజర్వుడు, అన్ రిజర్వుడు టికెట్ల ముద్రణను ఔట్సోర్సింగ్ కు ఇవ్వాలని పేర్కొన్నారు. 1870లో నిజాం స్టేట్ రైల్వే ఆవిర్భవించింది. 1879లో రైలు టికెట్ల ముద్రణ కోసం సికింద్రాబాద్ లో ప్రెస్ ను ఏర్పాటుచేశారు.
ప్రారంభంలో 1,500 మంది వరకు ఉద్యోగులుండేవారు. స్వాతంత్య్రానంతరం నిజాం స్టేట్ రైల్వే... భారతీయ రైల్వేలో విలీనమైంది. రైల్వేశాఖ టికెట్ల జారీలో డిజిటలైజేషన్ తీసుకురావడంతో ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ 169కి చేరింది. ఆన్లైన్ టికెట్ల విక్రయం 80 శాతానికి చేరడమే రైల్వేశాఖ నిర్ణయానికి కారణం. ఆన్ లైన్ లో టిక్కెట్ల విక్రయం జరుగుతున్న కారణంగా.. ఇక టిక్కెట్ల కోసం ప్రత్యేకంగా ప్రెస్ ను నడపాల్సిన అవసరం లేదని.. రైల్వే బోర్డు భావించి ప్రెస్ ను మూసేసింది.
అభివృద్ధి ఓ మార్పుకు నాంది.. అయితే అభివృద్ధి వెన్నంటే ..కష్టాలు, బాధలు కూడా ఉంటాయనే అమెరికన్ విద్వాంసుడు ఎమర్సన్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.