ఇది అయ్యే పనేనా సజ్జలా?
posted on May 18, 2023 @ 9:55AM
రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారౌతోంది. ఇప్పటికే వైసీసీ నేతలెవరూ ముఖ్యమంత్రి జగన్ సహా ప్రజలలోకి వెళ్లేందుకు ధైర్యం చేయడం లేదు. తమ వాచాలతను ప్రదర్శించడానికి మీడియా సమావేశాలను ఉపయోగించుకుంటున్నారు. చివరాఖరికి ముఖ్యమంత్రి కూడా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి సొమ్ములు జమ చేయడానికి అంటే ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభల నుంచి జనం పారిపోతున్నా.. పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఆ మిగిలిన జనానికే తన ఫ్రస్ట్రేషన్ అంతా ప్రదర్శిస్తూ విపక్షాలను తిట్టిపోస్తున్నారు. పార్టీ పరంగా సభలూ, సమావేశాలూ నిర్వహించే ధైర్యం సన్నగిల్ల ప్రభుత్వ కార్యక్రమాలనే పార్టీ కార్యక్రమాలుగా మార్చేసుకుని విపక్ష నేతలపై విమర్శలు గుప్పించి తమ జబ్బలు తామే చరుచుకుంటున్నారు. వైనాట్ 175 నుంచి మీ బిడ్డను నేను.. విపక్షాని ఓటు వేయకండని బతిమలాడుకుంటున్నారు. సింహం సింగిల్ గా వస్తుంది.. దమ్ముంటే తెలుగుదేశం, జనసేనలు విడివిడిగా ఎన్నికల రణరంగంలో పోటీ చేయండి అంటూ సవాళ్లు విసిరిన జగన్ ఇప్పుడు.. బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతూ హస్తినలో కమలం పార్టీ అగ్రనేతల అప్పాయింట్ మెంట్ కోసం చకోరపక్షిలా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికార వైసీపీపై వాడవాడలా చార్జిషీట్లు విడుదల చేస్తూ ఎక్కడికక్కడ వైసీపీ నేతల దుర్మార్గాలను ఎండగడుతుంటే.. వైసీపీ అధినేత జగన్ మాత్రం బీజేపీ పెద్దల ప్రాపకం కోసం తహతహలాడుతున్నారు.
అదలా ఉంచితే.. తాము జనంలోకి వెళ్లే అవకాశం లేకపోవడాన్ని వైసీపీ పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ.. విపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ జనంలో తిరగడం, వారికి ప్రజలు బ్రహ్మరథం పట్టడం భరించ లేకపోతున్నారు. విపక్ష నేతల సభలను రోడ్ షోలను అడ్డుకోవడానికి తీసుకువచ్చిన జీవో నంబర్ 1ను కోర్టు కొట్టివేయడంతో వైసీపీలో అసహనం అవధులు దాటింది.
జీవో నంబర్ 1 చెల్లదని చెప్పినది న్యాయస్థానం అన్న విషయాన్ని మరచిపోయి.. చంద్రబాబు సభలకు, రోడ్ షోలకు అనుమతులిచ్చి ఇంకా ఎంత మంది ప్రాణాలు తీయమంటారు? అని ప్రశ్నిస్తోంది. రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన హక్కులను కాదనడం సాధ్యం కాదని గూబ గుయ్యిమనేలా న్యాయస్తానం విస్పష్ట తీర్పు ఇచ్చినా తత్వం బోధపడలేదు. సకల శాఖల మంత్రి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోర్టు తీర్పు తరువాత విపక్షాల సభలు, సమావేశాలను అడ్డుకోవడానికి చట్టం తీసుకువస్తామని సెలవిచ్చారు.
ఇందు కోసం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామన్నారు. అసలు చంద్రబాబు పాల్గొన్న రెండు కార్యక్రమాలలో అవాంఛనీయ సంఘటనలు జరగడం , ఆ వెంటనే ఆఘమేఘాల మీద జీవో రావడం వెనుక కుట్ర ఉందా అన్న అనుమానాలను పరిశీలకులు అప్పట్లోనే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగానే.. సజ్జల సభలను, రోడ్ షోలను అడ్డుకోవడానికి చట్టం తీసుకువస్తామనడం ఉందని విశ్లేషిస్తున్నారు.