కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. సచిన్ పైలట్ పై వేటు
posted on Jul 14, 2020 @ 2:08PM
రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ పై కాంగ్రెస్ అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. డిప్యూటీ సీఎం పదవితో పాటు రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవి నుంచి ఆయనను తప్పిస్తున్నట్టు వెల్లడించింది. అంతేకాదు, సచిన్ పైలట్ పక్షాన నిలిచిన ముగ్గురు మంత్రులను కూడా క్యాబినెట్ నుంచి తప్పించింది.
సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటాతో రాజస్థాన్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై చర్చించేందుకు సీఎల్పీ రెండు పర్యాయాలు సమావేశమైంది. సీఎల్పీ భేటీకి రావాలంటూ రెండుసార్లు ఆహ్వానించినా సచిన్ పైలట్ రాకపోవడంతో ఆయనను సాగనంపడమే మంచిదని పార్టీ తీర్మానించింది. సచిన్ పైలట్ పై వేటు వేసే తీర్మానానికి సభ్యులందరూ సరేననడంతో అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్ర గవర్నర్ కు నివేదించేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ రాజ్ భవన్ కు వెళ్లారు. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ను, మరో ముగ్గురు మంత్రులను క్యాబినెట్ నుంచి తొలగిస్తున్నట్టు గవర్నర్ కు తెలియజేశారు.
మరోవైపు, సచిన్ పైలట్‌కు బీజేపీ తలుపులు తెరిచే ఉన్నాయని ఆ పార్టీ నేత ఓం మథుర్ ప్రకటించారు. బీజేపీలోకి చేర్చుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఓం మథుర్ స్పష్టం చేశారు.