విశాఖకు వైసీపీ ముప్పు... పెద్ద కుట్ర ఉందంటోన్న సబ్బం
posted on Dec 25, 2019 8:46AM
టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖను రాజధానిగా ప్రకటించడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. జగన్ నిర్ణయంతో విశాఖకు పెనుముప్పు రాబోందని హెచ్చరించారు. సడన్‌గా విశాఖను రాజధానిగా చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానం వ్యక్తంచేశారు. విశాఖను నాశనం చేసేందుకే జగన్ ప్రభుత్వం ఇక్కడికి రాజధానిని మార్చుతోందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఆరు నెలలుగా భీమిలిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న సబ్బం హరి... ఖాళీగా ఉన్న భూముల్ని దోపిడీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఆధారాలతో సహా దోపిడీని బయటపెడతానని సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఇప్పటికే రౌడీ మూకలు దిగాయని... ప్రభుత్వం నోటిఫై చేసిన భూముల్ని స్వాహాచేసే కుట్ర జరుగుతోందని సబ్బం ఆరోపించారు. అమరావతిలో భూముల్ని కబ్జా చేయలేరు కాబట్టే కొత్త ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నారని... కానీ, వైసీపీ నేతల ఆటలు విశాఖలో సాగవన్నారు.
గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన వైసీపీ నేతలు ఎందుకు నిరూపించలేకపోయారని సబ్బం ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అవినీతి జరిగినట్లు వైసీపీ ప్రభుత్వం నిరూపించి ఉంటే జగన్ ను ప్రజలు నమ్మేవారని, కానీ కేవలం ఆరోపణలుచేసి బురద చల్లే ప్రయత్నం చేయడంతో విశ్వాసం కోల్పోయారన్నారు. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని... ఇప్పుడు రాజధానిగా ప్రకటించి చేసేదేమీ ఉండదన్నారు. విశాఖలో ఏవో రెండు భవనాలు కట్టడం మినహా ఏమీ చేయలేరని సబ్బం అన్నారు. విశాఖకు తనకున్న సహజ వనరులతో స్వతహాగా ఎదిగిందని, తమ స్వార్ధం కోసం వైజాగ్ ను నాశనం చేయొద్దని సూచించారు.
అయితే, బీజేపీ నేతలు తలుచుకుంటే అమరావతిని మార్చడం జగన్ తరం కాదన్నారు. మోడీ-షాతో చెప్పిస్తే జగన్ ఏమీచేయలేరని సబ్బం వ్యాఖ్యానించారు. ఏపీలో బీజేపీ బలపడాలనుకుంటే రాజధాని వివాదంలో కల్పించుకోవాలని, మోడీ-షాతో మాట్లాడి మూడు రాజధానుల ఆటలకు కళ్లెం వేయాలని సూచించారు. జగన్ కు ఓటేసినందుకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారన్న సబ్బం హరి... రాజకీయ కక్షల కోసం రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు.