ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం సాజిత్ అక్రమ్ విఫలయత్నం!

ఆస్ట్రేలియా  బీచ్ కాల్పుల నిందితుడు
ఆస్ట్రేలియా-భారత్ మధ్య తరచూ రాకపోకలు

ఆస్ట్రేలియా సిడ్నీ  బీచ్ ప్రాంతంలో పోలీసు కాల్పుల్లో హతమైన ఐసిస్ అనుబంధ ఉగ్రవాది సాజిత్ అక్రమ్  గతంలో ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాడని ఆ దేశ నిఘా వర్గాలు వెల్లడించాయి.  ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం సాజిత్ అక్రమ్ దరఖాస్తు చేసుకున్న ప్రతి సారీ అతడి దరఖాస్తు తిరస్కరణకు గురైందని తెలిపాయి.  
హైదరాబాద్‌లోని జోచిచాక్ అల్ హసన్ కాలనీలో నివసిస్తున్న సాజిత్ కుటుంబ సభ్యులను ప్రశ్నించిన అనంతరం ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. గత 27 ఏళ్లుగా సాజిత్ హైదరాబాద్, ఆస్ట్రేలియా మధ్య  రాకపోకలు సాగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రయాణాల వెనుక ఉన్న కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.
నాంపల్లిలోని అన్వర్ ఉల్ ఉలూమ్ కాలేజీలో  బీఏ పూర్తి చేసిన సాజిత్ అక్రమ్, 1998 నవంబర్ 8న స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లాడు. 2000లో అక్కడే బియాన్ వెనెస్సా గోసాను వివాహం చేసుకున్నాడు. ఆమె అప్పటికే ఆస్ట్రేలియా పర్మినెంట్ రెసిడెంట్ కావడంతో, 2001లో సాజిత్ తన వీసాను పార్ట్‌నర్ వీసాగా మార్చుకున్నాడు.

తదనంతరం 2008లో రెసిడెంట్ రిటర్న్ వీసాను పొందిన సాజిత్, పీఆర్ హోదాను కొనసాగించాడు. పీఆర్ కలిగిన వారికి ఐదేళ్లపాటు ఆస్ట్రేలియాకు స్వేచ్ఛగా వచ్చి వెళ్లే అవకాశం ఉండటంతో, అతడు ఈ వీసా ద్వారా దేశంలో తన ఉనికిని కొనసాగించినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఓటు హక్కు, పాస్‌పోర్టు, విదేశాల్లో రాయబార కార్యాలయాల రక్షణ పొందాలంటే పౌరసత్వం అవసరం. ఈ నేపథ్యంలో సాజిత్ అక్రమ్ అనేకసార్లు ఆస్ట్రేలియా పౌరసత్వానికి దరఖాస్తు చేసినట్లు కుటుంబీకులు వెల్లడించారు. అయితే ప్రతి దరఖాస్తు తిరస్కరణకు గురైందని, తిరస్కరణ కారణాలను సాజిత్ ఎప్పుడూ తమతో పంచుకోలేదని అతడి కుటుంబ సభ్యులు  తెలిపారు. సాజిత్ కుమారుడు నవీద్ అక్రమ్ 2001 ఆగస్టు 12న ఆస్ట్రేలియాలో జన్మించడం తో అతడికి ఆ దేశ పౌరసత్వం, పాస్‌పోర్టు లభించాయి.  2003లో తొలిసారిగా భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చిన సాజిత్, కుటుంబీకుల సమక్షంలో సంప్రదాయ నిఖా చేసుకున్నాడు. 2004లో తన కుమారుడిని బంధువులకు చూపించేందుకు మరోసారి నగరానికి తీసుకువచ్చాడు.

2006లో తండ్రి మృతి అనంతరం కుటుంబీకులను కలుసుకుని వెళ్లిన సాజిత్, 2018లో వారసత్వంగా తనకు వచ్చిన శాలిబండ లోని ఇంటిని విక్రయించేం దుకు హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ ఆస్తి విక్రయం తో వచ్చిన డబ్బుతో ఆస్ట్రే లియాలోని బోసరగ్ ప్రాంతం లో ఇల్లు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది ఫిబ్రవరిలో తన వాటాను కూడా భార్య పేరు కు బదిలీ చేసినట్లు సమా చారం. 2012 ఫిబ్రవరిలో సాజిత్ అక్రమ్ చివరిసారిగా హైదరాబాద్‌కు వచ్చి కుటుం బీకులను కలుసుకుని వెళ్లాడు. అదే సమయంలో పదేళ్ల కాలపరిమితికి సంబం ధించిన పాస్‌పోర్టు రిన్యూ వల్ కూడా చేయించుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. సిడ్నీ కాల్పుల ఘటన నేపథ్యంలో సాజిత్ అక్రమ్ గత జీవితం, అంతర్జాతీయ ప్రయాణాలు, ఆర్థిక లావాదేవీలు, సంబం ధాలపై భారతీయ, ఆస్ట్రే లియా భద్రతా సంస్థలు సమన్వయంతో సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంపై సభా తీర్మానం

  మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం  స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ గ్రామీణ్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ చట్టం (వీబీజీ రామ్ జీ) ను తీసుకొచ్చింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. అత్యంత పేద ప్రజల కోసం రూపొందించిన ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  నరేగా ద్వారా ఇన్నేళ్లుగా పేదలకు ఉపాధి ఒక హక్కుగా లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో మంత్రి సీతక్క చిట్ చాట్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం పై మాట్లాడాల్సి వస్తుందనే బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసిందని ఆమె తెలిపారు. బీజేపీ కి బిఆర్ఎస్ సహాకరిస్తుందనే దానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ- బిఆర్ఎస్ ఎజెండా ఓక్కటే.. కార్పోరేట్ ల కోసమే బీజేపీ, బిఆర్ఎస్ పనిచేస్తున్నాయిని సీతక్క తెలిపారు.  అందుకే ఈరోజు చర్చలో బీఆర్ఎస్ పాల్గొనలేదు. ప్రధాని మోడీ మెప్పు కోసం బీఆర్ఎస్ పెద్దలు సభ ను బైకాట్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ రద్దు చేసినా ఆ పార్టీ నోరు మెదపడం లేదు” అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి తీసుకు వచ్చింది. పేదరికం, నిరుద్యోగం, వలసలు, నైపుణ్యం లేని శ్రామిక వర్గాల దోపిడీ,  స్త్రీ పురుషుల మధ్య వేతన అసమానతలను తగ్గించి అన్ని వర్గాల అభివృద్ధికి తెచ్చిన ఈ చట్టం 2006 ఫిబ్రవరి 2 నుంచి అమలులోకి వచ్చింది. ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం 100 రోజుల ఉపాధి కల్పించి, కనీస వేతనం అందించే గ్యారంటీ ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం. గత 20 సంవత్సరాలుగా ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో లబ్ధి పొందిన వారిలో సుమారు 90 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలున్నారు. వీరిలో 62 శాతం మహిళలు లబ్ధి పొందారు. దళితులు, గిరిజనులు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన తెగలకు చెందిన ఆదివాసీలు, చెంచులు, పేద వర్గాలే ఎక్కువగా ప్రయోజనం పొందారు.   ప్రస్తుతం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) చట్టం  VB G RAM G -2025  పేదల హక్కులను దెబ్బతీసేలా ఉంది. ఈ పథకంపై ప్రధానంగా ఆధారపడ్డ గ్రామీణ ప్రాంత మహిళలు,  బలహీన వర్గాల ఉపాధికి హామీ లేకుండా చేస్తోంది. పాత ఉపాధి హామీ పథకం ఆత్మను దెబ్బతీసే నిబంధనలు పేదల పాలిట శాపంగా మారనున్నాయి.    ఆ కారణంగా ఈ సభ కింద తెలిపిన విధంగా తీర్మానిస్తోంది: 1. కొత్త చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉంది. ఉపాధి హామీ చట్టం యొక్క అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. డిమాండ్ అనుగుణంగా పనుల ప్రణాళికను తయారు చేసే విధానానికి స్వస్తి పలికింది. డిమాండ్ ఆధారిత పాత విధానాన్ని కొనసాగించాలి.  2. కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు అమల్లో ఉన్న MGNREGAలో దాదాపు 62 శాతం మహిళలు కూలీ పొందేవారు. కొత్త చట్టంలో పొందుపరిచిన పరిమిత (నార్మేటివ్) కేటాయింపుల విధానం వల్ల పని దినాలు తగ్గిపోతాయి. దీంతో పేద కుటుంబాల్లోని మహిళలు నష్టపోతారు. మహిళా సాధికారత సాధించాలంటే పాత విధానం పునరుద్ధరించాలి.  3. ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో పూర్తిగా కేంద్రమే నిధులు కేటాయించేది. కొత్త చట్టం ద్వారా కేంద్ర-రాష్ట్ర నిధుల వాటా 60:40గా మార్చటం సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తుంది. ఇది రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది. పాత నిధుల వాటా  నమూనాను పునరుద్ధరించాలి. 4. మహాత్మాగాంధీ గారి పేరును ఈ పథకం నుంచి తొలగించటంతో గాంధీ గారి స్ఫూర్తిని నీరుగార్చినట్లయింది.    5. వ్యవసాయ సీజన్ లో 60 రోజుల విరామం తప్పనిసరిగా విధించడంతో భూమి లేని నిరుపేద కూలీలకు అన్యాయం జరుగుతుంది. ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరం పొడవునా కొనసాగించాలి. 6. ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా 266 రకాల పనులు చేపట్టే వెసులుబాటు ఉంది. కొత్త చట్టంలో భూముల అభివృద్ధి వంటి శ్రమ ఆధారిత పనులు తొలిగించటంతో చిన్న సన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు నష్టపోతారు. ఇప్పుడున్న పనుల జాబితాను యథాతథంగా అనుమతించాలి.  ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని, MGNREGA చట్టంలో నిర్దేశించిన ఉద్దేశాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని కూలీ కుటుంబాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మహాత్మగాంధీ NREGA చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని ఈ సభ తీర్మానిస్తుంది.

జనవరి 3 నుంచి రాష్ట్రపతి నిలయంలో రెండో ఉద్యాన్ ఉత్సవ్

  ప్రజా భాగస్వామ్యం, పర్యావరణ స్పృహను ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా భారత రాష్ట్రపతి శీతాకాల నివాసమైన  రాష్ట్రపతి భవన్‌లో 2026 జనవరి 3 నుంచి 11 వరకు ‘ఉద్యాన్ ఉత్సవ్’ రెండవ ప్రదర్శన జరగనుంది. రాష్ట్రపతి నిలయాలను పౌర భాగస్వామ్యానికి, పర్యావరణ స్పృహకు కేంద్రాలుగా మార్చాలనే గౌరవ భారత రాష్ట్రపతి ఆకాంక్ష మేరకు ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు. దీనిని రాష్ట్రపతి నిలయం ఆధ్వర్యంలో  వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్వహిస్తుండగా.. ‘మేనేజ్’ సహకారం అందిస్తోంది.‘ఉద్యాన్ ఉత్సవ్ 2026’లో సుమారు 120 ప్రదర్శకులతో 50 నేపథ్య స్టాళ్లను ఏర్పాటు చేశారు.  ఇవి వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు, వ్యాపార అవకాశాలు, విలువ ఆధారిత ఉత్పత్తులకు వేదికగా నిలుస్తాయి. ఇక్కడ సందర్శకులు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే గ్రీన్‌ నాలెడ్జ్‌ హబ్‌..  పోషక విలువలున్న చిరుధాన్యాల ఉత్పత్తులను ప్రొత్సహించే మిల్లెట్ మండి, స్టార్టప్ హబ్.. సేంద్రీయ ఉత్పత్తులు, జీఐ ట్యాగ్ ఉత్పత్తులు, గిరిజన హస్తకళల ప్రదర్శనకు ఎకో బజార్.. బయో ఇన్‌పుట్స్‌, నర్సరీ మొక్కల విక్రయానికి ప్లాంట్ అండ్ ప్రొడ్యూస్.. 59 రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు జోన్,ఫామ్-2-ఎంటర్‌ప్రైజ్ వంటి వివిధ విభాగాలను చూడవచ్చు. ఈ ఉత్సవంలో భాగంగా  ప్రతిరోజూ వైవిధ్యభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.  వీటిలో  భరతనాట్యం, కథక్,  కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాలు..పేరిణి శివతాండవం, ఒగ్గు డోలు, మాధురి నృత్యం వంటి ప్రాంతీయ కళారూపాలు.. సంగీత కచేరీలు, హరికథ, బుర్రకథ వంటి వారసత్వ కళలు,  వివిధ రకాల సంగీత కచేరీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ప్రదర్శనలో సమాజ భాగస్వామ్య ముఖ్య ఆకర్షణగా నిలవనుంది. కుండల తయారీ, కూరగాయలపై చెక్కడాలు, విత్తన బంతుల తయారీ వంటి నేర్చుకుంటూ చేసే పనులు ద్వారా యువతలో పర్యావరణ పరిరక్షణపై అవగాహనను పెంపొందించేందుకు రూపొందించారు.  ఆధునిక వ్యవసాయ పద్ధతులైన హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్, సహజ రంగుల వెలికితీతపై ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. క్విజ్ పోటీ, ‘‘విష్‌ ట్రీ-మై ప్రామిస్‌ టు ఇండియా’’ వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ ఉత్సవం జ్ఞానాన్ని పంచుకునే వేదికగా కూడా నిలవనుంది. ఇందులో భాగంగా నిపుణుల ఆధ్వర్యంలో సహజ, సేంద్రీయ వ్యవసాయం, వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయ సాంకేతికతలు, చిరు ధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తులు వంటి అంశాలపై ఐఐఎంఆర్‌, ఐఐఓఆర్‌ ఏపీఈడీఏ వంటి ప్రముఖ సంస్థలతో వర్క్‌షాప్‌లు, పరస్పర చర్చా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చామంతి, సెలోసియా, బంతిపూలు, పాయిన్‌సెట్టియాలు ఇతర కాలానుగుణ పూలతో రూపొందించిన విభిన్న నేపథ్య పుష్ప అలంకరణలు ఏర్పాటు చేశారు. సృజనాత్మకంగా అలంకరించిన  పుష్ప ప్రదర్శనలు ఉత్సాహభరితమైన పండుగ వాతావరణాన్ని కలిగిస్తాయి. ఈ ఉద్యాన్ ఉత్సవ్ అందరికీ ఉచితంగా ప్రవేశాన్ని కల్పిస్తోంది. ప్రతిరోజూ ఉదయం 10.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు రాష్ట్రపతి నిలయం ప్రధాన పచ్చిక బయళ్లలో జరుగుతుంది. ప్రజలకు  గేట్ నంబర్ 2 ద్వారా ప్రవేశం కల్పించారు. సందర్శకులు తమ ప్రవేశాన్ని రాష్ట్రపతి భవన్ విజిట్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు లేదా విజిటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కియాస్క్‌ల వద్ద నమోదు చేసుకోవచ్చు.   11 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవానికి సంబంధించిన వివరాలను  రాష్ట్రపతి నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో   నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ సాగర్ హనుమాన్ సింగ్, వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్  జస్బీర్ సింగ్, మేనేజ్‌ డైరెక్టర్ డాక్టర్ శైలేంద్ర, రాష్ట్రపతి నిలయం మేనేజర్ డాక్టర్ కే రజనీ ప్రియ మీడియాకు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ అనుగు నరసింహారెడ్డి, రాష్ట్రపతి నిలయం ప్రజా సంబంధాల అధికారి  కుమార్ సమ్రేష్ కూడా ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.  

కవిత వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్లు

  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వాడుతున్న వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్లు నమోదైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రోజు శాసన మండలికి హాజరైన సందర్భంగా కవిత ప్రయాణించిన వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు పరిశీలన చేపట్టగా, వరుసగా నిబంధ నల ఉల్లంఘనలు చేసినట్లు గుర్తించారు. కవిత ప్రయాణించిన మార్సిడీస్ బెంజ్ కారుపై 6 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఆమె వినియోగిస్తున్న మరో లగ్జరీ వాహనం లెక్సస్ 450డి (Lexus 450D)పై 16 ట్రాఫిక్ చలాన్లు నమోదై ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం మీద రెండు వాహనాలపై కలిపి 22 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ట్రాఫిక్ శాఖ రికార్డుల్లో నమోదైంది. ఈ రెండు వాహనాలపై నమోదైన చలాన్ల విలువ మొత్తం రూ.17,770గా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఓవర్ స్పీడింగ్, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ వినియోగం వంటి ఉల్లంఘనలపై ఈ చలాన్లు విధించినట్లు అధికారులు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం, కవిత వాహనాలపై ఎక్కువగా నిజామాబాద్, కరీంనగర్, మెదక్, కామారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో ట్రాఫిక్ చలాన్లు నమోదయ్యాయి. ఆయా జిల్లాల్లోని ట్రాఫిక్ కెమెరాల ద్వారా ఉల్లంఘనలు గుర్తించి చలాన్లు జారీ చేసినట్లు సమాచారం. ప్రజాప్రతినిధుల వాహనాలైనా సరే, ట్రాఫిక్ నిబంధనల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా సరే చలాన్లు తప్పవని ఈ ఘటన మరోసారి స్పష్టంగా చూపిస్తోంది. ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, ప్రజల్లోనూ విస్తృత స్పందన వ్యక్తమవుతోంది. ట్రాఫిక్ నియమాల పాటనపై ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతగా వ్యవహరించాలనే అభిప్రాయం వినిపిస్తోంది.

జ‌గ‌న్ ఏపీకి ఒక లాస్ అకౌంట్ లాంటోడా...అయితే అదెలా?

  మాజీ సీఎం జ‌గ‌న్ ఏది వేలు పెడితే అదంతా కూడా ఖ‌ర్చేనా.. ఆయ‌న బెయిలుపై బ‌య‌ట ఉండ‌టానికీ ఖ‌ర్చే.. అడుగు బ‌య‌ట పెట్టాలంటే ఖ‌ర్చే. ఇంత ఖ‌ర్చు రాజ‌కీయం న‌వ్యాంధ్ర‌లాంటి రాష్ట్రానికి అవ‌స‌ర‌మా? ఇంత‌కీ జ‌గ‌న్ పెట్టిస్తోన్న అన‌వ‌స‌ర ఖ‌ర్చులేవి?  తాజాగా వెలుగులోకి వ‌చ్చినదేంటి? అని చూస్తే..  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జ‌గ‌న్ ఫోటో తొల‌గించాలంటే కూడా డ‌బ్బు ఖ‌ర్చు అవ‌స‌ర‌మ‌వుతుందా? అయితే ఎందుక‌ని?  జ‌గ‌న్ గ‌త ప్ర‌భుత్వ  హ‌యాంలో చేసిన అవినీతి త‌ద్వారా ఒక్క టీటీడీలోనే ప‌ద‌కొండు వేల కోట్లు లేపేయ‌గా.. మంత్రి అన‌గాని స‌త్య ప్ర‌సాద్ చెప్పిన‌ట్టు 2025 మొత్తం మ‌ద్య‌నామ సంవ‌త్స‌రంగా గ‌డిచిపోయిందా. కార‌ణం జ‌గ‌న్ త‌న హ‌యాంలో చేసిన మ‌ద్యం కుంభ‌కోణం వాటి లొసుగులు వెలికి తీయ‌డానికే స‌రిపోయింది. వీటిలో జ‌గ‌న్ హ‌యాంలో డైరెక్ట్ గా చేసిన లిక్క‌ర్ స్కామ్ విలువే 4 వేల కోట్లు. ఇక న‌కిలీ మ‌ద్యం కుంభ కోణం కొన్ని వేల కోట్ల‌ల్లో ఉంటుంద‌ని అంచ‌నా. ల్యాండ్- శాండ్- మైన్- వైన్- అంటూ జ‌గ‌న్ త‌న ఐదేళ్ల కాలంలో చేసిన అరాచ‌కాలు ఒక్కొక్క‌టి బ‌య‌ట‌కొస్తున్నాయి. ఆపై సంక్షేమం పేరిట ఎటూగాకుండా చేసిన ఖ‌ర్చు సుమారు రెండున్న‌ర ల‌క్షల కోట్లు. ఇవే ఏపీని ఆర్ధిక అంథ‌కారంలో నెట్టేశాయ‌నుకుంటే జ‌గ‌న్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటివి తీస్కొచ్చి ఆయ‌న బొమ్మ‌లను తొల‌గించాలన్నా డెబ్భై కోట్లు ఖ‌ర్చవుతుంద‌ని తెలిసి షాక‌వుతున్నారంతా. ఇప్ప‌టికీ స‌రిహ‌ద్దు రాళ్ల కోసం 700 కోట్లు, కాగా రేష‌న్ స‌రుకుల డెలివ‌రీకి మ‌రో 700 కోట్లు, రిషికొండ ప్యాలెస్ కోసం ఇంకో 600 కోట్లు భారీగా ప్ర‌జాధ‌నం వ్య‌యం చేశారు. ఇక‌ ఎగ్ ప‌ఫ్ ల నుంచి మొద‌లు పెడితే.. ఎలుకులు ప‌ట్ట‌డం వంటివి అటుంచితే ఆయ‌న ఇంటి చుట్టూ ఫెన్సింగ్, వైయ‌స్ విగ్ర‌హాల ఖ‌ర్చు, వీటితో పాటు పార్టీ రంగుల పై చేసిన వ్య‌యం  వంటివి త‌డిసి మోపెడ‌య్యాయి.  వీట‌న్నిటి నుంచి విముక్తి క‌లిగించాల‌న్నా కూడా ఎదురు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంది. కేవ‌లం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. జగన్ ఫోటో తొలగించాలంటే రూ.70 కోట్లు కావాల్సిందే అంటున్నారంటే ప‌రిస్తితేంటో ఊహించుకోవ‌చ్చు. ఏ మాట కామాట జ‌గ‌న్ ఏపీకి ఒక లాస్ అకౌంట్ లాంటోడా అంటే అవున‌నే తెలుస్తోంది. అత‌డి జాత‌కం ఎలాంటిదో చెప్ప‌లేం కానీ. ప్ర‌తిదీ ఖ‌ర్చే. ఆయ‌న వ్య‌క్తిగ‌త వియ‌మే తీసుకుంటే బెయిలుపై బ‌య‌ట తిర‌గ‌డానికి లాయ‌ర్ల‌క‌య్యే ఖ‌ర్చులే ఆరు వేల కోట్ల రూపాయ‌ల‌ని అంచ‌నా వేశారు. అలాంటిది జ‌గ‌న్ ఒక రాష్ట్రాన్ని ప‌రిపాలించాడంటే ఇంకెంత ఖ‌ర్చు చేస్తాడో ఊహించుకోవ‌చ్చంటున్నారు పలువురు. ఇదే చంద్ర‌బాబు.. స్వ‌యంగా జ‌నం సొమ్ము ఖ‌ర్చు చేయ‌కుండా ప్ర‌తిదాన్లో ఒక త‌రుణోపాయం ఆలోచిస్తారు. అది మెడిక‌ల్ కాలేజీల పీపీపీ కావ‌చ్చు, పేద‌రికాన్ని నిర్మూలించే పీ-4 ప‌థ‌కం కావ‌చ్చు. ఒక వేళ ఆయ‌న మోడీ కోసం యోగాంధ్ర నిర్వ‌హించ‌డానికి 3వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తే, అందులో మూడు ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చే ఉపాయ‌ముంటుంది.  అదే జ‌గ‌న్ అలాక్కాదు.. ప్ర‌తిదీ వ్య‌య‌మే. ఏమాట‌కామాట ఖ‌ర్చు కూడా ఒక పెట్టుబ‌డిలా చేయాలంటారు వారెన్ బ‌ఫెట్ లాంటి నిపుణులు. కానీ ఇలాంటివేవీ తెలియ‌ని పాబ్లో ఎస్కోబార్ మ‌న జ‌గ‌న్. ఏం చేయ‌ద్దాం.. ఏపీ త‌ల‌రాత అలా త‌గ‌ల‌బ‌డింది. ఇలాంటి లాస్ పొలిటీషియ‌న్ దొరికాడు ఏపీకని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు ప‌లువురు ఆర్ధిక రంగ నిపుణులు.   గ‌త ఎన్నిక‌ల్లో ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ‌ల్లే జ‌గ‌న్ ఘోర ప‌రాజ‌యం పాల‌య్యారు. అప్ప‌టి వ‌ర‌కూ ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల‌పై ఏపీ ప్ర‌భుత్వ రాజ‌ముద్ర ఉండేది. అది కాద‌ని త‌న పార్టీ నాయ‌కులు వారించినా విన‌కుండా తుగ్ల‌క్ చ‌ర్య చేప‌ట్టారు జ‌గ‌న్. ఆ పుస్త‌కాల‌పై త‌న ఫోటోలు ముద్రించారు. దీంతో ఆయ‌న కూడా ఈ అరాచ‌క విధానం కార‌ణంగా భారీ మూల్యం చెల్లించాల్సి వ‌చ్చింది. ఇపుడీ ఫోటోల‌ను తొల‌గించ‌డానికి కూడా ఏపీ ప్ర‌భుత్వానికి ఖ‌ర్చ‌య్యేలా తెలుస్తోంది. మ‌రి ఇలాంటి ఇంకెన్ని జ‌గ‌న్ మార్క్ న‌ష్టాలు బ‌య‌ట ప‌డ‌తాయో ఏంటో.. అన్న ఆందోళ‌న వ్యక్త‌మ‌వుతోంది స‌ర్వ‌త్రా.

గండిపేటలో 12 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా

  రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని గంధంగూడ గ్రామంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడుతూ హైడ్రా  కీలక చర్యలు చేపట్టింది. సర్వే నంబర్ 43 పరిధిలో ఉన్న 12.17 ఎకరాల ప్రభుత్వ భూమి క్రమంగా కబ్జాలకు గురవుతోందన్న స్థానికుల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైడ్రా స్పందించింది. భూమి ప్రభుత్వానికి చెందినదని నిర్ధారించిన అనంతరం శుక్రవారం ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎలాంటి అక్రమ ఆక్రమణలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంది. గంధంగూడ గ్రామంలోని సర్వే నంబర్ 43లో మొత్తం 26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారిక రికార్డుల్లో ఉంది. ఇందులో గతంలో ప్రభుత్వం ఒక ఎకరాను విద్యుత్ సబ్‌స్టేషన్‌కు, మరో 9 ఎకరాలను జీహెచ్‌ఎంసీ చెత్త డంపింగ్ అవసరాల కోసం కేటాయించింది. ఈ కేటాయింపుల అనంతరం మిగిలిన భూమి క్రమంగా కబ్జా అవుతుందని స్థానికుల నుండి హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్  ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు సంబంధిత రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల అధికారుల తో కలిసి హైడ్రా బృందం క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టింది.  భూమి ప్రభు త్వా నిదేనని స్పష్టంగా నిర్ధారించిన తరువాత, వెంటనే చర్యలు తీసుకో వాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.ఆ ఆదేశాల మేరకు ఈరోజు శుక్రవారం 12.17 ఎకరాల భూమి చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ భూమిలో ఒక ఆలయం, ఒక మసీదు నిర్మాణం ఉండటంతో, వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మిగిలిన ప్రభుత్వ భూమిని రక్షించారు. అంతేకాకుండా, ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తెలియజేసేలా హైడ్రా బోర్డులను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సుమారు రూ.1200 కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమిని కాపాడడం ద్వారా హైడ్రా మరోసారి కబ్జాలపై తన కఠిన వైఖరిని చాటిందని అధికారులు తెలిపారు. ప్రజా ఆస్తుల రక్షణే లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతుందని, ఎక్కడైనా ప్రభుత్వ భూములపై అక్రమ ఆక్రమణలు జరిగితే ప్రజలు వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. ఈ ఘటనతో గంధంగూడ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల రక్షణపై హైడ్రా చర్యలు చర్చనీయాంశంగా మారాయి.

3 రికార్డులకు చేరువలో విరాట్ కోహ్లీ

  టీమిండియా స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ కొత్త సంవత్సరంలో మూడు ప్రపంచరికార్డులకు చేరువలో ఉన్నాడు. అతడు సౌత్ఆఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక అజేయ హాఫ్ సెంచరీతో 2025ను ఘనంగా ముగించాడు. కొత్త ఏడాదిలో అతు మూడు మైలురాళ్లను అధిగమించవే అవకాశముంది.  విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో మరో 339 పరుగులు చేస్తూ.. ఈ లీగ్‌లో 9,000 పరుగులు చేసి తొలి బ్యాట్స్‌మాన్ అవుతాడు. ప్రస్తుతం అతడు 259 ఇన్నింగ్స్‌లో 8,681 పరుగులు చేసి ఐపీఎల్‌లో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.  అతడి తర్వాత 267 ఇన్నింగ్స్‌లో 7,046 పరుగులు చేసిన రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్‌లో మొదటి నుంచి ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక కోహ్లీ వన్డేల్లో మరో 443 పరుగులు చేస్తే 15,000 మైలురాయిని చేరుకుంటాడు. విరాట్ ప్రస్తుతం 296 ఇన్నింగ్స్‌లో 14,557 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.  లిటిల్ మాస్టర్ 452 ఇన్నింగ్స్‌లో 28,426 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు సచిన్ ఒక్కడే వన్డేల్లో 15,000పైగా పరుగుల చేశాడు. మరోవైపు న్యూజిలాండ్, టీమ్ ఇండియాల మధ్య జనవరి 11న తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఒక రికార్డు సృష్టించే అవకాశముంది.  ప్రస్తుతం అతడు అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 623 ఇన్నింగ్స్‌లో 27,975 పరుగులు చేశాడు. మరో 42 పరుగులు చేస్తే ఈ విషయంలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర 28,016 పరుగుల రికార్డును అధిగమిస్తాడు. అప్పుడు కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మాన్‌గా అవతరిస్తాడు.

మరోసారి సిట్ కస్టడీలో జోగి బ్రదర్స్

  నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ , ఆయన సోదరుడు రాములును మరోసారి సిట్ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు ఇద్దిరిని సిట్ విచారించనుంది. గతంలో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్‌ను సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో సారి వారిద్దరినీ కస్టడీలోకి తీసుకుని ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది.  ఈ కేసులో జోగి బ్రదర్స్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మరోవైపు జోగి కుటుంబానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జోగి భార్య, కుమారులకు 41ఏ నోటీసులు జారీ అయ్యాయి. జోగి రమేష్ అరెస్ట్ సమయంలో వైద్య పరీక్షలకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి జోగి ఫ్యామిలీకి పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు.

రేపు కొండగట్టుకు డిప్యూటీ సీఎం పవన్

  తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  శనివారం దర్శించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10గం.30ని. నుంచి 11 గం.30ని. మధ్య ఈ కార్యక్రమాలు ఉంటాయి. కొండగట్టు ఆంజనేయస్వామి వారిని పవన్  ఇలవేల్పుగా భక్తితో కొలుస్తారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కొండగట్టు స్వామిని డిప్యూటీ సీఎం దర్శించుకొని మొక్కులు చెల్లించుకొనున్నారు ఈ సందర్భంగా దేవాలయ అధికారులు, అర్చకులతో మాట్లాడినప్పుడు కొండగట్టు క్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులు దృష్టికి వచ్చాయి. దీక్ష విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని అధికారులు, అర్చకులు కోరారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ  సహకారంతో కొండగట్టు క్షేత్రంలో వీటి నిర్మాణానికి  ప్రతిపాదనలు చేశారు. సీఎం చంద్రబాబు  దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రివర్యులు సానుకూలంగా స్పందించారు.   పవన్  ఈ విషయమై టీటీడీ  ఛైర్మన్  బి.ఆర్.నాయుడుతో చర్చించారు. టీటీడీ బోర్డు రూ.35.19 కోట్లు మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపడతారు.  ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపం నిర్మించనున్నారు. శనివారం నిర్వహించే కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ ఏపీ శాసన మండలి విప్  పిడుగు హరిప్రసాద్ , చొప్పదండి ఎమ్మెల్యే  మేడిపల్లి సత్యం , టీటీడీ బోర్డు మెంబర్లు  బి.ఆనందసాయి , బి.మహేందర్ రెడ్డి , టీటీడీ ఎల్.ఎ.సి. ఛైర్మన్  ఎన్ శంకర్ గౌడ్ , ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్  కళ్యాణం శివ శ్రీనివాస్  తదితరులు పాల్గొననున్నారు. జనసేన కార్యకర్తలతో సమావేశం  ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, శ్రేణులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన వారితోనూ సమావేశం అవుతారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్టులో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు.

తెలుగు రాష్ట్రాల నదీ జలాల వివాదాలు...కేంద్రం కీలక నిర్ణయం

  తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదల పరిష్కారానికి కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర జల సంఘం ఛైర్మన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది.  కమిటీలో సభ్యులుగా కృష్ణా-గోదావరి బోర్డుల ఛైర్మన్లు, ఎన్‌డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజనీర్, సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ రెండు రాష్ట్రాల జల వనరుల శాఖ ఉన్నతాధికారులకు స్థానం కల్పించారు. కమిటీలో ఏపీ నుంచి నలుగురికి, తెలంగాణ నుంచి నలుగురికి చోటు కల్పించారు. నదీ జాల వివాదాల పరిష్కరానికి కమీటీని జల్‌శక్తి శాఖ నోటీపై చేసింది.  కాగా, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన గత జూలై 16న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డిలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కమిటీ ఏర్పాటు చేసి సంప్రదింపుల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కమిటీలో కేంద్ర జలశక్తి శాఖతో పాటు తెలుగు రాష్ట్రాల అధికారులు, సాంకేతిక నిపుణులను నియమించాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య ఇటీవల తీవ్ర వివాదస్పదమైన పోలవరం-బనకచర్ల/నల్లమల్ల సాగర్‌ ప్రాజెక్టుతో పాటు ఇతర వివాదాల పరిష్కారానికి ఈ కమిటీ కృషి చేయనుంది.  

తెలంగాణలో మద్యం విక్రయాలు సరికొత్త రికార్డు

  తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టించాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు  ఊహించని స్థాయికి చేరాయి. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే 1,350 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగడం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ గణాంకాల్లో నమోదైంది. ముఖ్యంగా డిసెంబర్ 30, 31 తేదీల్లో మాత్రమే ₹750 కోట్ల మేర మద్యం అమ్ముడుపోవడం విశేషం. కేవలం ఆరు రోజుల్లోనే ఇన్ని వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగడంతో అధికారులు ఆశ్చర్య చకితులయ్యారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్లు జనంతో కిటకిటలాడాయి. ఏ మద్యం షాపు, బార్ల ముందు చూసిన కూడా భారీ క్యూలు, రద్దీ ఉన్న దృశ్యాలే కనిపించాయి.   మద్యం దుకాణాల ద్వారా భారీ విక్రయాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల ద్వారా సుమారు 8.3 లక్షల ఐఎంఎఫ్ఎల్  కేసులు, 7.78 లక్షల బీర్ కేసులు విక్రయమైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బీర్ విక్రయాల్లో 107 శాతం పెరుగుదల నమోదు కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. నగర యువత, ఐటీ ఉద్యోగులు, న్యూ ఇయర్ పార్టీల కారణంగా బీర్ డిమాండ్ విపరీతంగా పెరిగిందని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నాయి. ఇక కేవలం డిసెంబర్ నెల మొత్తాన్ని పరిశీలిస్తే, రాష్ట్రంలో మొత్తం మద్యం విక్రయాలు ₹5,102 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే డిసెంబర్ నెలలో ఈ విక్రయాలు ₹3,500 కోట్లుగా మాత్రమే ఉండగా, ఈసారి భారీగా పెరగడం గమనార్హం. ఇది ప్రజల ఖర్చు ధోరణిలో వచ్చిన మార్పును, అలాగే పండుగలు–వేడుకల ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి అగ్రస్థానం మద్యం విక్రయాల్లో రెండు జిల్లాలు ఫోటా పోటీగా పోటీ పడ్డాయి.. లిక్కర్ అమ్మకాలలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి. కార్పొరేట్ సంస్కృతి, నైట్ లైఫ్, పెద్ద సంఖ్యలో పార్టీలు జరగడం వల్ల ఈ జిల్లాల్లో విక్రయాలు అత్యధికంగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న మద్యం దుకాణాలకు అర్ధరాత్రి వరకు, బార్లకు రాత్రి 1 గంట వరకు పనిచేసేందుకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఎక్సైజ్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయమే విక్రయాలపై కీలక ప్రభావం చూపిందని అధికారులు అంచనా వేస్తున్నారు. సరఫరా పరంగా కొన్ని ప్రాంతాల్లో స్వల్ప సమస్యలు తలెత్తినా, సరిపడా నిల్వలు, ప్రత్యేక తనిఖీలు, అదనపు సిబ్బంది ఏర్పాటు చేయడం వల్ల విక్రయాలు సజావుగా జరిగాయని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు వ్యాపారం ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు తెలంగాణలో మద్యం విక్రయాలు రూ.34,600 కోట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా అధికం కావడం రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం తీసుకొస్తోంది. మొత్తంగా చూస్తే, న్యూ ఇయర్ వేడుకలు తెలంగాణ మద్యం మార్కెట్‌కు బూస్ట్‌గా మారాయని, రాబోయే రోజుల్లో కూడా ఈ ట్రెండ్ కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.