కొడాలి నాని నోరు మూసుకో..
posted on Feb 13, 2021 @ 10:44AM
ఎపి ఎన్నికల సంఘం ప్రతిష్టకు భంగం కలిగించేలా పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏపీ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ షాకిచ్చారు . రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు అంటే.. ఈ నెల 21వ తేదీ వరకు మీడియా సమావేశాల్లో కానీ, అలాగే బృందాలతో కానీ మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఆదేశాలను అమలు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్సీ, విజయవాడ పోలీసు కమిషనర్‌లను ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు.
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను విద్వేషపూరిత ప్రసంగం గా ఎస్‌ఈసీ పరిగణించింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు నిమ్మగడ్డ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా.. నిన్న మంత్రి కొడాలి నాని తాడేపల్లిలో విలేకరుల సమావేశం పెట్టి నిమ్మగడ్డను, చంద్రబాబును తీవ్ర పదజాలంతో తిట్టిపోశారు. ఈ విమర్శలపై స్పందించిన ఎస్‌ఈసీ.. ఆయనకు షోకాజ్ నోటీసు పంపించింది. దీంతో సాయంత్రానికి మంత్రి తన వివరణను తన న్యాయవాది ద్వారా పంపించారు. ఎస్‌ఈసీ అంటే తనకు గౌరవమే అని అయన వివరణ ఇచ్చారు. అయితే మంత్రి వివరణతో ఎస్‌ఈసీ సంతృప్తి చెందలేదు. అంతేకాకుండా ప్రెస్‌మీట్‌లో చేసిన ఆరోపణలు, విమర్శలను మంత్రి వెనక్కి తీసుకోకపోవడాన్ని ఎస్ఈసీ తీవ్రంగా పరిగణించింది.
మంత్రి కోడలి నాని గత నాలుగైదు నెలలుగా ఎన్నికల సంఘంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, అయినప్పటికీ తాము సంయమనం పాటించమని నిమ్మగడ్డ వివరించారు. అయితే, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం వల్ల ఎన్నికల సంఘంపై ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని, దీంతో మంత్రిపై చర్యలు తీసుకున్నట్టు నిమ్మగడ్డ పేర్కొన్నారు.