అత్యంత విషమంగా సల్మాన్ రష్దీ ఆరోగ్యం
posted on Aug 13, 2022 @ 10:49AM
న్యూయార్క్ లో ఓ దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన ప్రసిద్ధ రచయత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఒక విద్యాసంస్థలో జరిగిన కార్యక్రమానికి హాజరై ప్రసంగిస్తున్న ఆయనపై పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి వేదిక పైకి దూసుకు వచ్చి మరీ దాడి జరిపాడు.
దుండగుడిని అదుపులోనికి తీసుకున్నారు. కాగా ఆ దండగుడు సల్మాన్ రష్దీ మొడపై కత్తితో పొడిచాడు. దీంతో ఆయన అక్కడిక్కడే కుప్ప కూలిపోయారు. ఆయనకు వెంటనే ప్రథమ చికిత్స చేసి హెలికాప్టర్ లో ట్రామా సెంటర్ కు తరలించారు. అక్కడ సల్మాన్ రష్దీ కి చికిత్స జరుగుతోంది. రష్దీ ఏజెంట్ కథనం ప్రకారం రష్దీ ఆరోగ్య పరిస్థితి అంత్యంత విషమంగా ఉంది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే కాలేయం కూడా దెబ్బ తింది అని పేర్కొన్నారు. కత్తి పోటును అడ్డుకునే ప్రయత్నంలో రష్దీ చేయి అడ్డు పెట్టుకున్నారనీ, దీంతో ఆయన చేతిలో నరాలు తెగిపోయాయనీ వివరించారు.
భారత సంతతికి చెందిన రష్దీ ముంబైలో 1947లో రష్దీ జన్మించారు. ఆ తరువాతి కాలంలో బ్రిటన్ కు తరలి వెళ్లారు. 1981లో ఆయన రాసిన మిడ్ నైట్ చిల్డ్రన్ పుస్తకానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంలు లభించాయి. ఆ తరువాత 1988లో ఆయన రచించిన ‘ది శైటానిక్ వర్సెస్’ వివాదాస్పదమైంది. పలు ఇస్లామిక్ సంస్థలు ఆయన పై మండి పడ్డాయి.
ఆయనను హత్య చేస్తామంటూ బెదరింపులు కూడా వచ్చాయి. ఇరాన్ అయితే తమ దేశంలో దిశాటినిక్ వర్సెస్ పుస్తకాన్ని నిషేధించడమే కాకుండా రష్దీ పై ఫత్వా కూడా విధించింది. దీంతో ఆయన దాదాపు దశాబ్దం పాటు పూర్తిగా ఆజ్ణాతంలో ఉన్నారు. ఆయన ఎక్కడ ఉంటున్నదీ కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియనీయలేదు. ఈ నేపథ్యంలోనే ఆయనపై న్యూయార్క్ లో దాడి జరిగింది.