హుజురాబాద్ లో దళిత బంధు సెగలు.. టీఆర్ఎస్ నేతల్లో గుబులు
posted on Aug 14, 2021 @ 12:54PM
అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. ఈ పాట ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సరిగ్గా అతికిపోయినట్లుగా మారింది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న దళిత బంధు పథకం.. ఆ పార్టీకి గండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధును ప్రవేశపెట్టారని విపక్షాలు ఆరోపిస్తుండగా.. ఇప్పుడా హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులే ఆందోళనలు చేస్తుండటం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. దళిత బంధులో తమ పేర్లు లేవంటూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ దళితులు నిరసనలకు దిగారు.
దళిత బంధుపై రెండు రోజులుగా హుజురాబాద్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దళిత బంధును అర్హులకు ఇవ్వడం లేదంటూ మండిపడుతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హుజురాబాద్‌లో దళితులు ధర్నాకు దిగారు. దళితులు చేపట్టిన రాస్తారోకోతో వరంగల్- కరీంనగర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దళిత బంధు అందరికి ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో దళితుల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. హుజురాబాద్ ఆర్డీవో ఆఫీసు ఎదుట నర్సింగ పూర్ గ్రామ దళితుల ఆందోళన చేశారు. గ్రామంలో ఉన్న దళితులందరికీ ఒకేసారి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరికి మొదటి దఫాలో ఇస్తే మిగతా వారికి వస్తాయన్న గ్యారెంటీ లేదని నినాదాలు చేశారు.
పోలీసులతో దళితులు వాగ్వాదానికి దిగారు. దళితుల ఆందోళనతో టీఆర్ఎస్ నేతలు కలవరపడుతున్నారు. కరీంనగర్‌లో ముగ్గురు మంత్రులు సమావేశం నిర్వహించారు. సీఎం సభ, అర్హుల ఎంపికపై సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ పర్యటనతో పాటు దళితుల ఆందోళనలపై చర్చించారు. మరోవైపు హుజూరాబాద్‌లో ధళిత బంధు తొలి లబ్దిదారులుగా 15 మందిని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఈనెల 16 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాలపల్లి గ్రామం బహిరంగ సభ వేదికగా 15 మంది దళితులకు తెలంగాణ దళితబంధు పథకం చెక్కులను సీఎం కేసీఆర్ అందజేయనున్నారు. లబ్ధిదారుల ఎంపికపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. శనివారం రాత్రి వరకూ జాబితా ఖరారు చేయనున్నారు. జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా కలెక్టర్ కర్ణన్ పంపనున్నారు. సీఎం ఆమోదంతో తొలి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు.