సండ్రకు బెయిల్ మంజూరు
posted on Jul 14, 2015 @ 4:23PM
ఓటుకు నోటు కేసులో అయిదవ నిందితుడిగా ఉన్న సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సండ్ర బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం నిన్న వాదోపవాదనలు జరిపినప్పటికీ మళ్లీ ఈరోజుకు వాయిదా వేసింది. ఈ రోజు విచారణ జరిపి బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచీకత్తు సమర్పించాలని, నియోజకవర్గం దాటి వెళ్లవద్దని కోర్టు షరతులు విధించింది. కాగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న సండ్రకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని.. కేసు కీలక దశలో ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వద్దని ఏసీబీ అధికారులు ఏసీబీని కోరారు. అయితే ఆ తరువాత సండ్రని రెండు రోజుల కస్టడీకి తీసుకొని కూడా విచారించారు. కానీ సండ్ర తరఫు న్యాయవాది రవీంద్ర కుమార్.. రెండు రోజుల ఏసీబీ విచారణకు సండ్ర అన్ని రకాలుగా సహకరించాడని.. సండ్రకు సంబంధించి ఇంకెవర్నీ విచారించే అవసరం లేదని తన అన్నారు. విచారణ నిమిత్తం ఎప్పుడు అవసరమైన హాజరవుతారని చెప్పారు. దీంతో ఏసీబీ కోర్టు సండ్రకు బెయిల్ మంజూరు చేసింది.